Saturday, November 23, 2024
HomeTrending NewsNari Shakti Vandan: బిజెపికి ఓబీసి గండం ?

Nari Shakti Vandan: బిజెపికి ఓబీసి గండం ?

అమృత కాల మహోత్సవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం …రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టాలని పెద్ద ఎత్తుగడ వేసింది. కొత్త పార్లమెంటులో మొదటి బిల్లుగా  మహిళా బిల్లు ప్రవేశపెట్టి…మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని కమలం నేతలు ఉదరగొడుతున్నారు.

అందరు ఉహించినట్టుగానే బిల్లు సునాయాసంగా లోకసభ ఆమోదం పొందింది. అయితే బిజెపి మినహా అన్ని పార్టీలు బిల్లులో ఓ బీ సి ఉప కోటా కేటాయించాలని డిమాండ్ చేశాయి. బిల్లుపై చర్చలో భాగంగా ఓబీసి ల పట్ల మీ వైఖరి ఏమిటి అని రాహుల్ గాంధి సూటిగా ప్రశ్నించారు. ఎన్.సి.పీ ఎంపి సుప్రియ సులే, డిఎంకె ఎంపి కనిమొజిలు ఉపకోట ఇస్తే నష్టం ఏంటని నిలదీశారు.  జేడియు ఎంపి రాజీవ్ రంజన్ సింగ్ అయితే బిజెపి ఎన్నికల డ్రామా చేస్తోందని తీవ్ర స్థాయిలో కడిగేశారు. ఇలా అన్ని పార్టీలు ఓ బీ సి లకు మద్దతుగా మాట్లాడాయి.

ఎమ్మెల్సీ కవిత కృషి వల్లే మహిళా బిల్లు వచ్చిందని గులాబీ నేతలు రెండు రోజులుగా హడావిడి చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
అటు పార్లమెంటులో నామ నాగేశ్వరరావు ప్రసంగం గోడ మీద పిల్లి వాటంలా ఉంది. రాబోయే ఎన్నికల్లోనే మహిళ బిల్లు అమలు చేయాలి అంటాడు. ఓబీసి కోట ఉండాలి అంటాడు. ఇక్కడే తేలిపోయింది గులాబీ నేతల చిత్తశుద్ది ఏమిటో.

Mlc Kavitha Janthar Mantar

జనాభా లెక్కల్లో కుల గణన లేకుండా ఉపకోట ఎలా సాధ్యం. ఉన్నపళంగా అమలు చేయాలి అంటాడు. అంటే ఉపకోట లేకపోయినా పర్వాలేదని గులాబీ దండు కోరికనా? తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళితే కెసిఆర్ చిక్కులు ఎదుర్కోవాల్సిందే.

ఇక బిల్లుపై మాట్లాడిన అమిత్ షా ఓబీసి ఉపకోటపై ఆందోళన అవసరం లేదని…సమయానుకూలంగా సవరణలు చేయవచ్చు అని సెలవిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని వెల్లడించారు. అదే జరిగితే వాటితో పాటు ఓబీసి మహిళాలోకానికి అవకాశం ఇస్తామని స్పష్టంగా చెప్పవచ్చు.  ఆచరణలో పెట్టవచ్చు.  ఆ విషయం దాటేశారు.

ఇండియా కూటమిని మహిళా బిల్లుతో దెబ్బ తీశామని కమలం నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ర్యాలీలు, బహిరంగసభల ద్వారా మహిళ బిల్లు తమ గొప్పతనమే అని చెప్పుకునేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. బిజెపి పుట్టుక నుంచే అగ్రవర్ణాల పార్టీ అని పేరు ఉంది. కాలక్రమంలో బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వటంతో ఆ వర్గాలు కొంత దగ్గర అయ్యాయి.

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ద్వారా సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టిన బిజెపి బీసీలకు కొంత అవకాశాలు ఇస్తోంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ల ద్వయం మహిళా బిల్లు పర్యవసానాలు ఉహించి ఉండరా?  అయితే అగ్రవర్ణ అనుకూల విధానాల విషయంలో బిజెపిలో మార్పు రాలేదని మహిళా బిల్లుతో రుజువు కానుంది. ఇదే జరిగితే భస్మాసుర హస్తం మాదిరిగా మహిళా బిల్లుతోనే బిజెపి పతనం ప్రారంభం అవుతుందనటంలో సందేహం లేదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్