Thursday, February 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనట శిఖరం... మహా గ్రంథం

నట శిఖరం… మహా గ్రంథం

Akkineni.. a True inspiration for future generations…..జీవితం చాలా చిన్నది .. కాలం కరిగిపోతూనే ఉంటుంది .. సమయం తరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడో ఏదో సాధించాలని కూర్చుంటే చివరికి నిరాశే మిగులుతుంది. ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన ఇటుకలు ఇప్పటినుంచే పేరుస్తూ వెళితే అద్భుతమైన కోట ఆవిర్భవిస్తుంది. ఆ కోట గోడలపైనే కాదు .. దాని చుట్టూ ఉన్న చరిత్రలోను కష్టపడినవారి పేరు కనిస్తుంది .. వారు సాధించిన విజయంతరతరాల పాటు వినిపిస్తుంది. అలా నిరంతర సాధనతో తనని తాను మలచుకున్న మహర్షిలా అక్కినేని నాగేశ్వరరావు కనిపిస్తారు.

అక్కినేని .. తెలుగు సినిమా గురించి తెలిసినవారికి .. నవరసాల పట్ల అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ ఒక కన్ను అయితే మరో కన్ను ఏఎన్నార్.  ఆయన పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమా వైభవాన్ని గురించి చెప్పుకోవడం సాధ్యం కాదు. అంతగా ఆయన తెలుగు సినిమాను ప్రభావితం చేశారు. సాంఘిక .. జానపద .. పౌరాణిక సినిమాలపై తనదైన ముద్ర వేశారు. తెలుగు కథను తెరపై పడుచుపిల్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తూ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు.

ఆయన జీవితం ఏదో గాలివాటుకు సినిమాల వైపుకు కొట్టుకు రాలేదు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూక .. ‘రామాపురం’ గ్రామంలో జన్మించిన ఆయన, ఇష్టపడి ఇండస్ట్రీ దిశగా అడుగులు వేశారు. చిన్నప్పటి నుంచి ఆయనకి నాటకాలపై ఆసక్తి ఉండేది .. పద్యాలు కూడా బాగా పాడేవారు. నాటకాలలో ఎక్కువగా స్త్రీ పాత్రలను పోషిస్తూ ఉండేవారు. ఆ పాత్రలలో ఆయన ఒదిగిపోయే తీరు చూసి అప్పట్లో అంతా ఆశ్చర్యపోయేవారట. అలా నాటకాల నుంచే ఆయన ప్రయాణం సినిమాల దిశగా సాగింది. అలా ‘ధర్మపత్ని’ సినిమాలో ఆయన ఒక చిన్న వేషం సంపాదించుకోగలిగారు.

దర్శకుడు ఘంటసాల బలరామయ్య ‘సీతారామ జననం’ సినిమాతో అక్కినేనిని హీరోను చేశారు. ఆ తరువాత ‘బాలరాజు’ సినిమాతో అక్కినేనికి స్టార్ డమ్ వచ్చేలా  చేసింది కూడా ఆయనే. ఇక ‘కీలుగుర్రం’ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని, ‘దేవదాసు’ సినిమాతో జనం మెచ్చిన నటుడిగా నీరాజనాలు అందుకున్నారు. విషాదంతో కూడిన ప్రేమకథలలో అక్కినేనికి సాటి .. పోటీ లేదని అనిపించుకున్నారు. కెరియర్ తొలినాళ్లలోనే ఆయన ఆ స్థాయి నటనను ప్రదర్శించడం గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.

ఇక ఆ తరువాత కాలంలో పౌరాణికాలలో ఎన్టీఆర్ దూసుకుపోతుంటే .. జానపదాలలో కాంతారావు చెలరేగిపోతుంటే, అక్కినేని రొమాంటిక్ హీరోగా సాంఘిక చిత్రాలలో తన విశ్వరూపం చూపించారు. అంతేకాదు అటు ఎన్టీఆర్ .. ఇటు కాంతారావులతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. పట్నం దొరబాబు పాత్రల్లో ఆయన ఎంతటి హుందాగా కనిపించేవారో, పంచెగట్టి ముల్లుగర్ర చేతబడితే పల్లెటూరి బుల్లోడుగా కూడా అంతేలా తన దూకుడు చూపించేవారు.

భగవంతుడి పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతటి పేరును సంపాదించుకున్నారో, భక్తుడి పాత్రల్లో ఏఎన్నార్ అంతటి పేరును సొంతం చేసుకున్నారు. జయభేరి .. విప్రనారాయణ .. భక్త తుకారాం .. చక్రధారి … మహాకవి క్షేత్రయ్య వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఇక మహాకవి కాళిదాసు .. అమరశిల్పి జక్కన్న .. తెనాలి రామకృష్ణ వంటి సినిమాలు అసమానమైన ఆయన నటనకు అద్దం పడతాయి. ఆయన నటనలో గొప్పతనానికి నిర్వచనం చెబుతాయి.

అక్కినేని సినిమాలు .. ఆయన నటనలో ప్రత్యేకతల గురించి చెప్పుకోవడమంటే, ఒక మహా గ్రంథాన్ని ఒక్క పేజీలో చెప్పడానికి చేసే సాహసమే అవుతుంది. ‘బుద్దిమంతుడు’ చూస్తే పాత్రలలోని వైవిధ్యాన్ని ఆయన ఎంతలా ఆవిష్కరించేవారో అర్థమవుతుంది. ‘సూత్రధారులు’ చూస్తే పాత్రల్లో ఆయన ఎంతలా ఇమిడిపోతారనేది స్పష్టమవుతుంది. ‘మేఘసందేశం’ చూస్తే నటనలో ఆయన మేరుపర్వతమనే విషయం బోధపడుతుంది.

‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాలో తన వయసుకి తగిన పాత్రలో మెప్పించిన ఆయన, తన వయసుకి ఎంతమాత్రం సంబంధం లేని ‘కాలేజ్ బుల్లోడు’ సినిమా చేసి అల్లరి చేయడం ..  అలరించడం అక్కినేనికి మాత్రమే సాధ్యమైంది. నటనలో శిక్షణ పొందాలనుకునేవారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవలసిన పనిలేదు. అక్కినేనిని మించిన పెద్ద బాలశిక్ష లేదు. ఆయన ప్రతి పాత్ర ఒక పాఠమే .. నవరసాలు పొదగబడిన పసిడి పీఠమే.

ఎదురులేని నటుడిగా తిరుగులేని ప్రయాణాన్ని సాగించిన అక్కినేని, నిర్మాతగా కూడా ఎన్నో విజయాలను చూశారు. పద్మశ్రీ .. పద్మభూషణ్ .. పద్మ విభూషణ్ వంటి పురస్కారాలను, రఘుపతి వెంకయ్య .. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు. అభినయమంటే అక్కినేనిదే .. అనితర సాధ్యమైన ప్రయాణమంటే అక్కినేనిదే అని చాటిన ఆ నట సామ్రాట్ నేడు 20, సెప్టెంబర్ 2023 నాటికి 99వ జయంతి పూర్తి చేసుకుని శతజయంతి ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త‌ జ‌యంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ఆయన పంచ‌లోహ విగ్ర‌హాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రాంగ‌ణంలో  మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆవిష్కరించారు.

–  పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్