Hanging Pillar: ప్రపంచంలో ఎక్కడైనా రాతి స్తంభం గాల్లో వేలాడుతుందా?
ఎక్కడైనా స్తంభం మీద పైకప్పు దూలాలు నిలబడతాయి కానీ…పైకప్పును పట్టుకుని రాతి స్తంభం వేలాడుతూ ఉంటుందా?
ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ…లేపాక్షిలో ఉంటుంది.
ఇప్పుడు మనకు ఫోటోలు, ఆడియోలు, వీడియోలు దేనికవి విడిగా దొరుకుతాయి. వీటిల్లో ఒక్కో దానికి ఒక్కో అనుకూలత, ఒక్కో అననుకూలత ఉంటాయి. ఫొటోలో శిల్పం అందం కొంతవరకే తెలుస్తుంది. శిల్పాన్ని 360 డిగ్రీల్లో తిరిగి చూసినట్లు, తాకినట్లు ఫొటోలో కుదరదు. శిల్పంలో చెక్కలేని బ్యాక్ గ్రవుండ్ ను వర్ణచిత్రంలో చూపించవచ్చు. ఒక కథను వరుస చిత్రాల్లో చూపించినట్లు శిల్పం మీద ఒక వరుసలో కథను చెప్పవచ్చు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని రాతికి ఉన్న పరిమితులను దాటి శిల్పులు చేసిన అద్భుతం లేపాక్షి ఆలయంలో నాట్యమండపం. దీన్నే ముఖమండపం లేదా రంగమండపం అని కూడా అంటారు.
మొదటి ప్రాకారపు ప్రధాన ప్రవేశ ద్వారం దాటి, ధ్వజస్తంభం పక్కనుండి రెండో ప్రాకారం ద్వారంలోకి ప్రవేశించి మెట్లెక్కగానే…గర్భగుడి ముందున్నది నాట్యమండపం. లేపాక్షి ఆలయానికి ఇది గుండెకాయ లాంటిది. ఒళ్లంతా కళ్లు చేసుకుని అంగుళమంగుళం అనుభవించాల్సిన శిల్పసోయగం; పైకప్పు వర్ణచిత్రాల పురాణ కథలు; నలుదిక్కుల్లో ఎటు వెళ్లి చూసినా…మనవైపే చూసే వటపత్రశాయి కృష్ణుడు; భిక్షాటన మూర్తి, బ్రహ్మ, తుంబురుడు, నందికేశ్వరుడు, రంభ, భృంగి, చంద్రుడు, నటరాజు విగ్రహాల స్తంభాల్లో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
70 స్తంభాల ఈ నాట్యమండపంలోనే వేలాడే స్తంభం ఉంది. లేపాక్షికి వెళ్లినవారు తప్పనిసరిగా చూడాల్సిన మూడు అద్భుతాలు:-
1 . నంది
2 . వేలాడే స్తంభం
3 . సీతమ్మ పాదం
ప్రభుత్వం తరపున అధికారికంగా లేపాక్షి చరిత్రను తవ్వితీసి క్రోడీకరించిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఆమంచర్ల గోపాలరావు గారి (Lepakshi, Published by Andhra Pradesh Lalit Kala Akademi, 1969) ప్రకారం నాట్యమండపంలో వేలాడే స్తంభం ఒకటి కాదు. రెండు. ఒక స్తంభం లోకానికి తెలిసింది. ఆయన పేర్కొన్న రెండో స్తంభం ఏదో తెలియదు. దాదాపు పదిహేను అడుగుల ఎత్తు, ఒకటిన్నర చదరపు అడుగు చతురస్రపు కొలతతో నాట్యమండపంలో కుడి- ఎడమ పక్కల్లో రెండు స్తంభాలు వేలాడుతూ ఉండేవి. 1910లో ప్రముఖ బ్రిటిష్ ఇంజనీర్ హామీల్టన్ వేలాడే స్తంభాల అద్భుతాన్ని పరీక్షించడానికో లేక ఒప్పుకోవడానికి ఇష్టపడక తుంటరితనంతోనో కింద గునపం పెట్టి కొద్దిగా కదిలించాడు. దాంతో నాట్యమండపం పైకప్పు రాళ్లు కదిలాయి. అయిదారు స్తంభాలు పైభాగంలో కొద్దిగా పక్కకు జరిగాయి. అంతకుముందు పూర్తి గాలిలో తేలుతున్న స్తంభం ఒక మూల ఒక్క అంగుళమంత చోటు మీద నేలకు ఆనింది. ఇప్పటికీ 99 శాతం గాల్లోనే ఉంది. మాయాబజార్లో పింగళివారన్నట్లు పెళ్లి చేయడమంటే కష్టం కానీ…చెడగొట్టడం చిటికెలో పని. అలా వేలాడే స్తంభాన్ని నేలకు ఆనించిన హామిల్టన్ ను తరతరాలుగా లేపాక్షి శపిస్తూనే ఉంది.
ఈ వేలాడే స్తంభాన్ని ఒక బ్యాలెన్సింగ్ పిల్లర్ గా ఉద్దేశపూర్వకంగానే శిల్పి నిర్మించాడని, అర అంగుళం జరపగానే పైకప్పు రాతి దూలాలు కదిలిపోయాయని…ఇంకొంచెం జరిపి ఉంటే మొత్తం నాట్యమండపమే కూలిపోయి ఉండేదని నమ్మనివారు ఒక సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. మిగతా 69 స్తంభాలు ఎలా ఉన్నాయో…ఈ వేలాడే స్తంభం కూడా అలాగే రాతి ఫ్లోర్ కు అనుకుని ఉండేదని...సరిగ్గా ఈ స్తంభం ఉన్నచోట నేల ఎందుకో కొంచెం కిందికి కుంగిపోవడంతో…స్తంభానికి- ఫ్లోర్ కు గ్యాప్ వచ్చిందన్నది వారి సిద్ధాంతం. పునాదులే లేకుండా రాతి ప్లాట్ ఫార్మ్ మీద కేవలం స్తంభాలను నిలుచోబెట్టి…ఆ స్తంభాల మీద రాతి దూలాలను పేర్చి…దానిమీద ఇప్పటి సిమెంట్ కాంక్రీట్ లాంటి రుబ్బిన సున్నం, ఇటుక మిశ్రమాన్ని స్లాబుగా వేసిన లేపాక్షి శిల్పులు చనిపోయారు కాబట్టి బతికిపోయారు. లేకపోతే పిల్లర్లు కుంగే మన నవీన సిద్ధంతాం విని విరుపణ్ణ కథలోలా తమ కళ్లను తామే పెరుక్కుని…నాట్యమండపాన్ని కట్టకుండా మధ్యలోనే వదిలేసి నిజంగానే పోయేవారు.
లేపాక్షి వెళ్లినప్పుడు ఈ స్తంభం కింద పేపరో, వస్త్రమో పెట్టి వేలాడే రాతి స్తంభం అనుభూతి పొందండి. ఆశ్చర్యపోండి. స్తంభానికి అనుకుని ఫోటో తీసుకోండి. హామిల్టన్ దుందుడుకు చర్యకు పక్కకు ఒరిగిన స్తంభాలను తల పైకెత్తి చూడండి. కదిలిన పైకప్పును చూసి బాధపడండి. నాట్య మండపం మధ్యలో ఇరవై అడుగుల ఎత్తున ఫాల్ సీలింగ్ లా రాతిలో విచ్చుకున్న శత పత్ర దళ కమలం సౌకుమార్యాన్ని గుండెల నిండా నింపుకోండి.
నేలమీద గుడిగోపురం అందరూ కడతారు. నేలకు ఆనకుండా వేలాడే స్తంభాలను లేపాక్షి శిల్పులు మాత్రమే కట్టారు.
రేపు:-అదిగో లేపాక్షి-6
“రాతిలో నీటి ఊటలూరే
సీతమ్మ పాదం”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018