Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆంధ్రాంగ్ల అనుబంధాలు -2

ఆంధ్రాంగ్ల అనుబంధాలు -2

CP Brown for Telugu Literature: మొదటి భాగంలో క్రిష్ణదేవరాయల కాలం తెలుగునుడికి బంగారుకారు అని చెప్పుకున్నాం కదా. రాయలవారి సాహితీ సభకు “భువన విజయం” అని పేరట. అష్టదిగ్గజాలు ఆ సభను మోసినప్పుడు రాయలవారికి ప్రపంచాన్నే జయించినట్లు అనిపించిందేమో మరి!! పోలిక కోసమే అంటున్నప్పటికీ, క్రిష్ణదేవరాయులవారి సభలోలాగానే బ్రౌన్‌దొరగారి బంగళాలో కూడా సాహితీ చర్చలు నడిచాయి. బ్రౌన్‌దొర కడప నుంచీ ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన తర్వాత కూడా ఒక దశాబ్దం పాటు, అదే బంగ్లాలో బ్రౌన్‌దొర స్వంతఖర్చులతోనే ఈ చర్చలు నడిచాయి.

పండితులంతా చర్చల్లో కూర్చొని, పలు కావ్యాల గురించి చర్చించి ఒక గ్రంథాన్ని మొదట ఎంపిక చేసేవారు. ఇలా ఎంపిక చేసిన ప్రతి గ్రంథముద్రణా ఒక యఙ్ఞమే. ఆ కార్యమేదో బ్రౌన్‌దొర గారి మాటల్లోనే విందాం –

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ది చెందినస్వారోచిష మనుచరిత్రకావ్య ముద్రణలో మా పరిశ్రమ గురించి వివరిస్తాను. ముందుగా నేను 12 తాళపత్రాలను సంపాదించాను. వాటిలో రమారమి సంపూర్ణంగా ఉన్న వ్రాతప్రతిని ఎంపిక చేసి ఒక నకలు చేయించాను. నకలు రాతప్రతిలో ప్రతి పద్యానికి అంకెలు వేయించా, అంతేకాక ప్రతి కాగితంలో ఒక పక్క ఉద్దేశపూర్వకంగానే ఖాళీగా ఉంచాం.

ఒక లేఖరి కొత్త నకలు రాతప్రతితో కూర్చొనే వాడు. సేకరించిన 12 తాళపత్రాలను చెరోసగం తీసుకొని లేఖరి ఎదురుగా ఇంకో ఇద్దరు సహాయకులు కూర్చొనే వారు. వీరు ముగ్గురూ తెలుగు బాగా తెలిసిన వారే. ముగ్గురేకాక, తెలుగు,సంస్కృత వ్యాకరణ చంధస్సుల్లో నిష్ణాతులైన మరో ముగ్గురు పండితులు కూడా వీరి పక్కనే కూర్చునే వారు.

ఒక పద్యాన్ని తీసుకోవడం, సహాయకులు తమ ముందు ఉన్న తాళపత్రాల్లో ఒక్కో వ్రాతప్రతిలోంచి ఆదే పద్యాన్ని వంతులవారిగా చదివేవారు. ఇలా ఒక పద్యం పదినుండి పన్నెండుసార్లు చదవబడేది. ప్రతిసారి వల్లెవేసినపుడూ దీర్ఘము,వత్తు,అరసున్నా,విసర్గ ఇలా చిన్న వ్యత్యాసమైనా లేఖరి ఖాళీగా ఉన్న వైపు రాసేవాడు.

ఇలా అన్ని తాళపత్రాల్లోంచి ఒక పద్యం చదవడం అయిన తర్వాత, ముగ్గురు పండితులూ పద్యంలోని ఒక్కో పంక్తినీ అందులోని ప్రతి వ్యత్యాసాన్నీ చర్చించేవారు. చివరకు వారందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సంస్కరించబడిన పూర్తి పద్యాన్ని లేఖరికి మళ్ళీ చెప్పేవారు. ఇలా నెలలు సాగేది. ఒక్కోసారి అసలు పద్యాల్లో మూడుకంటే ఎక్కువ పంక్తులు ఉండేవే కావు, అప్పుడు అదనపు ప్రతులకోసం వెదుకులాట మొదలయ్యేది.”

ఇప్పుడు మనం చెప్పుకొన్నదంతా పైకి కనపడే శ్రమ, పైకి కనపడని ముఖ్యమైన తంతు ఇంకోటి ఉంది – వ్యయం. పండితులకు ఒక్కొక్కరికీ నెలకు 15 రూపాయలు, సహాయకులకు ఒక్కొక్కరికీ 8 రూపాయలు, లేఖరికి ప్రతి వంద పద్యాలకూ ఒక రూపాయి. నకలు ప్రతి చేసినందుకు ప్రతి రెండు వందల పద్యాలకూ ఒక రూపాయి. ఒక గ్రంథ సంస్కరణ పూర్తయిన తర్వాత ఇంకో పండితుడు మళ్ళీ మొత్తం ప్రతి చదివి సరిగా ఉందని సంతకం చేయాలి, అతనికేమో 12 రూపాయలు.

ఇప్పుడు మనకంటికి తక్కువగా కనిపించవచ్చు కానీ, 200 ఏళ్ళ ముందు అది మంచి జీతమే. పండితుల శ్రమకు తగ్గఫలం ఉండాలని బ్రౌన్‌దొర కూడా చుట్టూపక్కల సంస్థానాల్లో, కళాశాలల్లో ఇచ్చే భత్యాల గురించి వాకబుచేసి మరీ ఈ లెక్కలు నిర్ణయించాడు. ఈ ఖర్చులంతా కూడా బ్రౌన్‌దొర జేబులోంచి పెట్టినవే, పూర్తిగా ఆయన స్వార్జితం.

ఒక్క ఆంధ్రమహాభారతం ప్రచురణకు బ్రౌన్‌దొరకు అయ్యిన ఖర్చు అక్షరాలా 2,714/- రూపాయలు. అప్పట్లో బ్రౌన్‌దొర నెలజీతం 500 రూపాయలు అని తెలిసుకొంటే చాలు, మిగిలిన శ్రమను ఊహించడం కష్టమేమీకాదు.

యాగఫలాలు:
బ్రౌన్‌దొర సాధించిన పనుల గురించి రాయాలంటే దానికదే పెద్ద గ్రంథం అవుతుంది కాబట్టి, ఆయన తెలుగు తల్లికి చేసిన సేవల్లో మహోన్నతమైనవి కనీసం కొన్నైనా తలుచుకొందాం.

1.సొంత రచనలు:

  • బ్రౌణ్య నిఘంటువు (తెలుగు-ఆంగ్ల నిఘంటువు)
  • ఆంధ్ర గీర్వాణ చందము (తెలుగు సంస్కృత వ్యాకరణ,చంధస్సుల సమగ్రం)
  • వాక్యావళి (సులభంగా తెలుగు నేర్చుకోవడానికి, విద్యార్థులనుద్దేశించి రాసిన పుస్తకం)

2.ప్రచురణలు:

  • పోతన శ్రీమహాభాగవతం
  • ఆంధ్రమహాభారతం
  • వేమన శతకం
  • పెద్దన మనుచరిత్ర

3.సేకరణలు:
బ్రౌన్‌దొర ఇంగ్లండ్‌కి తిరిగి వెళ్ళే ముందు 5751 వ్రాతప్రతులను పలు సంస్థల చేతిలో భద్రం చేసి వెళ్ళాడు. వీటిలో చాలా అప్పటికే పరిష్కరించబడి ముద్రణకు సిద్దంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని మేలిమి వజ్రాలు – బసవపురాణం, ఉత్తరరామాయణం, విజయవిలాసం, కాశీఖండం, సుమతీశతకం.
(ఇంకా ఉంది)

–  నూచర్ల మహేశ్

(రచయిత ఆంధ్ర దేశం నుండి ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ వృత్తి నిపుణుడు. తెలుగు సాహితీ పిపాసి. ఎక్కడున్నా తెలుగు వెలుగులను వెతుక్కునే అన్వేషి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్