Dedicated to Telugu:
“యత్పురుషేణ హవిషా దేవా యఙ్ఞమతన్వత
వసంతో అస్యా సీదాజ్యం గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః”
ఋగ్వేదంలో పురుషసూక్తం సృష్టికి యఙ్ఞానికి ఒక అందమైన సారూప్యాన్ని చూపిస్తుంది. కాలాన్ని(వసంత,గ్రీష్మ,శరదృతువులు) హోమద్రవ్యంగా వాడి, విరాట్‌పురుషుణ్ణి ఆహుతి ఇచ్చి, దేవతలు సృష్టియఙ్ఞం చేస్తే, ఆ యాగం నుంచి చరాచర జీవులు ఉద్భవించాయంటుంది. ఒక్క పరమాత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నాడని ఒకవైపు చెబుతూనే, ఇంకోవైపు భగవంతుడు తను మొదలుపెట్టిన ఒక గొప్పపనికి, తనే సమిధలా మారాడని చెప్పడం ఒక అబ్బురమైన పోలిక.
పుట్టుకతో ఏమీ బ్రౌన్ ధనవంతుడు కాదు. భారతదేశానికి రావడానికి కారణం కూడానూ, ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆనాడు భారతదేశంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉండడం. తెలుగు నేర్చుకోవడం అనేది కూడా మొదట్లో బలవంతపు బ్రాహ్మణార్థమే. కానీ మెల్లమెల్లగా, ఉద్యోగం కోసం తెలుగు అనేది కాస్తా తెలుగు కోసమే ఉద్యోగం అన్నట్లు తయారయ్యింది. తోటి బ్రిటీషర్లు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, బ్రౌన్ దినచర్య ప్రతి ఉదయం 5 గంటలనుంచి 10 గంటల వరకూ తెలుగు కావ్యాలపై చర్చల్లో, ముద్రణా వ్యవహారాల్లో నడిచేది. ఉదయం 10 నుంచీ ఉద్యోగ బాధ్యతలు, సాయంత్రం నుంచీ మళ్ళీ తెలుగు వ్యవహారాలే.
వ్యసనం ఒక మనిషిని జీవితాన్ని నాశనం చేయడమే కాక, తనవాళ్ళ జీవితాలను కూడా చెరుస్తుందటారు. బ్రౌన్‌కి తన వ్యసనం గురించి తెలుసు, వ్యక్తిగత జీవితంలో తనకే దొరకని సమయాన్ని, ఇంకొకరికి పంచలేనని కూడా తెలుసు. అందుకే తన జీవితంలోకి ఎవరినీ రానివ్వలేదు. పెళ్ళిపెటాకులు వదులుకొని బ్రహ్మచారిగానే మిగిలి, ఆ కాసింత దొరికే సమయమూ తెలుగు కోసమే కేటాయించాడు. ముందు మనం తెలుగు కోసమే ఉద్యొగం అనుకొన్నాం కదా! ఆ దశ కూడా దాటి, చివరకు తెలుగు కోసమే జీవితం అనేంతగా మారింది.
బ్రౌణార్యులు తెలుగునేల నాలుగుచెరలా వెదకి సమకూర్చుకొన్న తెలుగు మరియు సంస్కృత వ్రాతపతుల సంఖ్య రమారమి 5000, ఆయన వాటికి 200 ఏళ్ళ క్రితమే వెచ్చించిన ధనం అక్షరాలా 30,000 రూపాయలు. జీతం డబ్బులతో గ్రంథాలు సేకరించే అలవాటు దాటి, తాళపత్రాల సేకరణ కోసం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవడం కూడా మొదలయ్యింది. ఇందులో స్వార్థం కన్నా, బ్రౌణార్యులకు తెలుగు మీద ఉన్న ప్రేమే ఎక్కువ. ఎందుకంటే తన తర్వాత కూడా తను మొదలుపెట్టిన సాహిత్య ముద్రణాయఙ్ఞం కొనసాగాలని, తను కష్టపడి కూడబెట్టిన సాహితీభాండాగారాన్ని తిరిగి ఇంగ్లండ్‌కి వెళ్ళేముందు, మద్రాస్‌లోని ప్రాచ్య వ్రాతప్రతుల గ్రంథసంస్థకు, ఇంకా ఇతర సంస్థలకు అప్పజెప్పి మరీ వెళ్ళాడు.
చదువుతున్నప్పుడు బ్రౌన్‌కేమన్నా పిచ్చా అని మనకనిపిస్తే అందులో ఆశ్చర్యం ఏమి లేదు, ఎందుకంటే బ్రౌణార్యులకు కూడా ఇదే అలోచన చాలాసార్లు వచ్చిందట. మళ్ళీ తనకుతానే ఇది వెఱ్ఱి కాదని సర్ది చెప్పుకొనేవాడట. బ్రౌణార్యులకు తెలుగు మీద మమకారం ఎంత ఎక్కువంటే, ఇంగ్లండ్‌కి వెళ్ళిన తర్వాత కూడా లండన్ విశ్వవిద్యాలయం(ప్రస్తుత University College of London) లో తెలుగు ఆచార్యులగా పనిచేస్తూనే గడిపాడు. తనకితాను ఏదో సర్దిచెప్పుకొని ఉండవచ్చు కానీ, అనుమానమేమి అక్కర్లేదు బ్రౌన్‌కి పిచ్చే, తెలుగు పిచ్చి. బ్రౌణార్యుల తెలుగు వ్యసనం, ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో గాని, తెలుగు నుడికి మాత్రం మంచే చేసింది.
పొయినసారి లండన్ వెళ్ళినప్పుడు, కెన్సల్ గ్రీన్ స్మశానంలో ఉన్నఆయన సమాధికి వెళ్ళి నివాళి అర్పించే భాగ్యం కలిగింది. ఔత్సాహికుల కోసం ఆయన సమాధి ఉన్నచోటుకి గూగుల్ లంకె కూడా కింద ఇస్తున్నాను. లండన్ తెలుగుసంఘం వారు బ్రౌణార్యుల సమాధిని పునరుద్ధరించడం ఎంతో అభినందనీయం. అన్నట్టు డిసెంబర్ 12 బ్రౌణార్యుల వర్ధంతి.
తిరుగు ప్రయాణంలో ఎవేవో అలోచనలు – భారత, భాగవతాలను అచ్చు పుస్తకాల్లో చూసిన తొలి తరం స్పందన ఎలా ఉండి ఉండొచ్చు? తెలుగు సాహిత్యం అచ్చు పుస్తకాలతో అందుబాటులోకి రావడం ప్రారంభమైన ఒక తరం తరువాత అంటే 1870లనుండి తెలుగులో ఎన్నో కెరటాలు. తొలిగా తిరుపతి వేంకట కవులు, గురజాడ, కట్టమంచి వంటివారు. అటుపై 1900లనుండి, వీరి వారసులు విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి, దాశరథి, ఇంకా ఎందరో, ఒకరి తర్వాత ఒకరు తెలుగు సాహిత్యాన్ని ఊపేయలేదూ!! ఇన్ని అలలు వరుసగా రావడానికి, ఇంత పొంగు పొర్లడానికి, అల్మారాలలోకి ఎక్కువగా సాహిత్య పుస్తకాలు చేరడం కారణమై ఉండవచ్చా? ఇంతలా కొత్తకొత్త పుంతలు తొక్కిన తెలుగు సాహిత్యాన్ని చూసి, బ్రౌన్ ఒకవేళ బ్రతికి ఉండుంటే ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యిఉండేవాడు?
దాదాపు 160 ఏళ్ళ కిందట, బ్రౌణార్యులు తన గురించి ఒకింత గర్వంతో చెప్పుకొంది ఇదీ.
“Telugu literature was dying out; the flame was flickering in the socket. In 1825, I found Telugu literature dead. In 30 years, I raised it to life.”
సాహిత్యం కనుమరుగవుతుంటే, గ్రంథాలను సంస్కరించడానికి ఆనాడు బ్రౌన్ పండితులు ఉన్నారు. ఈనాడు వాడుకభాషలోనే తెలుగు కనుమరుగవడం లేదూ? మరి మనుషులను సంస్కరించడానికి ఇప్పుడు ఏం కావాలి? ఈ ప్రశ్నకు నిజాయితీగా మనస్సులకు సమాధానం చెప్పుకోవడమే మనం బ్రౌణార్యులకిచ్చే నివాళి.
లంకెలు:
- బ్రౌణార్యుల సమాధి, గూగుల్‌లో – https://maps.app.goo.gl/AZRgeS589dMKEu9N7
- జానుమద్ది హనుమశాస్త్రి గారి మూలరచన – https://www.jstor.org/stable/23342348
- బ్రౌన్‌తోపనిచేసి, తెలుగుసాహిత్యసేవలోపాలుపంచుకొన్నకొంతమంది పండితులపేర్లు. సేకరించి ఈవ్యాసంలో వాడుకొనేందుకు అనుమతించిన విశ్వనాథ్ గారికి (అనంతపురం) నెనర్లు.
(1) అద్వైతం బ్రహ్మయ్య
(2) సముద్రాల అనంతాచార్యులు
(3) జూలూరి అప్పయ్య
(4) ముడుంబి కృష్ణమాచార్యులు
(5) నందివాడగుర్రాజు
(6) పట చంద్రయ్య
(7) పరవస్తు నరసింహాచార్యులు,
(8) బోయినపల్లి చెంచయ్య
(9) తిరుపతి తాతాచార్యులు
(10) కంభం నరసింహాచార్యులు
(11) చిలకమర్రి నరసింహాచార్యులు
(12) సముద్రాల నరసింహాచార్యులు
(13) ములుపాక బుచ్చయ్యశాస్త్రి
(14) అరణిమఠం వీరభద్రయ్య
(15) వారణాసి వీరాస్వామి
(16) వంగీపురం వెంకట కృష్ణమాచార్యులు
(17) పైడిపాటి వెంకటనరసయ్య
(18) దంపూరి వెంకటసుబ్బశాస్త్రి
(19) గరిమెళ్ళ వెంకయ్య
(20) మామిడి వెంకయ్య
(21) తెన్నెల సింగటయ్య
(22) నందివాడసుబ్బన్న
(23) బొడ్డపాటి సుబ్బన్న
– నూచర్ల మహేశ్
(రచయిత ఆంధ్ర దేశం నుండి ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ వృత్తి నిపుణుడు. తెలుగు సాహితీ పిపాసి. ఎక్కడున్నా తెలుగు వెలుగులను వెతుక్కునే అన్వేషి)