About Penugonda: పెనుగొండలక్ష్మి పద్యకావ్యం చివర గ్రంథకర్త సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుకొండ ఘనచరిత్ర గురించి చెప్పిన మాటలివి:-
పెనుకొండ స్థలదుర్గం. క్రియాశక్తి ఒడయదారు కట్టించాడని కొందరంటారు. కానీ- హొయసల రాజులు నిర్మించి ఉంటారనుకుంటాను. “ఆశియ మాచయ్య” హొయసల రాజప్రతినిధి. మధుర సుల్తానులతో యుద్ధంలో అతడు మరణించాడు. విద్యారణ్యుల చిన్నతనం పెనుకొండలోనే గడిచింది. మాచయ్య బంగారం దాచి ఉంచిన స్థలాలు విద్యారణ్యులకు తెలుసని, అతడు ఆ బంగారాన్ని పెనుకొండ నుండి విజయనగరానికి తరలించాడని పెద్దలంటారు. విద్యారణ్యులు పెనుకొండవాడే అనడానికి కొన్ని ఆధారాలున్నాయి.
పెనుకొండలో 300 ఆలయాలు ఉండేవి. కాలప్రవాహంలో కొన్ని ఆలయాలు మసీదులయ్యాయి. చెరువుకు వెళ్లే దారిలో రామాలయం. ఆరవీటి రాజులు ఈ ఆలయంలో యోగరాముడిని కొలిచేవారు. పక్కనే కాశీ విశ్వనాథుడి ఆలయం. విజయనగరం శాసనాల్లో సంతకం “విరూపాక్షముద్ర”తోనే చాలా కాలం కొనసాగింది. ఆరవీటి రాజుల కాలంలో యోగ రామముద్ర వచ్చింది. రామాలయం ఎదుట ఒక జీర్ణ మందిరముంది. అది ఆనాటి కారాగారమంటారు. రాయలు తిమ్మరుసును అక్కడే బంధించారంటారు. సాళ్వ నరసింహుని కుమార్తెలు అక్కడే బంధితులు. అక్కడే వధింపబడ్డారు. విజయనగరకాలంలో రాజులకు సంబంధించిన రహస్య హత్యలన్నీ పెనుకొండలోనే జరిగేవి. అది రాజ్యానికి ఒక మూల ఉన్నది కాబట్టి వార్తలు తొందరగా బయటికి పొక్కవని వారి ఊహ.
ఊరికి దక్షిణాన ఈరన్న గుట్ట కనపడుతుంది. అది వీరన్న గుట్ట అయి ఉంటుంది. వీరన్న అంటే వీరభద్రుడే. సాధారణంగా ఆ పేరు వీరశైవులు పెట్టుకునేవారు. ఆ గుట్టకు ఆ పేరు రావడానికి ఏదో కథ ఉంది. దానిపక్కనే తిమ్మరుసు గోరి. శిథిలమై రూపురేఖలు మాసిపోయిన ఆ గోరి దక్షిణ భారతాన్నంతా తన చిటికెన వేలుపై ఆడించిన మహామంత్రి తిమ్మరుసుదని గ్రహించేవారే లేరు. నిజానికి సంవత్సరానికి ఒకసారి తిమ్మరుసు జయం అక్కడ జరుపవలసింది. కానీ నేటి జనానికి ఏమి పట్టింది కనుక!
పెనుకొండలో పారే కాలువను మొన్నటివరకు “ముత్యాలవంక” అని పిలిచేవారు. భట్టుమూర్తి వసుచరిత్రలో అది శక్తిమతిగా మారింది. పెనుకొండ కొండ కోలాహల పర్వతమయ్యింది. నేడు ఆ వంక లేదు. పెనుకొండ సౌందర్యం వర్షాకాలంలో శరత్తులో చూడాలి. ఊరికి చుట్టుపక్కల ముత్యాలు జల్లించే ప్రవాహాలు. ఎదురుగా కన్నుల్లో పచ్చలు పోసే కొండ. ఖిల్లాకు పోయే తోవ పొడవునా వెన్నెలలు చిలికే పున్నాగ వృక్షాలు. దారిపొడవునా జానెడెత్తు రాలిన పూలు భూమికి దిగిన వెన్నెలలా ఉండేవి. తోవలో అక్కడక్కడా నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు. పెద్దన్న చతుర్థాశ్వాసంలోని పేట అంతా ఆ పరిసరాల్లో జరిగిందే. భట్టుమూర్తి వసుచరిత్ర రచన ఆ ఊళ్లోనే సాగింది. వసుచరిత్రలో అనేక చోట్ల పెనుకొండ పరిసరాలు సాక్షాత్కరిస్తాయి. భట్టుమూర్తి గిరిక వీణ వాయించిదన్న మందిరమూ కొండలోనే ఉండి ఉంటుంది. ఆ ఊళ్లో ఆంజనేయమూర్తులు ఎక్కువ. అవన్నీ వ్యాసరాయలు ప్రతిష్ఠించినవే అంటారు.
కొండకు పక్కన బృందావనం తోవలో ఒక దిగుడుబావి ఉంది. వ్యాసరాయలు- కృష్ణరాయలు అక్కడే ఏకాంతంగా రాజకీయాలు చర్చించుకునేవారని అంటారు. రాయలు వసంతాలలో పెనుకొండలోనే ఉండేవాడు. పెనుకొండలో అప్పుడు గొప్ప శిల్ప కళాశాలలుండేవి. విజయనగరంలా పెనుకొండకు కూడా ఏడు కోటలు. వాటిని ఘనగిరి, సురగిరి అని వివిధనామాలతో పిలిచేవారు. ఆ ఊళ్ళో గగనమహలు ఉంది. అదే రాయల అంతఃపురమంటారు. ఆ మాటవిని…ఇప్పుడు గగనమహలు దీనస్థితిని చూస్తే…ఎవ్వరికైనా “కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్” పద్యం గుర్తుకు వస్తుంది.
పెనుకొండలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. విజయనగర సామ్రాజ్య ప్రారంభ దినాల్లో పెనుకొండ ప్రధాన నగరం. తరువాత రాజధానిగా మారింది. నేడు ఆ ఊళ్లో ఏమి మిగిలింది? ఊరి మధ్య ఉన్న పెద్ద మర్రి చెట్టు ఎంతమంది రాజులను చూసిందో పాపం. దానికింద ఒంటరిగా విఘ్నేశ్వరుడు. ఒకప్పుడు పెనుకొండ ప్రసిద్ధ జైన యాత్రా స్థలంగా కూడా ఒక వెలుగు వెలిగింది. నేడు గతవైభవానికి ఆనవాళ్లుగా రాళ్లు మిగిలి ఉన్నాయి.
పెనుకొండ శాపద్రష్ట అయి శిలగా మారిన ఒక అప్సరస.
Photos Courtesy: Jakka Suresh Social Media
రేపు- పెనుగొండలక్ష్మి-4
“శిథిలాల వెనుక శిఖరాలు”