Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-6

పెనుగొండలక్ష్మి-6

ఈ పెనుగొండ రాజవీధుల్లో ఏనుగుల ఘీంకారం మోత మోగింది. ఆంధ్రుల యశస్సు పాటలు పాడుకుంది. సైన్యం కదను తొక్కింది. వీరుల హృదయ బోధలు నేటికీ కథలు కథలుగా వినిపిస్తున్నాయి.

తళతళలాడే కత్తులు చల్లిన వింత పుప్పొడి ఈ వీధులకు ముగ్గులు పెట్టింది. పెదవిమీద లేనవ్వుతో గుర్రమెక్కి తిరిగిన యుద్ధవీరులతో ఈ వీధులు ఎంతగా పొంగిపోయాయో! భూలక్ష్మి ఎంతగా మురిసిపోయిందో!

కవులను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి…రత్నకంకణాలు తొడిగి…పండితులు వేవేల గొంతుకలతో పొగుడుతుండగా…స్వయంగా ఆ పల్లకీని భుజాన మోసిన మహారాజులను మోసిన, చూసిన వీధులివి.

గర్వాంధులయిన సామంత రాజుల నెత్తిపై వేలాడిన కత్తులను; ఆశ్రితులను రక్షించడానికి ఎత్తిన కత్తులను చూసిన వీధులివి.

కులుకు పచ్చల రత్న కంబళ్ల మీద ముత్యాలు కుప్పలు పోసి అమ్ముతుంటే…ధాన్యపురాశులు అనుకుని…తినడానికి వాలిన గువ్వల గుంపులను చూసి…ఫక్కుమని నవ్వుకున్నవి ఈ వీధులే.

తెలుగు పడుచుల కంఠసీమలో నునుసిగ్గు దొంతరల హారంలా కృష్ణరాయల చూపులు వికసించినప్పుడు…ఆ ఆనందసౌభాగ్యాన్ని చూసి పులకించిన వీధులివి.

పగలే కాకుండా, రాత్రి బజారులు కూడా చూసి…గింజల్లా నవరత్నాలను శేరు, అర శేరు ముంతల్లో నింపి...అమ్మిన రాజవీధుల్లో అసూయపడ్డ పశ్చాత్యుల సంగతులు ఇప్పటికీ చెవిమరుగు కాలేదు.

బంగారు అంచు పట్టు బట్టలు కట్టుకుని, పాదాలకు ఎర్రని లత్తుక పూసుకుని, వెండి గజ్జెలు కట్టుకుని, దానిమ్మ పూల డిజైన్ల ఉల్లిపొర వస్త్రాలను మేలిముసుగుగా ధరించి...తిరిగిన తెలుగమ్మాయిల అందచందాలను చూడడానికి ఈ వీధులతో పాటు ముల్లోకాలకు రెండు కళ్లు చాలలేదు.

మౌని విద్యారణ్య స్వామి హృదయ వీణాలాపనలో జనించిన మంత్రాల బలిమి అలసిపోయిందా?
తెలుగు రాయలు తిప్పిన కత్తి పారించిన వేడి రక్తాల వరద వెలిసిపోయిందా?
మహామంత్రి తిమ్మరుసు చేతి మహేంద్రజాల విద్యా దీపం ఆరిపోయిందా?
భట్టుమూర్తి పలికిన కాపుకైతలలో పరిమళం ఆవిరైపోయిందా?

ఆనాటి దివ్యకళలకు కాలం చెల్లిందా?
ఆనాటి జీవశక్తి జీర్ణమైపోయిందా?
కాలం సిగపట్లలో పెనుగొండ వసుధ సుధా జీవనం ఛిద్రమైపోయిందా?

రేపు:
పెనుగొండలక్ష్మి-7
“రామబురుజులు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
RELATED ARTICLES

Most Popular

న్యూస్