బాబయ్య గోరి
లోకం బాధలకు పరిష్కారం చూపిన గొప్ప గోసాయి గోరి అది. కళలు, శాస్త్రాలు రెండూ కలగలిసిన సమాధి స్థలం. దివ్యవర్చస్సుతో సుకవి వాక్యంలా వెలిగిన సమాధి అది. బాబయ్య మహిమలకు భక్తులు మోకరిల్లిన చోటు అది. ఎక్కడి నుండి వచ్చాడో! ఎవరు పిలిస్తే ఇక్కడికి వచ్చాడో ఈ యోగి! పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. చీకట్లలో జ్ఞాన దీపాల వెలుగులు నింపాడు.
శాంతమే అన్నిటికీ మందు అని ప్రవచించిన బాబయ్య మాటలు అప్పుడు ఈ కొండల్లో ప్రతిధ్వనించి సంఘజీవనం పరమ శాంతంగా ఉండేది. ఇప్పుడు మన అశాంతికి మందు వేయడానికి పెనుగొండ బాబయ్య ఎక్కడున్నాడో!
రోజులు మారిపోయాయి బాబయ్యా! మా అశాంతిని నీ శాంతఖడ్గంతో నరకడానికి మళ్లీ పుడతావా? మాలో నిండిన వేదనలు తొలగిపోవడానికి ఎన్ని ప్రవచనాలు కావాలిప్పుడు? ఒకవేళ నువ్వు నిజంగా మళ్లీ పుట్టి మా చెవుల్లో ప్రవచనాలు పోసినా…వినడం వరకే కానీ…ఆచరిస్తామా! చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు నీకెందుకులే శ్రమ!
అమృతంలో విషాన్ని, విషంలో అమృతాన్ని పట్టి చూపించగల, ప్రపంచాన్ని ధిక్కరించగల మహాయోగి వేమనలా నువ్వు నాకు కనిపిస్తున్నావు బాబయ్యా! నీ మాటలే బంగారు మూటలుగా పెనుగొండ దాచుకొంది బాబయ్యా!
(పెనుగొండ బాబయ్య స్వామి (బాబా ఫక్రుద్దీన్) అసలు పేరు హజ్రత్ బాబా ఫక్రుద్దీన్. 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప సూఫీ ప్రవక్త. ఇరాన్ ప్రాంతం నుండి వచ్చి పెనుగొండలో స్థిరపడ్డాడని అంటారు. దక్షిణ భారతదేశంలో మత సహనానికి చిహ్నంగా ఉన్న పెనుగొండ దర్గా ఉర్స్ ప్రతి ఏటా మార్చి నెలలో జరుగుతుంది. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ దర్గా ఉత్సవాలకు తరలి వస్తారు. దక్షిణాదిలో అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలాలలో పెనుగొండ దర్గా ఒకటి)
గగనమహలు
పెనుగొండ గగనమహలు కృష్ణదేవరాయల పాదముద్రలను తలదాల్చిన అందాల పడుచు. తాతాచార్యుడి వద్ద తత్వార్థ విషయాలను వీనులవిందుగా విన్నది. కృష్ణరాయల బాటలో అళియ రామారాయలును రాజ్యాధికారిని చేసిన కన్నతల్లి. కవితలకు ద్రాక్షా పాకాన్ని అద్ది…గానం చేసిన కవికుమారి. శత్రువుల గుండెల్లో కుంపట్లు రగిలించి…సముద్రగర్భం నుండి హోరుమనే తెలుగు ఢంకాలు మోగించిన పుణ్యభూమి. చూడు! ఇప్పుడు జీర్ణమై ఇలా మిగిలి ఉంది.
కొండలను కూడా కోయగల తెలుగు కత్తులు బుసకొట్టిన భూమి ఇది. సకల శాస్త్రాలమీద చర్చోపచర్చలు జరిగిన విద్యా వేదిక ఇది. నూనూగు మీసాల నూత్న ప్రాయపు రాజులు రాజ్యమేలిన ఉడుకుగడ్డ ఇది. ప్రకృతి ప్రసాదించిన జీవకళతో కవుల కలాలు చెలరేగిన చోటు ఇది. తెలుగు రాజుల నవనవోన్మేషమైన భావనాపథానికి ప్రతిబింబంగా భువనవిజయ భవనాలు వెలసిన భూమి ఇది. చూడు! ఇప్పుడు జీర్ణమై ఇలా మిగిలి ఉంది.
రాజ్యతంత్రంలో కృష్ణరాయడు చదరంగం ఆడిన చోటు ఇది. మృదులలిత నాదంతో అప్సర వీణలు పలికిన చోటు ఇది. గంగాతరంగాలతో పోటీపడి సంగీతం అలలై ఎగసిన చోటు ఇది. తెలుగు పలుకుల తీయదనం తేనె చినుకులుగా సీతమ్మ నోట కురిసిన చోటు ఇది. అలసి సొలసిన సత్యభామ అలకపాన్పు ఎక్కిన చోటు ఇది. చూడు! ఇప్పుడు జీర్ణమై ఇలా మిగిలి ఉంది.
వేసవి విడిదిలో కృష్ణరాయలు ఈ గగనమహలులో ఉండగా శత్రువులు శరణుజొచ్చి…వంచిన తలలతో వచ్చి…పాదనమస్కారం చేసి వెళ్లారు. ఎవరిని గెలవాలో అన్న కృష్ణరాయల యుద్ధవ్యూహాలకు, ఊహలకు ఊపిరులూదిన గగనమహలు ఇపుడు చీకట్లలో పడి ఉంది.
గతవైభవం అంతా ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. కాలం గగనమహలును మొండి గోడలుగా మిగిల్చింది. తెలిసినవారు చెబితే తప్ప అది ఒకనాడు ఆకాశానికి నిచ్చెన వేసిన విజయనగర కీర్తికి కట్టిన గగనమహలు అని గుర్తు పట్టలేము. ఆ వైభవాన్ని నిలుపుకునే శక్తి మనకు లేకపోయింది. కనీసం ఆ భవనాన్ని కాపాడుకునే శ్రద్ధ కూడా లేకపోయింది. వరదలోపడి కొట్టుకుపోయేవారిలా చరిత్ర స్పృహలేని మనం ఎక్కడ తేలుతామో! మునకే సుఖమనుకుంటూ మునిగిపోతున్నామో!
రేపు:
పెనుగొండలక్ష్మి-11 చివరి భాగం
“తెలుగురాయడు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018