Rayalu – Golden Era: జిలుగు వెలుగుల ఘంటం రాసిన కవిత గజ్జెకట్టి కృష్ణదేవరాయల కూతురిలా నాట్యమాడిన చోటు ఇది. ఆ కవితాకుమారి పాండిత్య లాలిత్యాలే మంగళాశాసనాలై ప్రతిధ్వనించిన నేల ఇది. ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నీ మాయమైపోయాయి.
ఆ సంతోషాలు, ఆ పవిత్ర ధీరత్వాలు, ఆ ప్రేమరసభావాలు, ఆ ఉరకలెత్తే ఉత్సాహాలు ఇప్పుడు మాలో రవ్వంతయినా లేవు.
సుస్వరాలతో మనసును ఆనందసాగరంలో ముంచిన విజయనగర వైభవ వీణ తీగలు తెగిపోయాయి. ఆ వీణ ఒకనాడు పలికిన రాగాలను జ్ఞాపకంగా నెమరువేసుకోవాలి. ఆ వీణ దుమ్ము దులిపి…తీగలు సరిచేసి...పూజ్యమైన మన పుణ్యగీతాలను మళ్లీ పలికిద్దాం…రండి!
కృష్ణరాయడి హృదయంలోఎన్నెన్ని మహోన్నత ఆశయ బీజాలు అలాగే ఉండిపోయాయో! ఎన్ని కలలు అతడి కళ్లలో అలాగే ఉండిపోయాయో! అతడు ఊహించిన విజయనగర భవిష్యత్తు ఎలాంటిదో! అలాంటివాడొకడు ఈ భూమ్మీద పుట్టాడని తలచుకుని పొంగిపోవాలి. ఎవరు విన్నా…వినకపోయినా…కృష్ణరాయల కీర్తిని పరవశించి పాటలుగా పాడుతూనే ఉండాలి.
తెలుగు తల్లి మెడలో కృష్ణరాయల కీర్తి హారంలా అమరి ఉంది. కర్పూరంలా ఆ కీర్తి పరిమళం వెదజల్లుతోంది. ఒక అద్భుతమైన ఆంధ్రుల “ధైర్యకర్మ”కు కృష్ణరాయలు నిలువెత్తు నడచిన ఉదాహరణ.
ఆంధ్రవిష్ణుడిని ఆవహన చేసుకున్న కృష్ణరాయల కత్తి అంచులు నిలిచి పాడిన విజయగీతికలు ఎన్నెన్నో!
హరిహర బుక్కరాయలు “తథాస్తు” అని విత్తిన విత్తనం విజయనగర రాజ్యం. అది కృష్ణరాయల సమయంలో మహావృక్షమై…శాఖోపశాఖలుగా విస్తరించింది. విజయనగరాన్ని చూసి…దేశదేశాలు మురిసిపోయాయి. తెలుగు కులాన్ని వెలిగించిన దివ్యరూపి కృష్ణరాయలు. శాతవాహనుల సాక్షిగా కృష్ణరాయలు తెలుగువారి ఇలవేలుపు అయ్యాడు.
తెలుగు కవిత కృష్ణరాయల నీడలో నుడికారం దిద్దుకుంది. తెలుగువారి పూర్వ పుణ్యాల కొద్దీ పుట్టినవాడు రాయలు. రాయలు ధన్యజీవి. అతడి కీర్తి అజరామరం.
వింధ్యాచలంనుండి ఆర్యావర్తందాకా తెలుగు తోటలను పెంచి…పోషించి…పోయిన కృష్ణరాయలును చూసి తెలుగు తల్లి పొంగిపోయింది. తెలుగు నేల పులకించింది.
…కాలానికి కన్ను కుట్టింది. అంతటి కృష్ణరాయల శ్రమ నిష్ఫలమైపోయింది. నీళ్లు నిండిన కళ్లతో ఆ కృష్ణరాయలుకు ఒక నమస్కారం పెట్టడం తప్ప…ఇప్పుడు మనమేమి చేయగలం?
(సరస్వతీపుత్ర, పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి పెనుగొండలక్ష్మి కావ్యంలోని పద్యాలవరుసలో రాసిన ధారావాహిక దీనితో సమాప్తం)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018