Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిర్దోషిత్వం నిరూపణకు లా చదివిన యువకుడు

నిర్దోషిత్వం నిరూపణకు లా చదివిన యువకుడు

తెలిసీ తెలియని వయసులో చేసే తప్పులు జీవితాలను మార్చేస్తాయి. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తే ఇంకా నరకం. అక్కడే చాలామంది తప్పటడుగు వేసి నేరాలకు పాల్పడతారు. కానీ మరోరకంగా ఆలోచించి చదువుకుని తమ తప్పులేదని నిరూపించే న్యాయవాదిగా మారితే! ….అమిత్ చౌదరి అవుతారు.

పద్దెనిమిదేళ్ల ప్రాయంలో అమిత్ ఓ పక్క డిగ్రీ చదువుతూ ఆర్మీలో చేరాలని కలలు కనేవాడు. అందుకోసం కష్టపడుతూ ఉండేవాడు. కానీ 2011 లో ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. మీరట్ లో ఇద్దరు పోలీసులను చంపేశారు. ఇందుకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని అప్పటి ముఖ్యమంత్రి ఆదేశించడంతో పోలీసులు త్వరపడ్డారు. అక్కడ పేరుమోసిన కాళీ గ్యాంగ్ ఇందుకు కారణమంటూ, అందులో సభ్యుడని అమిత్ పేరు చేర్చి హత్య కేసులో ఇరికించారు. తాను ఆ సమయంలో వేరే ఊళ్ళో సోదరి దగ్గర ఉన్నానన్న అమిత్ గోడు పట్టలేదు. అతన్ని కరడు కట్టిన ఖైదీలతో కలిపి జైల్లో పెట్టారు. వారు అమిత్ ని తమతో చేరమని ప్రలోభపెట్టారు. కానీ అమిత్ లొంగలేదు. జైలర్ మంచితనంతో వేరే సెల్ కి మార్చారు.

అయితే తన దురదృష్టానికి అమిత్ కుమిలిపోని రోజు లేదు. కానీ చింతిస్తూ కూర్చోలేదు. గమ్యం నిర్ణయించుకున్నాడు. రెండున్నరేళ్ల తర్వాత బెయిలు పై బయటకొచ్చాడు. వెంటనే చదువు ప్రారంభించాడు. బిఏ,ఎల్ ఎల్ బి,ఎల్ ఎల్ ఎమ్ పూర్తిచేశాడు. బార్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తగిన అర్హతలన్నీ సాధించాక తన కేసుపై దృష్టి పెట్టాడు. పది పన్నెండేళ్ళు గడిచినా పురోగతి జాడ లేని కేసు నుంచి నిరపరాధి అయిన తనను విముక్తుణ్ణి చేయాలని కోర్టులో వాదన ప్రారంభించాడు. చిత్రంగా ఎవరైతే అమిత్ ను దోషిగా పేర్కొన్నారో వారే అతన్ని గుర్తుపట్టలేకపోయారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసులో అమిత్ ను నిరపరాధిగా ప్రకటించారు. ప్రస్తుతం అమిత్ ముందున్న లక్ష్యం తనలానే తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయ సహాయం అందించడం. ఆర్మీ లో చేరాలని తాను అనుకున్నా దైవనిర్ణయం మరోలా ఉందని,అందుకే లాయర్ అయ్యానని అంటున్న అమిత్ కథ సినిమాలను తలపిస్తోంది కదూ!అన్నట్టు అమిత్ ప్రస్తుత లక్ష్యం క్రిమినల్ లా లో పీహెచ్డీ. లగే రహో అమిత్ భాయ్ !

పి.ఎస్:
అమెరికాలో ఐజాక్ రైట్ అనే వ్యాపారిని ఇలాగే తప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికించి జీవితకాల శిక్ష పడేలా చేశారు. జైలులో ఉన్నప్పుడే ఐజాక్ తన కేసులో జరిగిన తప్పులను నిరూపించి నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ తర్వాత లా చదివాడు. ఏ కోర్ట్ లో తనకు శిక్ష పడిందో అక్కడే లాయర్ గా వాదించి ఆ ఘనత సాధించిన మొదటి అమెరికన్ అయ్యాడు. మరి ఆ లెక్కన అమిత్ కూడా అటువంటి ఘనత సాధించిన తొలి భారతీయుడు. ఇటువంటివారు నేటి యువతరానికి ఆదర్శం.భ

RELATED ARTICLES

Most Popular

న్యూస్