Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనకిలీ టోల్ ప్లాజాలు కూడా ఉండును!

నకిలీ టోల్ ప్లాజాలు కూడా ఉండును!

Road Robbery: జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో ద్వారం ద్వారా వెళ్ళిపోవాలి. దారి మధ్యలో ఉండాలన్నా జీవితం ఉండనివ్వదు. ఉండిపోవాలనుకోవడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం.

ఆ పురాతన రహదారే ఆధునిక యుగంలో జాతీయ రహదారి అయ్యింది. ఈ ఆధునిక రహదారిలో ప్రతి అరవై కిలోమీటర్లకు మన పాపపుణ్యాలను మనకు శాస్త్రీయంగా గుర్తు చేసేవే టోల్ గేట్లు. అందులో మన సంచిత పాప ఫలానికి అంటే అక్యుములేటెడ్ పాపానికి ప్రతిరూపంగా రూపొందినదే ఫాస్ట్ ట్యాగ్.

చిన్నయసూరి రాసిన వ్యాకరణానికి బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు. నిజానికి ఇప్పుడది వృద్ధులకు కూడా జీర్ణం కాని మహా ప్రౌఢ వ్యాకరణం. అందులో సమాస పరిచ్చేదం ఒక భాగం. రెండు పదాలు ఒకటిగా ఏర్పడ్డం సమాసం. ఫాస్ట్ ట్యాగ్ రెండూ ఇంగ్లీషు పదాలే అయినా అందులో సమాసం లేకుండా పోదు.
ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్యాగ్;
ఫాస్ట్ గా పంపే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనువయిన ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనుమతించే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే వాహనానికి ట్యాగ్…ఇలా ఏ సమాసం కిందికి వస్తుందో వ్యాకరణవేత్తలు నిగ్గు తేల్చుకోలేకపోతున్నారు.

వేదం అందరూ చదవలేక, చదివినా అర్థం కాక, అర్థమయినా ఆచరించలేక వేదాంతాన్ని ఆశ్రయిస్తారు. తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం. తెలియకుండా చెప్పేది లేదా తెలియకుండా చేసేది వేదాంతం. ఇక్కడే ఫాస్ట్ ట్యాగ్ కు- వేదాంతానికి పొత్తు చక్కగా కుదురుతుంది.

టోల్ గేట్లు ఎందుకు? ఎన్ని యుగాలపాటు టోలు గేట్లలో మన తోలు ప్రయివేటువాడు వొలుచుకోవడానికి అధికారముంటుంది? అన్నవి అర్థరహితమయిన ప్రశ్నలు. సనాతన ధర్మంలో ఎన్నో జన్మల పాప పుణ్యాలు క్యారీ అవుతూనే ఉంటాయి. జన్మ రాహిత్యమే మోక్షం. కాబట్టి కొన్ని కోట్ల జన్మల్లో పేరుకుపోయిన మన పాపం పటాపంచలు కావాలంటే టోలు గేట్లగుండా మనం వీలయినంత ఎక్కువ ప్రయాణిస్తూనే ఉండాలి. దాంతో యమ స్పీడ్ గా పాప క్షయం అవుతుంది.

ఇదివరకు టోల్ గేట్లలో మనుషులు కూర్చుని డబ్బు తీసుకుని, ఇనుప రాడ్ పైకెత్తి వాహనాలను పంపే పద్ధతివల్ల పాపక్షయం స్లోగా ఉండేది. దాంతో జాతి విశాల పాపక్షయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ట్యాగ్ పద్ధతి వచ్చింది. ఇది మన పురాకృత జన్మల పుణ్య విశేష ఫలం.

ఫాస్ట్ ట్యాగ్ ముందే కొని మెడలో బిళ్లలా వాహనం ముందు అద్దానికి అతికించుకోకపోతే- టోల్ గేట్లలో రెండింతల జరిమానాకు దయగల చట్టం అనుమతిస్తోంది.

శంకరాచార్యులు అన్నపూర్ణ స్తోత్రంలో చివర ఫల శ్రుతిలో ఒక మాటన్నాడు.

“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!”

జ్ఞాన వైరాగ్యాలు భిక్షగా పెట్టు తల్లీ! అని అన్నపూర్ణాదేవి కాళ్లా వేళ్లా పడాలట మనం.

“దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-
నోపకకదా నన్ను నొడఁబరుపుచు పైపైనె సంసార బంధములఁ గట్టేవు  నాపలుకు చెల్లునా? నారాయణా!

అని యావత్ తెలుగు సాహిత్య చరిత్రలోనే ఇంకెవ్వరూ అనని మాటను ప్రయోగించాడు అన్నమయ్య. వెలుగులతో దీపించే దివ్య సుఖమట-ఆ వైరాగ్యం. పైగా ఆ వైరాగ్య సుఖం దేవుడే ఇవ్వాలట. భక్తి కర్మయోగంతో మొదలై…జ్ఞాన యోగంగా మారినప్పుడు ఈ వైరాగ్యయోగం అర్థమవుతుందంటారు. అనుభవంలోకి వస్తుందంటారు.

ఫాస్ట్ ట్యాగ్ ఉద్దేశం అదే. జ్ఞానానికి జ్ఞానం. వైరాగ్యానికి వైరాగ్యం. వేదాంతానికి వేదాంతం. వేగానికి వేగం. ఖర్చుకు ఖర్చు. పాపక్షయానికి పాపక్షయం.

“రోడ్లు అభివృద్ధికి సూచికలు.”
మన రోడ్లు బాగుండాలంటే మన చర్మం మనమే వలిచి, మనమే వాటిని రోడ్లకు ఒక మెత్తటి లేయర్ గా వేసి, సుఖమయిన ప్రయాణానికి మనకు మనమే అర్పణ కావాలి. హారతి కర్పూరం కావాలి. మన కొరకు, మన వలన, మన చేత, మనమే ఎన్నుకున్న మన ప్రభుత్వంలో “మన” మనుగడ ప్రశార్థకం కావాలి.

అన్నట్లు-
గుజరాత్ లో ఒక బడా రాజకీయ నాయకుడి కొడుకు ఒక రౌడీ బృందాన్ని ఏర్పాటు చేసుకుని రోడ్డు మధ్యలో ఒక టోల్ గేట్ పెట్టాడు. సంవత్సరం పాటు ఆ టోల్ గేట్ ద్వారా అక్షరాలా 75 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రోడ్లు ప్రయివేటు వాళ్ళ చేత వేయించి…వాళ్ళచేతే మన తోలు వలిపించి టోల్ ఫీజు వసూలు చేయడం కేంద్రప్రభుత్వ విధానం కాబట్టి ఈ ప్రయివేటు ఘరానా మోసం మీద ప్రజలకు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. ఆనోటా ఈనోటా పడి కొత్తగా వెలిసిన ఈ అనధికార టోల్ గేట్ గురించి జాతీయ రహదారి ప్రాధికార సంస్థకు తెలిసి…వారు పోలీస్ కేసు పెడితే…అప్పుడు లోకానికి ఈ మార్గంలో జరిగిన దుర్మార్గం గురించి తెలిసింది.

అయినా…మన పిచ్చి గానీ…
జాతీయ రహదారులను ప్రయివేటుకు అప్పగించాక…ప్రయివేటు వాడు మనల్ను దోచుకోవడానికి ప్రభుత్వమే అనుమతించాక…ఒక ప్రయివేటువాడెవడో ప్రయివేటుగా 75 కోట్లు కొల్లగొట్టాడు అని కటకటాల వెనక తోయడం న్యాయమైతే కావచ్చు కానీ…ధర్మం కాదేమో!

ఏమో!
ఇన్ని దశాబ్దాల్లో మనం కూడా ఇలా ఎన్నెన్ని అనధికార టోల్ గేట్లకు ఎన్ని వేల కోట్లు కట్టామో! కడుతున్నామో! ఇంకా కడతామో!

మన జేబులు కొల్లగొట్టింది అనధికారిక ప్రయివేటు టోల్ గేటా? ప్రభుత్వం అనుమతించిన అధికారిక ప్రయివేటు టోల్ గేటా? అన్న చర్చ మనకెందుకు?పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయయితే ఏమి?” అనుకుంటూ…టోలు కడుతూ…టోలు గేటు అనుమతిస్తే ముందుకు; అనుమతించకపోతే వెనక్కు వెళుతూ ఉండడమే మనం చేయగలిగింది.

ఇంతకూ-
ప్రజలను ప్రయివేటువారి కబంధ హస్తాల్లో బంధించి ఉంచడాన్ని “ప్రాధికారము” అందురా?
హతవిధీ! దీని వ్యుత్పత్తి అర్థము చెప్పు వాడెవ్వడు?

ఇప్పుడు తెలిసిందా!
శంకరుడు “వైరాగ్యజ్ఞాన” భిక్ష ఎందుకడిగాడో?
అన్నమయ్య “దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం” అన్న మాటను ఎందుకు కాయిన్ చేశాడో?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్