Wednesday, January 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనటనా గ్రంథాలయం

నటనా గ్రంథాలయం

The One and Only: గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల విశేషాలతో వ్యాసాలు రాస్తుంటే…బళ్లారి రాఘవ గురించి, సురభి నాటక సంస్థ గురించి రాయలేదేమిటని కొందరు పాఠకులు అడిగారు. నిజమే. బళ్ళారి రాఘవ గురించి రాయకపోతే తెలుగు నాటక చరిత్ర అసమగ్రమవుతుంది. సురభి నాటకసమాజం గురించి చెప్పకపోతే అది నాటకం చరిత్ర కానే కాదు.

బళ్లారి రాఘవ(1880- 1946)చరిత్ర రాస్తే రామాయణమంత. చెబితే మహాభారతమంత. పుట్టింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. ఆంధ్రనాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు బళ్లారి రాఘవకు స్వయానా మేనమామ. ఆ ప్రభావం ఆయనమీద పడి…చిన్నప్పటినుండే నటనమీద ఆసక్తి పెరిగింది. బళ్లారిలో హై స్కూల్ చదువు. మద్రాసులో న్యాయశాస్త్రం చదువు. క్రిమినల్ లాయర్ గా ఆరోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా సంపాదించినవాడు. ఆయన అసమానమైన వాదనా పటిమను గుర్తించిన బ్రిటీష్ వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించారు. అనతికాలంలోనే లెక్కలేనంతగా సంపాదించినా…నిరాడంబర జీవితమే ఆదర్శంగా గడిపాడు. తన అంతులేని సంపదను నాటకరంగ అభివృద్ధికి, తుంగభద్రా తీరంలో పండిట్ తారానాథ్ ఆశ్రమ నిర్వహణకు వినియోగించాడు.  ఆరోగ్యం దెబ్బతిని…చివరి రోజులు ఆ ఆశ్రమంలోనే గడిపాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో దేశ, విదేశాల్లో వేనవేల నాటకాలు ప్రదర్శించాడు.

మహామహులు బళ్లారి రాఘవ గురించి అన్న మాటలేమిటో తెలుసుకుంటే ఆయన ప్రతిభ హిమాలయమంత ఎత్తులో ఎలా వెలిగిందో అర్థమవుతుంది.

మహాత్మా గాంధీ
1927లో మహాత్మా గాంధీ బెంగళూరుకు దగ్గర్లో నంది హిల్స్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. బళ్లారి రాఘవ ఆధ్యాత్మిక గురువు పండిత్ తారానాథ్ రచించిన హిందీ నాటకం ‘దీన బంధు కభీర్ ‘ నాటకాన్ని చూడాల్సిందిగా గాంధీజీని బెంగుళూరుకు ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి…వెళ్లి… అయిదు నిముషాలు కూర్చుని వద్దామని బయలుదేరాడు గాంధీజీ. గంట దాటిపోయినా నాటకాన్ని అలా చూస్తూనే ఉన్నాడు గాంధీజీ. ఆయన కార్యదర్శిగా ఉన్న రాజాజి వెళ్లి… సాయంత్రం ప్రార్థనకు వేళయ్యింది అని గుర్తు చేశాడు. “మనం ప్రార్థనలోనే ఉన్నాం కదా?” అంటూ గాంధీజీ రాఘవ నటనలో లీనమైపోయి “రాఘవ మహరాజ్ కీ జై” అన్నాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్
1919లో బెంగళూరులో బళ్లారి రాఘవ “పఠాన్ రుస్తుమ్” నాటక ప్రదర్శనలో ప్రేక్షకులమధ్యలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చున్నారు. దాదాపు గంటసేపు సాగే ఈ నాటకంలో బళ్లారి రాఘవది పేరు మోసిన ఒక రౌడీ రుస్తుమ్ పాత్ర. ఆయనకు ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. పోలీసులు ఎవరెవరినో విచారిస్తుంటే, హింసిస్తుంటే…ఒక మూల రుస్తుమ్ అలా నిలుచుని ఉంటాడు. రుస్తుమ్ ముఖ కవళికల ద్వారా ఇవతల పోలీస్ చెబుతున్నది నిజమో, బాధితుడు చెబుతున్నది నిజమో ప్రేక్షకులకు తెలిసిపోతూ ఉంటుంది. అంత స్టేజి మీద పోలీసులు, బాధితులు ఆరేడుగురు ఉన్నా…రెండు నిముషాలు కాగానే ప్రేక్షకులకు రుస్తుమ్ మొహం తప్ప ఇంకేదీ కనిపించదు.

కనుసైగలతోనే వేనవేల భావాలు పలికించగల బళ్లారి రాఘవ ప్రతిభను పొగడడానికి మాటలు చాలవు అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్.

శ్రీ శ్రీ
మాహాకవి శ్రీశ్రీకి బళ్లారి రాఘవ అంటే ఆరాధన. ఆరోగ్యం దెబ్బతిని రాఘవ తుంగభద్రా తీరంలో తరనాథ్ ఆశ్రమంలో ఉండగా శ్రీశ్రీ పరామర్శకు వెళ్లాడు. రోజంతా సాహిత్య చర్చలో గడిపారు. ఇక్కడి దాకా వచ్చారు…గంట దూరంలో ఉన్న శిథిల హంపీని చూసి వెళ్లరాదా? అని రాఘవ అడిగారు. మిమ్మల్ను చూశాను…ఇక శిథిల హంపీని చూడాల్సిన పనిలేదు…అన్నాడు శ్రీశ్రీ. ఆమాటకు పడి పడి నవ్వాడు రాఘవ. మహాకవి శిథిల ప్రస్తావన తనదా? హంపీదా? రెండిటిదా? అని కవిహృదయాన్ని కడవరకు తలచుకుని…తలచుకుని…పొంగిపోయేవారట రాఘవ.

బూదరాజు రాధాకృష్ణ
మొహానికి రంగుపూసుకుని నాటకాల్లో వేషాలు వేసేవారందరూ నటులే అనుకుంటాం. అలా బళ్లారి రాఘవను చూడ్డానికి వీల్లేదు. ఆయన ఒక నటనా గ్రంథాలయం. నాలుగయిదు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. న్యాయశాస్త్రం లోతులు చూసినవాడు. ప్రపంచం తిరిగినవాడు. భాషలో మాండలికం మహిమ తెలిసినవాడు. సంపాదనతో వచ్చే అవలక్షణాలకు దూరంగా ఉన్నవాడు.

విజయవాడలో ఆరుబయట నాటకం వేస్తుండగా వీధి కుక్క ఒకటి స్టేజి మీదికి వచ్చింది. తడుముకోకుండా “నీక్కూడా నేను అలుసైపోయానా?” అని సందర్భానికి అన్వయించుకుని అప్పటికప్పుడు రాఘవ డైలాగ్ చెబితే...కుక్కకు శిక్షణ ఇచ్చి…అలా మధ్యలో పంపారనుకుని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారట.

రుస్తుమ్ పాత్రలో ఒక అగ్గిపుల్ల పళ్ల మధ్య పెట్టుకుంటూ కళ్లతో రాఘవ పలికించిన భావాలు కొలవడానికి తూనికరాళ్లు చాలవు.

జార్జ్ బెర్నార్డ్ షా
1928లో బళ్లారి రాఘవ ఇంగ్లండ్ లో విస్తృతంగా ప్రదర్శనలిచ్చారు. అవన్నీ ఇంగ్లీషు డ్రామాలే. ప్రపంచ ప్రఖ్యాత డ్రామా రచయిత, కళా విమర్శకుడు జార్జ్ బెర్నార్డ్ షాతో అప్పుడే పరిచయమయ్యింది. “మీరు బ్రిటన్లో పుట్టి ఉంటే మరో షేక్స్ పియర్ అయి ఉండేవారు” అని బెర్నార్డ్ షా రాఘవ నటనను, రచనా ప్రతిభను, ఇంగ్లీషు పాండిత్యాన్ని వేనోళ్ల పొగిడాడు.

ఇలాంటివాడొకడు ఉండేవాడని…అతడు మన తెలుగువాడని…తలచుకుని…తలచుకుని…. పొంగిపోకపోతే… మనకు మనం తెలుగువాళ్లం అని చెప్పుకునే అర్హత కోల్పోతాం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్