కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కల గణన చేపట్టాలని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కులాల వారిగా గణన ఓబిసిలలో వెనుకపడ్డ వారిని గుర్తించేందుకు దోహదం చేస్తుందని లాలు చెప్పారు. ఓబిసిల్లో వేల కులాలు కడు పేదరికంలో ఉన్నాయని, ఇప్పటికే చాలా కులాలు జనాభా పరంగా అంతరించే దశలో ఉన్నాయని లాలు ఆందోళన వ్యక్తం చేశారు.
పశు గణన, పక్షుల గణన చేస్తున్న భారత ప్రభుత్వం ఓబిసి కులాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఆర్జేడి అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందు కోసమే జనాభా గణన చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఓబిసి ల్లో మరింత వెనుకపడిన కులాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.
ప్రతిపక్షాలతో పాటు ఇటీవల బిజెపి మిత్ర పక్షాలు కూడా ఓబిసిలలో కులాల వారిగా జనాభా లెక్కలు చేపట్టాలని పార్లమెంటులో డిమాండ్ చేశాయి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వద్ద కొంత వరకు కులాల వారిగా లెక్కలు ఉన్నాయని వాటిని హేతుబద్దంగా చేపడితే ఓబిసిలకు మేలు జరుగుతుందని లాలు అన్నారు.