విద్వాన్ విశ్వం పద్యాలు, గేయాలతో పెన్నేటి పాట కావ్యం రాయడానికి 1953లో రాయలసీమలో వచ్చిన తీవ్రమైన కరువు కారణం. ఈ కావ్యం రాసేనాటికి ఆయన వయసు నలభై లోపే అయి ఉండాలి. 16 ఏళ్ల వయసు నుండే కావ్య రచన ప్రారంభించిన ఆయన పెన్నేటి పాట కంటే ముందు రాసినవి అచ్చయ్యాయి కూడా. పెన్నేటి పాట రాసిన తరువాత అచ్చు కావడానికి కొన్నేళ్లు పట్టింది. తెలంగాణ రచయితల సంఘం చొరవ తీసుకుని 1957లో తొలిసారి ప్రచురించే వరకు ఈ కావ్యం లోకానికి అందలేదు. రాయలసీమ కరువు బహుశా రాయలసీమకు బరువయ్యిందేమో! తెలంగాణ రచయితల సంఘం రాయలసీమ కరువు కావ్యాన్ని నెత్తిన మోయడం ఒక వైచిత్రి. తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథికి విశ్వం అంటే ఆరాధన. అభిమానం. దాంతో ఆయన కలుగజేసుకోవడంతో, సి. నారాయణ రెడ్డి సారథ్యంలో తొలిసారి పెన్నేటి పాట ముద్రణ జరిగింది.
నిజానికి విశ్వం పెన్నేటి పాట కంటే కూడా గొప్ప రచనలు ఎన్నో చేశారు. కానీ కీర్తిలో అవన్నీ పెన్నేటి పాట తరువాతే. కాలగతిలో విద్వాన్ విశ్వం కాస్త పెన్నేటి పాట విశ్వం అయ్యారు. ఆ పద్యాలు, గేయాలకు అదే వరుసలో భావమిది:-
అదిగో! పెన్న ఏటి గట్టున జానపద గీతాల సితార మోగుతోంది. అల్లసాని పెద్దన తెలుగు పలుకుల జాజి మల్లెల గుబాళింపు మత్తెక్కుతోంది. జిలుగు జరీ అంచుల పట్టుబట్టలు తళతళలాడుతున్నాయి. సత్యాన్వేషణలో చీకట్లను చీల్చుకుంటూ వెళ్లే వెలుగుల ఖడ్గాలు అవిగో!
అంతులేని కరువు గుండెను గుచ్చుతున్నా…గుండె చిక్కతనం కోల్పోలేదు. కటిక రాళ్లను కూడా కదిలించి…గజ్జె కట్టి…చిందు తొక్కించే మాయల జిలుగు తేరు రాయలసీమ పచ్చల బజారు ప్రత్యేకత.
అక్కడ ఒకప్పుడు-
ముత్యాలు పండి…రాశులుగా వీధుల పక్కన మిలమిలలాడాయి. కావ్యాలు బంగారు పల్లకీల్లో ఊరేగాయి. భాష్యాల జల్లులు కురిశాయి. శత్రువులపై వేయంచుల విచ్చు కత్తులు దాడి చేశాయి.
ఇదంతా గతించిన రాయలసీమ కథ. ఇక- ఇప్పటి రాయలసీమ కన్నీటి పాటను కోటి గొంతుల కిన్నెర మీటుకుంటూ…కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ వినిపిస్తాను.
అదే పెన్న!
అదే పెన్న!
నెమ్మదిగా నడువు!
గుండెను మెలిపెట్టే వట్టి ఎడారి ఇది.
ఇదే పెన్న. ఇదే పినాకిని.
ఏదీ నీరు?
ఏదీ హోరు?
ఏదీ నీటి జాలు?
ఈ పెన్న ఇసుకే నీరు.
గాలికి రేగే ఇసుకే హోరు.
నెమ్మదిగా నడువు!
గుండెను మెలిపెట్టే ఎడారి తమ్ముడూ!
చేతిలో పార పట్టుకుని ఎంత తవ్వినా…
తవ్వే వారి చెమట కాలువ కట్టినా…
ఇసుక లోతుల్లోకి ఎంతగా చీల్చినా…
నీకు ఈ ఏటి నీటి చుక్క కనిపించదు.
జన్మకో శివరాత్రిలా ఎప్పుడయినా కుంభ వృష్టి కురిసినా…పట్టుమని పది రోజుల్లోనే ఆ నీటినంతా ఇసుక మింగేస్తుంది. మళ్లీ ఎడారి పెన్నే మిగిలి ఉంటుంది.
చిటపట పడే ఒకటి రెండు చినుకుల కోసం ఈ పెన్న నోరంతా తెరిచి అలా ఆకాశానికేసి చూస్తూ ఉంటుంది.
నీళ్ళున్నాయేమో అనుకుని వచ్చే జీవరాశులను కూడా ఈ ఎడారి పెన్న మింగేస్తూ ఉంటుంది.
అయినా…
ఈ ఏటి నీటిలో తీయతనం ఊరుతూ ఉంటుంది. దోసిట్లో పోసుకుని ఒక్కసారి పుక్కిలిస్తే చాలు…నీ జన్మకు సార్థకత్వం, నిష్కల్మషత్వం అబ్బుతాయి.
గుండె జలదరింపజేస్తుంది. మోసకారితనాన్ని తొలగిస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఖండితవాదిని చేస్తుంది.
కండలేక ఎండిపోయి బెండువారినా…
తినడానికి తిండి లేక, కప్పుకోవడానికి తుండు గుడ్డయినా లేక బతుకు బండబారినా సరే-
నిండు మనసు; నిజాయితి; పండు వయసు; పట్టుదల; దాతృత్వం; ధర్మ దీక్ష ఇక్కడి గుండెలలో మెండు.
రండి! రండి!
చేతులెత్తి దండం తల్లీ! అని కైదండల దండలతో నీరెండ నిలిచి…కొలిచి పొండి!
ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయిందో?
ఇంతమందిని కన్నతల్లి ఎందుకిలా మారిందో?
చీకు, చింతలతో పెన్న గుండె బద్దలయ్యిందా?
తన సంతానం కోసం ఏడ్చి…ఏడ్చి…గొంతు తడారిపోయిందా?
ఈ ఏటి కాలువల్లో రైతుల రక్తం పారి…పారి…గడ్డకట్టింది. ఈ ఏటి గట్లల్లో నక్కలు నక్కి ఉన్నాయి. పీనుగులకు అంత్యక్రియలు చేయడానికే పెన్న ఇసుక తిన్నెలు వేదికలయ్యాయి.
ఇక్కడ-
యక్ష కిన్నెర కింపురుష విద్యాధర సిద్ధ సాధ్య పాదముద్రలు ఇక్కడ కనిపించవు. నాగకన్యకలు కనిపించరు కానీ…నాగుపాములు మాత్రం వంకర్లు తిరుగుతూ పాకుతూ ఉంటాయి. ఇక్కడి ఆకాశంలో గరుడ గంధర్వులు కనపడరు కానీ…పీక్కు తినే గద్దలు మాత్రం గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉంటాయి.
ఇక్కడ-
కనువిందైన లతలు కనిపించవు కానీ…గజిబిజి తిప్పతీగలు మాత్రం అంతా అల్లుకుని ఉంటాయి. పూలు, పళ్లతో శాఖోపశాఖలైన చెట్లు కనిపించవు కానీ…ఒంటి నిండా ముళ్ళున్న తుమ్మ చెట్లు మాత్రం అడుగడుగునా కనిపిస్తాయి. ఆకాశానికి చేయి సాచి…పిలిచే కొబ్బరి చెట్లు కనిపించవు కానీ…పొట్టి పొట్టి ఈత చెట్లు మాత్రం అక్కడక్కడా డొంకల్లో ఉంటాయి.
ఇక్కడ-
గులాబీలు పెరగవు కానీ…తంగేడు చెట్లు మాత్రం పెరుగుతూ ఉంటాయి. పశువులకు అవసరమైన పచ్చిక పరచుకోదు కానీ…ఎందుకూ పనికిరాని పాడు పల్లేరుకాయలు మాత్రం నేలంతా పరచుకుని ఉంటాయి.
ఇక్కడ-
చిలుకలు, కోయిలల పాటలు వినిపించవు కానీ…గుడ్లగూబల మూలుగులు గుండెను భయపెడుతూ ఉంటాయి. భయపెట్టే జంతువులు వెంటాడుతూ ఉంటాయి. పెన్న ఇరుగట్లల్లో పుర్రెలు పండుతూ ఉంటాయి.
ఇది-
బల్లులు, తొండలు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, చెవుల పిల్లులు, తేళ్లు, జెర్రులు, పాములకు నెలవు.
పుట్టలు పుట్టలు. ఎగుడు దిగుళ్లు. ఇసుక కూడా మిగలని మట్టి పాయలు. కాలువలు మాయమై…తన ఉనికి తనే మరచిపోయిన గట్లు. చిన్న రాళ్లు. పెద్ద రాళ్లు. మొనదేలిన రాళ్లు. ఇక్కడ నడిచేవారు కాలు తీసి కాలు పెట్టాలంటే పెద్ద యుద్ధం చేయాల్సిందే.
అదిగో!
ఆ చింత చెట్టు కొమ్మకే చిన్నిగాడు ఊపిరి తీసుకోవడానికి ఉరి బిగించుకున్నది. ఆ తుమ్మ చెట్టు దూలమే సీతిగాడి కాళ్ళు విరగ్గొట్టింది. ఈ ఈతచెట్టు చెక్కే ఎంకి చేతి కడియాలను మింగేసింది. ఆ బోదపోచ రెమ్మే నానా చెత్తను ఊడవడానికి ఉపయోగపడుతోంది. ఆ ఇసుక దిబ్బే చలమన్న ఎడ్ల బండిని తలకిందులు చేసింది.
అదిగో!
రాత్రి చీకట్లు పోతున్నాయి. వెలుగు రేకలు విచ్చుకుంటున్నాయి. దూరంగా కోడికూత వినిపిస్తోంది. పద! త్వరగా నడువు! దూరంగా ఏదో చిన్న పల్లె కనిపిస్తోంది.
ఈ ఊరికి రావాలంటే డొంక దారి తప్ప మరో దారి లేదు. ఎంత బలమైన ఎద్దులైనా నీరుగారిపోవాల్సిందే. ఈ దారిలో పెళ్లిళ్లకు ఎడ్ల బండ్లల్లో బయలుదేరిన ఎందరిని, ఎన్ని సార్లు దొంగలు దోచుకున్నారో లెక్కే లేదు. ఈ దారిలో బరువెక్కువైన ఎన్ని బండ్ల ఇరుసులు ఎన్ని సార్లు పుటుక్కుమని విరిగిపోయాయో? ఈ దారిలో నెత్తిన బరువులు మోస్తూ ఎందరు కాళ్ళు విరిగి పడ్డారో? ఈ దారిలో నెత్తిన ఒక బిందె, చంకలో ఒక బిందె మంచి నీళ్లు మోయలేక కొత్త కోడళ్లు ఎన్నిసార్లు కళ్లు తిరిగి పడిపోయారో?
ఎండ పొద్దుల్లో ఈ దారిలో నీడ కోసం పశువులు ఎంతగా అలమటించాయో? ఇక్కడ చీకటిపడే వేళ ఎన్నెన్ని సరస సందర్భాలకు భంగం కలిగిందో?
ఆవులను మేపుకునేవారికి, గొర్రెలు, మేకలు మేపుకునేవారికి అందరికీ ఈ గట్లే ఆధారం. వానలు వచ్చినప్పుడు వంక పారుతుంది. ఆ వంకలోనే ఒక చోట నీటి చెలమ.
అదిగో!
పారలు పట్టుకుని ఈ చెలమ ఉన్న కాలువను పదిలంగా పాయతీసి…మరింత లోతుకు తవ్వి …రక్షించుకోవడానికి…ఆ పల్లె జనం వడి వడిగా వస్తున్నారు. పంట కుప్పలు కొట్టే కాలం దాకా ప్రతి రైతుకు ఇదొక బాధ్యత. ప్రభుత్వం నీటి పన్ను వేస్తుంది కానీ…ఈ కాలువ మరమ్మత్తులను మాత్రం గాలికొదిలేసింది. అలా రోజూ తవ్వకపోతే కాలువలో ఆ మాత్రం నీటి చుక్క లేక…పక్కన పొలాలు మాడి మసైపోతాయి.
ఆ గుంపులో జానపదగీతం పాడుతూ వస్తున్నవాడే రంగన్న. అతడికి ఇదే యాగం. యోగం. భోగం. రోజులు గడిచేకొద్దీ ఇదే రోగం కూడా.
రేపు- పెన్నేటి పాట-4
“కూలీ అయిన కోటీశ్వరుడు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018