బతికి చెడిన రంగడి గుండెలో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నాయో? కాలు తీసి కాలు పెడితే సేవలు చేయడానికి పనిమనుషులు పోటీలు పడే వైభోగంలో పెరిగిన రంగడు ఇప్పుడిలా పశువుల కొట్టాల్లో చీపురు పట్టుకుని ఊడుస్తూ ఎంతగా తల్లడిల్లిపోతున్నాడో? ఎన్ని బాధలు? ఎన్ని అవమానాలు? ఎంత కష్టం? ఎలా ఓర్చుకుంటున్నాడో?
ఒకరింటి పశువుల చావిట్లో పేడ ఎత్తి శుభ్రం చేయడానికి ఎంతగా ఏడ్చాడో? ఒకరింటి పెరట్లో చెత్తను ఊడ్చడానికి ఎంత ఉడికిపోయాడో? ఒకరింట్లో కొర్రలు దంచడానికి ఎంత కష్టపడ్డాడో? ఒకరింట్లో రాగులు పిండి చేయడానికి రాతి విసురుమీద ఎంత చెమట చిందించాడో? ఒకరింట్లో పిల్లలను చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో? ఒకరింట్లో చీకటి పొద్దులో మంచాలు, పరుపులు వేసి వారి సుఖ నిద్రకు ఏర్పాట్లు చేయడానికి ఎంత నిద్రను త్యాగం చేశాడో?
అన్ని పనులు ముగించుకుని తీరా అర్ధరాత్రి గుడిసెకు వస్తే…
కటిక కారం, రాగి సంగటి ముద్ద గొంతులో దిగక ఎన్ని బిందెల నీళ్లు తాగాడో? ఎండు రొట్టెలు మింగుడు పడక ఎన్ని అవస్థలు పడ్డాడో? ఒక్కోసారి సంగటి ముద్ద, ఎండు రొట్టె ముక్క కూడా లేక లోటా నీళ్లు తాగి పడుకున్న రాత్రులెన్నో రంగడికి తప్ప లోకానికి తెలియదు.
తొలికోడి కూతకు ముందే లేస్తాడు. ఎవరు పనికి పిలిస్తే అక్కడికి వెళ్తాడు. ఈ పని, ఆ పని అని లేదు. ఏ పని అయినా చేస్తూనే ఉంటాడు. తెల్లవారకముందే వెళ్తాడు. అర్ధరాత్రి వెనక్కు వస్తాడు.
సంగీతం నేర్చుకోలేదు కానీ…రంగడు గొంతెత్తి పాడితే కటిక రాళ్లయినా కరగాల్సిందే. పొలాల్లో పనిచేసుకునేవారు రంగడి చుట్టూ చేరి అడిగి మరీ పాటలు విని మైమరచిపోతూ ఉంటారు. ఎక్కడ నేర్చుకున్నాడో కానీ…అతడి పాటల్లో రామాయణ, భారత, గాథాసప్తశతి, అష్టపదులు, మూక పంచశతులు కథలు కథలుగా దొర్లుతూ ఉంటాయి.
ఖంగుమని మోగే కంఠముంటే మాణిక్యవీణతో పనేమిటి?
పలికించే నేర్పు ఉంటే వెదురు వేణువు చాలదా?
రంగన్న పుట్టుకవి. గాయకుడు. గజ్జెకట్టి నాట్యం చేయగలడు. చెట్టు పుట్టలు కూడా కరిగి కన్నీరయ్యేలా అప్పటికప్పుడు పాట అల్లి…పాడగలడు. అభినయించగలడు.
రంగన్న కాలువ తవ్వడానికి వెళుతూ పాట పాడుతున్నాడు.
తీయని గొంతులో ఏదో విషాద జీర తొంగి చూస్తోంది. బాధను మరచిపోవడానికి పాటను పట్టుకున్నట్లున్నాడు.
తొలివెలుగు కిరణాలు నేలను తాకుతున్నాయి. వేపకొమ్మల్లో కాకుల గుంపులు వేకువలో మునకలు వేయడానికి బయలుదేరుతున్నాయి. కోకిల ఒకటి కొమ్మ వదల్లేక కూ కూ అని అలుపు లేకుండా కూస్తూనే ఉంది.
అలాంటి ప్రశాంత ప్రభాత సమయంలో రంగన్న పాట కలతలను మరపింపజేస్తూ ప్రకృతిని నిద్ర లేపుతోంది. కాలువ పక్కన తుమ్మ చెట్లు. తుమ్మ కొమ్మల్లో గుచ్చుకుని పైకి రావడానికి ప్రయత్నిస్తున్న సూరీడు. కాకుల చప్పుళ్లు. కోయిల పాట. దూరంగా వేప, మర్రి, రావి చెట్లు. ప్రకృతి గీసిన ఈ చిత్రానికి రంగడి గానం అమృతాభిషేకంలా ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తూ, ఆ పాటను వింటుంటే ఎవరయినా నిర్మల సమాధి స్థితిలోకి వెళ్లిపోవాల్సిందే. ఎప్పుడో గానీ అలాంటి రస సిద్ధి దొరకదు. ఇలాంటి దృశ్యాల్లో ఆనందాన్ని ఒడిసిపట్టుకోవడానికి రాసి పెట్టి ఉండాలి.
రంగన్న పాటే “పదండి ఇక పనులకు” అని ఆ పల్లెకు పిలుపు. చిన్నా పెద్ద అందరూ పలుగూ పార పట్టుకుని, తుండగుడ్డ నెత్తికి కట్టుకుని బయలుదేరారు. రోజుకు మైలున్నర దూరం కాలువ తవ్వుతారు. సాయంత్రం కాగానే ఇళ్ళకొచ్చి…తొట్టెలో నీళ్లు ఒంటిమీద చల్లుకుని…గూట్లో దీపాలు పెట్టి…నోట్లో ముద్ద వేసుకుంటారు.
రేపు- పెన్నేటి పాట-6
“రంగు వెలిసిన బతుకులు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018