Sunday, November 24, 2024

పెన్నేటి పాట-9

Soulless people: రాయలసీమలో లేనివారికే కరువు. ఉన్నవారిని చూస్తే కరువే వణికిపోవాలి. కలవారు పొద్దుపోక చదువుకుంటూ ఉంటారు. పొద్దుపోక తింటూ ఉంటారు. వారి మనసు మొద్దుబారి ఉంటుంది. ఊళ్లో జనం ఇంతటి కరువులో ఎలా బతుకుతున్నారు? అన్న కనీస పట్టింపు ఉండదు. గంజికి లేక ఊరు అలమటిస్తుంటే మనం పంచ భక్ష్య పరమాన్నాలు చేసుకుని…తినలేక సగం పడేయడం భావ్యమేనా? అన్న ఇంగిత జ్ఞానం వారికి ఉండదు. చుట్టూ ఎండిన బతుకులు. వాడిన పంటలు. డొక్కలెండిన పశువులు. ఇవేవీ కనిపించకుండా కలవారు కిటికీలు మూసుకుని వారి లోకంలో వారున్నారు. ఇనప్పెట్టెల్లో పేరుకునే సంపద లెక్కలే వారికి ముఖ్యం.

ఎక్కడికో వెళుతూ మార్గం మధ్యలో ఆగిన కొత్తవారిలా ఈ ఊళ్లో సంపన్నుల వ్యవహారం ఊరితో సంబంధం లేకుండా ఉంటుంది. ఎవరితో నోరు తెరిచి మాట్లాడరు. ఎవరైనా పలకరిస్తే కను సైగలతో, చేతులతోనే సమాధానమిస్తారు. ఆజ్ఞలకు కూడా సంజ్ఞలే. మాటల్లేవ్.

ఇంటిల్లిపాది తిన్న తరువాత ఏదయినా మిగిలితే…అంట్లు తోమడానికి ముందు ఉదారంగా పనివారికి పెడతారు. లేకుంటే లేదు.

అలా ఒకరోజు పుల్లగూర కొంచెం, మజ్జిగ కొంచెం మిగిలితే…రంగన్నకు పెట్టారు. వాటిని గిన్నెలు పట్టుకుని గంగమ్మను తలచుకుంటూ ఇంటిదారి పట్టాడు. చీకటి పడింది. పల్లె నిద్రలోకి జారుకుంది. దారులన్నీ నిర్మానుష్యం. ఒక్కో ఇంటిది ఒక్కో కష్టం. ఇల్లు చేరబోతుంటే ఒక గుడిసె ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటని చూశాడు రంగన్న. తనకు తెలిసిన నరసన్నను పాము కాటు వేసింది. నోట్లో నురగ వస్తోంది. నేను పోయి…మంత్రగాడిని తీసుకువస్తాను…అంటూ రంగన్న ఆ చీకట్లో ఆగకుండా పరుగెత్తాడు. అంతదాకా అందరూ తలా ఒకమాట అంటూ పొద్దుపుచ్చారేకానీ…మందో మాకో మంత్రమో ఆలోచించినవారు లేరు.

ఇంటికి బయలుదేరేప్పుడు రంగన్న కళ్ళల్లో మెదిలిన గంగమ్మ ఇప్పుడు గుర్తే లేదు. నరసన్న ప్రాణం కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి పరుగెత్తుతున్నాడు. రంగన్న ప్రయత్నం వృథా కాలేదు. నరసన్న బతికాడు. అంతదాకా గంగమ్మ కళ్ళల్లో ఒత్తులేసుకుని రంగన్న కోసం ఎదురుచూస్తోంది.

మరుసటి రోజు మధ్యాహ్నం వేళ గంగమ్మ అటుకులు దంచడానికి వెళ్లింది. ఉడికించిన వడ్లను పెనంలో వేయించి…తరువాత రోకట్లో దంచాలి. నలుగురు చుట్టూ నిలుచుని ఒకరి తరువాత ఒకరు చక చకా దంచాలి. చేతుల్లో అగ్గి రేగుతుంది. ఎర్రగా కంది బొబ్బలెక్కుతాయి. “పిట్టంత ఉన్నావు! నీకెందుకింత కష్టం? అని గంగమ్మను సాటి కూలీల్లో పెద్దవారు అడగనిరోజు లేదు. “మా ఆయన పడే కష్టం చూస్తూ నేనింట్లో ఊరికే కూర్చోలేను. పైసా పైసా కూడబెట్టి ఏ ఉగాదికో నాకో కొత్త చీర కొని తెచ్చి…కట్టుకోమంటాడు. తన ఒంటిమీద చిరుగుల బట్టల గురించి ఏనాడూ పట్టించుకోడు. అలాంటి భర్తకు కొంచెమైనా కష్టం తగ్గించకపోతే ఎలా?” అని గంగమ్మ సమాధానమిస్తుంది.

రేపు- పెన్నేటి పాట-10
చివరి భాగం
“కన్నీటి కథలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్