Friday, September 20, 2024

రామాయణం-4

Ramayan – Writers:

పల్లవి:-
లక్షణములు కల రామునికి ప్ర
దక్షిణ మొనరింతాము రారే…Iలక్షI

అనుపల్లవి:-
కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి
చక్షుణుడట దీక్షాగురుడట శుభ…Iలక్షI

చరణం:-
లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు
శిక్షుతుడై సభను మెప్పించు భక్తరక్షకుండౌనట
అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట
సాక్షియై వెలయు త్యాగరాజు పక్షుoడౌనట ముప్పది రెండు… Iలక్షI

త్యాగరాజు కీర్తనల్లో పెద్దగా ప్రచారంలో లేని కీర్తన ఇది. ఒక పల్లవి, అనుపల్లవి, ఒకే ఒక చరణంలో సమస్త వేదసారాన్ని బంధించడం త్యాగరాజుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే అవి కచేరీల్లో పాడుకునే ఒట్టి స్వరాల కీర్తనలు కావు; వేదమంత్రార్థ ప్రతిపాదితాలయిన త్యాగోపనిషత్తులు అన్నారు. ఈ కీర్తనలో 32 లక్షణాలున్న రాముడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం రమ్మంటున్నాడు త్యాగయ్య. ఆ లక్షణాలేమిటో చెప్పలేదు. చెప్పడు. అదే తమాషా. మనకు రుచి చూపించి వదిలేస్తాడు. అదేమిటో చెప్పు స్వామీ! అని మనమే వెంటపడాలి. లేదా…ఫలానా త్యాగయ్య రాముడికి 32 లక్షణాలన్నాడు…అవేమిటి? అని మనమే వెతుక్కోవాలి. ఆధ్యాత్మిక పరిభాషను పద్ధతిగా అన్వయించుకోవాలి. పల్లవి ఎత్తుగడలో లక్షణాలు అని మాత్రమే చెప్పి…కీర్తన చివరి మాటలో 32 లక్షణాలు అని స్పష్టంగా చెప్పడంలో త్యాగయ్య చాలా ఔచిత్యం పాటించాడు. పాడేప్పుడు ముప్పది రెండు లక్షణములు కల రాముడికి ప్రదక్షిణలు చేద్దాం రారండి అనే ముగించాల్సి వస్తుంది. రాశిపోసిన సకల సద్గుణాలకు, సల్లక్షణాలకు రాముడే లక్ష్యం. లక్షణ లక్ష్యమయిన శ్రుతులు- వేదాలకు ప్రతిరూపంగా రాముడిని త్యాగయ్య చూడగలిగాడు. మనకు చూపించగలిగాడు.

ఇంతకూ-
త్యాగయ్య చెబుతున్న రాముడి 32 గుణాలు ఎక్కడివి? ఏవి?

రామాయణం ప్రారంభంలోనే నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్న ఇది. వాల్మీకి పదహారు అడిగితే నారదుడు 32 ఎందుకు చెప్పాడు? అని మనం జుట్లు పీక్కోవాల్సిన పనిలేదు. భక్తి సూత్రాలను నిర్వచించిన నారదుడికి వాల్మీకి సందేహాలకు ఎంత విస్తారంగా సమాధానం చెప్పాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదు. అలా చెప్పడం వల్లే వాల్మీకి పులకించి, జన్మ చరితార్థం అయ్యేలా మనకు ఆది కావ్యం ఇచ్చాడు.

త్యాగరాజస్వామికి సంగీత శాస్త్ర రహస్యాలను బోధించినవాడు నారదుడే. నారదుడిచ్చిన “సంగీత స్వరార్ణవము” త్యాగయ్యకు దారి దీపం. అందుకే నారదగురురాయా! అంటూ నారద భక్తిని అనేక కీర్తనల్లో త్యాగయ్య ప్రస్తావించాడు. కాబట్టే నారదుడు చెప్పిన రాముడి 32 గుణాలు త్యాగయ్యకు శిరోధార్యం. ఆ గుణాల్లో కొన్ని మనకు అలవడినా జన్మ ధన్యం.

సీతారాముల కల్యాణానికి తెలుగు పేరంటం

“సీతారాముల కళ్యాణం చూతము రారండి”
సముద్రాల రాఘవాచార్య ఎన్నో గొప్ప పాటలు రాశారు. ఈ పాట సీతారాముల కళ్యాణానికి తెలుగు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. సుశీలమ్మ గొంతు అమృతం ఈ పాటకు తోడయ్యింది. మళ్లీ మళ్లీ వినాలనిపించే సంగీతం.

దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. పాట వింటుంటే మనమే దగ్గరుండి సీతారాముల కళ్యాణం చేయిస్తున్నట్లుంటుంది. త్రేతాయుగంలో అయోధ్యలో జరిగిన ఆ జగదానందకారకుడి పెళ్లి ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నట్లుంటుంది.

జనని జానకి తల్లి దోసిట్లో తలంబ్రాలు- ఎర్రటి కెంపులు. రాముడి దోసిట్లో తలంబ్రాలు- నీలపు రాశి. ఇందులో గొప్ప సౌందర్యాన్ని, చమత్కారాన్ని బంధించాడు సముద్రాల. ఎరుపు ప్రేమకు ప్రతిరూపం. సీతమ్మలో ముప్పిరిగొన్న ప్రేమకు దోసిట్లో తలంబ్రాలు ఎరుపెక్కాయి. కెంపులయ్యాయి. రాముడు నీలమేఘశ్యాముడు. ఆయన చేతిలో తలంబ్రాలు ఆయన వర్ణాన్ని పులుముకున్నాయి.

రాయినయినా కాకపోతిమి?

“రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా…”
ఆరుద్ర రచన. కె వి మహదేవన్ సంగీతం. సుశీలమ్మ గానం. రామాయణ సారాన్ని మనకు ఎలా అన్వయించుకోవాలో తెలియజెప్పే గొప్ప పాట ఇది. రాయి, బోయ, పడవ, పాదుక, పక్షి, ఉడుత, కాకి, గడ్డిపోచలే తరించిపోయాయి. అల్పజీవులకే మహిమ సిద్ధించింది. మనుషులమై పుట్టి మదమత్సరాలతో ఏమీ సాధించలేకపోతున్నామని తెలుసుకోవడానికి ఉపయోగపడే పాట ఇది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఇది. సకల ఆధ్యాత్మిక సాధనా మార్గాలకు దారిదీపం లాంటి పాట ఇది.

విశ్వనాథ రామాయణం
“మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన”

“వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివీవనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్”

తెలుగు వాల్మీకి మన విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్ప వృక్షం ఆయన మనకిచ్చిన అనన్యసామాన్యమయిన గ్రంథం. ఇంతమంది ఇన్ని యుగాలుగా ఇన్ని రామాయణాలు రాస్తున్నారు కదా? మళ్లీ రామాయణమే ఎందుకు రాస్తున్నానంటే? అని ఆయనకు ఆయనే ప్రశ్న వేసుకుని…ఆయనే తిరుగులేని సమాధానం కూడా చెప్పుకున్నారు.

ఈ లోకం రోజూ తింటున్న అన్నమే తింటోంది. చేస్తున్న సంసారమే చేస్తోంది. తన రుచి తనది. అలా నాదయిన భక్తి రచన నాది కాబట్టి తలచిన రాముడినే తలచుకుంటాను…రాస్తే రాముడి కథ రాసి నిలబడు…పాడు కట్టు కథలు దేనికి? అని మా నాన్న చెప్పిన మాట; నాలో జీవుడి వేదన రెండూ కలగలిసి రాముడినే స్మరిస్తున్నాను…అని రామాయణం తెలుగుసేత మొదలుపెట్టారు విశ్వనాథ.

నారదుడు వాల్మీకికి చెప్పిన ఆ ముప్పయ్ రెండు లక్షణాలు గల రాముడి చుట్టూ త్యాగయ్యతో పాటు మనం కూడా ప్రదక్షిణ చేద్దాం. సముద్రాలతో పాటు పెళ్లి పెద్దగా దగ్గరుండి సీతారాముల దోసిళ్లకు ఆణిముత్యాల తలంబ్రాలు అందిద్దాం. రామపాదం రాక రాళ్లమై పడి ఉన్నాం కాబట్టి…మదమాత్సర్యాలను వదిలించుకుని…రామ పాదుకలమయినా అయి భక్తి రాజ్యాలను ఏలుదాం. విశ్వనాథ చెప్పినట్లు రోజూ తినే అన్నమే అయినా…మళ్లీ మళ్లీ అదే తింటున్నాం కాబట్టి…రోజూ అదే రాముడిని మళ్లీ మళ్లీ తలచుకుందాం.

రేపు- రామాయణం-5
“హనుమ వినయం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్