Love and Affection:
“సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్పడ ఒక కాంత యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణు లి
య్యెడ వడి నోడ సోక నిది ఎట్లగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుండు రామపదకంజయుగంబు భయమ్ము పెంపునన్”
మొల్ల రామాయణంలో ఒక కదిలే దృశ్యంలాంటి ప్రఖ్యాత పద్యమిది. రామపాద ధూళి మహిమను హిమాలయమంత ఎత్తులో నిలిపిన తెలుగు పద్యమిది.
సందర్భం:-
వనవాసానికి బయలుదేరిన సీతారాములు తొలిరోజు రాత్రి గంగ ఒడ్డున నిషాద రాజు గుహుడి శృంగిబేరపురం ఊరవతల గార చెట్టు కింద పవళించారు. లక్ష్మణుడు, గుహుడు రెప్పవేయకుండా ధనుర్బాణాలు ధరించి కాపలాగా తిరిగారు. ఉదయాన్నే గంగ దాటించడానికి గుహుడు పడవలను సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు ఎక్కే పడవను నడపడానికి తానే స్వయంగా తెడ్డు పట్టుకున్నాడు. రాముడు పడవ మీద కాలు పెట్టబోతుంటే…ఓర్నాయనోయ్! ఆగు స్వామీ! ఆమధ్య నీ కాలు దుమ్ము తాకి రాయి స్త్రీ మూర్తి అహల్య అయ్యింది. ఈ చెక్క పడవమీద పెడితే ఎమువుతుందో! అని పైకే అనేస్తూ… పరుగెత్తుకెళ్లి… రాముడి కాళ్లను గంగ నీళ్లతో కడిగి…తన భుజం మీద ఉన్న ఉత్తరీయంతో మెత్తగా తుడిచి…ఇప్పుడు పెట్టు స్వామీ పడవమీద కాలు…అని ఆనందంతో తబ్బిబ్బులవుతున్న వేళ…తల్లి మొల్ల లోకానికి చూపించిన దృశ్యం.
“రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!”
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి!
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి!
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట
ఆగు బాబూ ఆగు!
అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ!
నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట!
నాకు తెలుసులే!
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట?
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
అందరినీ దరిజేర్చు మారాజువే!
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే!
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ!
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి!
“హైలెస్సా లేలో హైలెస్సా…”
చిత్రం :- సంపూర్ణ రామాయణం (1971)
దర్శకుడు:- బాపు
సంగీతం :- కె.వి. మహదేవన్
సాహిత్యం :- కొసరాజు
గానం :- ఘంటసాల
సినీ జానపద గీతాల బ్రహ్మ కొసరాజు గుహుడిని తెలుగువారికి అత్యంత ఆత్మీయుడిని చేశారు. బాపు చిత్రీకరణలో చూస్తున్న ప్రతివాడూ గుహుడై రాముడి కాళ్లు కడిగి ధన్యులవుతున్నారు. “ఆగు బాబూ! ఆగు! అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ!” అని ఘంటసాల గొంతులో గుహుడు కూర్చున్నాడు. మహదేవన్ స్వరాల తరగల్లో గుహుడి పాటల పడవ ఎక్కి రాముడు గంగ దాటాడు. విన్నవారి నోములన్నీ పండే పాట ఇది. రాముడి కతలు సెపుతూ ఉంటే ఒళ్లు మరచిపోయే గుహుడి పక్కన పడవలో మనల్ను కూర్చోబెట్టే పాట ఇది.
దేవుడు దాటలేక కాదు…
మనల్ను భవసాగరాలు దాటించడానికి దయజూపి దిగి వచ్చిన వేళ…రాముడితో ఎలా మాట్లాడాలో గుహుడిని చూసి నేర్చుకోవాల్సిన పాట ఇది. రాముడిలో మూర్తీభవించిన నారాయణుడిని గుహుడు పట్టుకుని…మనకు అందించిన పాట ఇది.
“మీరు రామాయణం చదివారా?
అయితే ఈ పుస్తకం చదవండి”
పుస్తక రచయిత అప్పజోడు వెంకటసుబ్బయ్య గారు అనంతపురం, గూడూరు, నంద్యాల, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరయ్యారు. “మహాభారతం- మానవ స్వభావ చిత్రణ” అన్న విషయం మీద ఉస్మానియాలో పి హెచ్ డి చేశారు. రామాయణ, భారతాల మీద తెలుగునేల మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేసి ఉంటారు. కొన్నివేల వ్యాసాలు రాశారు. పెద్దవారు. వందలమంది అభిమానులయిన శిష్యగణాన్ని సంపాదించుకున్నారు. ఆయన గుహుడి గురించి చెప్పిన మాటలు యథాతథంగా:-
“ఆతిథ్యం ఇవ్వటం, ఉపకారం చెయ్యటం రెండూ ఉత్తమ ధర్మాలే. ఉన్నతోన్నత సంస్కారానికి నిదర్శనాలే. ఏ వ్యక్తి అయినా ఒకరికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావటం, ఉపకారం చేసే సందర్భం లభించటం తన అదృష్టమని భావించాలి. కాని, కొందరు అతిథి వస్తున్నాడంటే ముఖం త్రిప్పుకొంటారు. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకొంటారు. మరి కొందరు అతిథి సత్కారాలు, ఉపకారాలు చేస్తారు గాని, వాటిని స్వప్రయోజనాల సాధనకు పెట్టుబడులుగా వాడుకొంటారు. ఇంక కొందరు అలా చెయ్యకున్నా మేము కాబట్టి ఆతిథ్యాలు ఇచ్చామని, ఉపకారాలు చేశామని అహంకారాన్ని ప్రదర్శిస్తారు. కాని, లోకంలో అతిథిని పూజించటం, సాటి మానవులకు సాయం చెయ్యటం పుణ్య కార్యాలని భావించే వాళ్ళు, అవి చేసి తమ జన్మ తరించినట్లు తృప్తి పొందే వాళ్ళు చాలా తక్కువ. ఆలాంటివాళ్ళు, అవకాశం వచ్చి ఒక మహానుభావుడికే కష్ట సమయంలో ఆతిథ్య మిస్తే, ఉపకారం చేస్తే, వాళ్ళు పొందే ఆనందానికి అవధి ఉండదు. పైగా ఆలాంటి అవకాశం రావటం తమ జీవితంలో ఎంతో పెద్ద అదృష్టమని భావిస్తారు.
శ్రీ మద్రామాయణంలో గుహుడికి ఆలాంటి అవకాశం లభించింది. అతడు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడికే ఆతిథ్యమిచ్చాడు. ఉపకారం కూడ చేశాడు. జన్మ చరితార్థమైనట్లు భావించాడు. ఆలాగే భరతుడికి కూడ అతిథ్యమిచ్చాడు; ఉపకారం చేశాడు. ఎంతో తృప్తి చెందాడు. రామాయణంలోనే కాదు – లోకంలో కూడ గుహుడు ఒక మరపురాని వ్యక్తిగా నిలిచాడు.
గుహుడు మట్టమైన మనిషి. అతడిది దిట్టమైన శరీరం. నల్లటి రంగు. గుండ్రటి ముఖం. ఎఱ్ఱటి కళ్ళు. కొట్ట వచ్చినట్లు ముందుకు దూకే తెల్లటి గుబురు మీసాలు. నెత్తిన పెద్ద తలపాగా. మెడ నిండా రకరకాల పూసల దండలు. ముంజేతులకు, బాహువులకు చిన్న చిన్న అద్దాలు పొదిగిన పెద్ద కంకణాలు. ఇదీ – ఏ రామాయణ పాఠకుడి కైనా పొడగట్టే గుహుడి రూపం.
గుహుడు ఆటవిక ప్రభువు. బల సంపన్నుడు. గంగా తీరంలో అతడి దెబ్బకు తిరుగు లేదు. అతడిది ఐదువందల నౌకాబలం. అంతకు మించిన కాల్బలం. అతడి వీరులందరు మేటి విలుకాళ్ళు. కత్తులు, ఈటెలు, అమ్ములు మొదలైనవి గుహుడి ఆయుధ సామగ్రి. ఆ అడవిలోని మృగపక్షి పదార్థ సంపద, గంగానది లోని జలచర సంపద – అంతా గుహుడిదే. అంతా రామార్పణం అన్న తృప్తి గుహుడిది. వ్యక్తి గొప్పతనానికి, అతడు మహాత్ముల మనస్సుల్లో ఒక ఉన్నత స్థానం సంపాదించటానికి జాతి ముఖ్యం కాదు; కులం ముఖ్యం కాదు. గుణం ముఖ్యం.
గుహుడు ఆటవికుడే కావచ్చు. నాగరికత అట్టే లేనివాడే కావచ్చు. కాని, అతనికి మంచి మనస్సుంది. జీవితంలో కొన్ని విలువ లున్నాయి. అన్నింటిని మించి ఆతిథ్యానికి, ఉపకారానికి వెనుక ఉండవలసిన మంచి మనస్తత్వం ఉంది.
శ్రీరామచంద్రుడు గుహుడి ఆతిథ్యాన్ని, అతడు చేసిన ఉపకారాన్ని జీవితంలో మరువగలడా! అన్ని గొప్ప గుణాలున్న గుహుడికి తన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఉండగలడా! అందుకే ఆయన రావణ వధానంతరం విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళుతూ, భరద్వాజాశ్రమంలో ఆగి, అదే పనిగా హనుమ చేత తన క్షేమ సమాచారాలు గుహుడికి చెప్పి పంపాడు. ‘ఆత్మ సఖా’ అని గుహుణ్ణి సంబోధించాడు. గుహుడు ధన్య జీవి. రామాయణంలో అతడు ఒక మరపురాని పాత్ర. లోకంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళకు, ఉపకారం చేసే వాళ్ళకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి“.
రేపు- రామాయణం-9
“పక్షి సాయము చేయగా…”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018