Saturday, November 23, 2024

రామాయణం-12

Dedicated Devotee: భద్రాచల రామదాసు(1620-1688) కళ్లతో రాముడిని చూడకపోతే మనం రాముడిని చూసినట్లే కాదు. గోదావరి తీరం నేలకొండపల్లిలో పుట్టిన కంచర్ల గోపన్నను రామదాసుగా రాముడే మలచుకున్నాడు.

రామదాసు కథ అందరికీ తెలిసిందే. మేనమామ గోల్కొండ నవాబు దగ్గర ఉన్నతోద్యోగి కావడంతో పాల్వంచ పరాగణా తహసీల్దారు ఉద్యోగం వచ్చింది. జీర్ణమైపోయిన భద్రాద్రి ఆలయాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఒకానొక భక్తురాలు పోకల దమ్మక్క కోరగా గోపన్న సరే అని పనులు మొదలుపెట్టాడు. భక్తులిచ్చిన విరాళాలు ఆలయం అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి సరిపోలేదు. పంటలు పండి నాలుగు రూకలు చేతికొచ్చాక మరికొంత విరాళాలిస్తామన్నారు భక్తులు. ఈలోపు శిస్తు వసూలు చేసిన సొమ్మును ఆలయ నిర్మాణానికి మళ్లించాడు గోపన్న. నవాబుకు ఈ సంగతి తెలిసి కోపం కట్టలు తెంచుకుంది. 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు. గోల్కొండ చీకటి గదిలో గోపన్న బందీ అయ్యాడు. కాళ్లకు చేతులకు గొలుసులు. ఒళ్లంతా దెబ్బలు. వేళకు తిండి లేదు. కంటికి కునుకు లేదు. పలకరించే మనిషి లేడు. ఇలా కొన్నేళ్లు దొర్లిపోయాయి. గోపన్న పాపం ఏదో క్షయమైనట్లుంది. రామలక్ష్మణులు నవాబుకు కలలో దర్శనమిచ్చి…రామదాసు వాడుకున్న ఖజానా సొమ్ము ఆరు లక్షల వరహాలు తిరిగి ఇచ్చారు. నవాబు లేచి చూస్తే…నిజంగానే పళ్లెరాల్లో బంగారు వరహాలున్నాయి. వెంటనే గోపన్నను విడుదల చేయించాడు. ఆలయం నిర్వహణకు అధికారికంగా భూములు ఇచ్చాడు. ఆ క్షణం నుండి రామదాసుగా గోపన్న పేరు ప్రఖ్యాతులు దశదిశలా మారుమోగిపోయాయి. శ్రీ రాముడి సేవలో, సంకీర్తనలో రామదాసు తన శేషజీవితాన్ని గడిపాడు. త్యాగరాజాదులకు రామదాసు ఆద్యుడు, పూజ్యుడు. “ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?” “కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్” అని త్యాగయ్య పొంగిపోయి రామదాసు మీద కీర్తనలు అల్లి పాడాడంటే రామదాసు ప్రభావం వాగ్గేయకారులమీద ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

అంతటి పరమ భక్తాగ్రేసరుడికి, తన వాక్కుతో రాముడికి అహోరాత్రాలు పూజ చేసినవాడికి అన్నన్ని కష్టాలు, దెబ్బలు, జైలు జీవితం, అవమానాలు, కన్నీళ్లు ఏమిటో!
“నువ్వు, నీ భార్య, నీ తమ్ముడు నేను చేయించిన ముత్యాల పతకాలు, చింతాకు పతకాలు, రత్నాల హారాలు మెడలో వేసుకుని కులుకుతూ తిరుగుతున్నారే?
అవన్నీ ఎవరు చేయించినవి? ఆ డబ్బు ఎక్కడినుండి వచ్చింది?
మీ తండ్రి దశరథుడి సొమ్మా?
మీ మామ జనకుడి పెట్టెలో డబ్బులా?
ఆలయం చుట్టూ ప్రాకారాలు కట్టించడానికి పదివేల వరహాలయ్యింది ఖర్చు. అదంతా నువ్విచ్చావా? మీ నాయన ఇచ్చాడా? పోనీ మీ మామ ఏమన్నా ఇచ్చాడా ?”
అని దులిపిపారేశాడు. దెబ్బలకు తాళలేక…ఆయాసంలో నోరు పారేసుకున్నాను…నువ్ రక్షించకపోతే నాకు ఇక రక్షకులు వేరేవరున్నారు? అంటూ ప్రాధేయపడ్డాడు.

రాముడు లోకరక్షణ పనుల్లో తీరికలేకుండా ఉండి తన మొర ఆలకించలేదనుకుని…
“లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళ…
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ!”
అటు నుండీ నరుక్కు వచ్చాడు. ఆ తల్లి కరుణాసముద్రం. వెంటనే రాముడి చెవిలో రామదాసు విన్నపాన్ని వినిపించింది. గట్టిగా సిఫారసు చేసింది. అమ్మకు చెప్పి అయ్యతో పనులు చేయించుకోవడం అనాదిగా ఉన్నదే.

రామదాసు మాట అరటిపడుకంటే రుచి. రామదాసు పాట ఖర్జూరం కంటే తీపి. రామదాసు భావాలు చక్కెర కంటే మధురం. అత్యంత సామాన్యంగా అనిపించే మాటలతో అనన్యసామాన్యమైన భావాన్ని పిండుకోవడం రామదాసు ప్రత్యేకత. సంస్కృతం, తెలుగులో అపారమైన పాండిత్యం ఉన్నవాడు. గంగా ప్రవాహంలాంటి ధారావేగంతో పద్యరచన చేసినవాడు. రామబాణంలా పద్యాన్ని సంధించినవాడు. కీర్తన పాడుతూ భజన సంప్రదాయంలోలా ఎగరడానికి పదాలకు గంతులు నేర్పినవాడు. అయోధ్య రాముడిని తెలుగు రాముడిగా చేసి…రాముడిని తెలుగు లోగిళ్లలో ప్రతిష్ఠించినవాడు.

పల్లవి:-
ఉన్నాడో లేడో భద్రాద్రియందు || ఉన్నాడో ||
చరణం-1
ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు
ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు
|| ఉన్నాడో ||
చరణం-2
ననుగన్న తండ్రి నా పెన్నిధానము
విన్నపము విని తా నెన్నడు రాడాయె
|| ఉన్నాడో ||
చరణం-3
ఆకొని నే నిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్సతిలకుడు
|| ఉన్నాడో ||
చరణం-4
వాటముగ భద్రాచల రామదాసుతో
మాటలాడుటకు నాటకధరుడు
|| ఉన్నాడో ||
అని రామదాసుతో మనం గొంతు కలిపితే…రామదాసు ఆర్తిని మన గొంతులో పలికించగలిగితే…రాముడు పొమ్మన్నా మనల్ను వదిలిపోలేడు.

పల్లవి:-
అంతా రామమయం ఈ జగమంతా రామమయం || అంతా ||
చరణం-1
అంతరంగమున ఆత్మారాము డ
నంత రూపమున వింతలు సలుపగ
|| అంతా ||
చరణం-2
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
|| అంతా ||
చరణం-3
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ
|| అంతా ||
చరణం-4
నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు
|| అంతా ||
చరణం-5
అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము
|| అంతా ||
చరణం-6
ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారక నామము
|| అంతా ||

ఈ ఒక్క రామదాసు కీర్తన రాముడిమీద వేనవేల కావ్యాలతో సమానం. కొన్ని కోట్ల రామనామ జప ఫలసారం. రామదాసు మాట, పాట మన నాలుకమీద తిరిగితే చాలు…తారకమంత్రము కోరకుండానే దొరుకుతుంది.

రేపు- రామాయణం-13
“రామబాణం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్