ముందుగా ఒక డిస్ క్లైమర్. నేను కవిని కాను. కవిని అనుకుని భ్రమపడిన వేళ జరిగిన కకావికత్వపు సంగతులివి.
నా వయసప్పుడు 18 ఏళ్లు. హిందూపురంలో తెలుగు, సంస్కృత వ్యాకరణాల్లో పేరుమోసిన పండితుడు కర్రా వేంకటసుబ్రహ్మణ్యం సార్ దగ్గర శిష్యుడిగా భాషాశాస్త్రం నేర్చుకుంటున్నాను. ఇంట్లో మా తాత, నాన్న ఇద్దరూ సంస్కృతాంధ్రాల్లో పండితులు. పద్యకవులు. అవధానులు. ఉగ్గుపద్యాలతో పెరిగినవాడిని. కర్రా సార్ మా నాన్న అష్టావధానాల్లో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడిగా ఉండేవారు. పుస్తకం చూడకుండా ఆయన కొన్ని వేల(సరిగ్గా లెక్కపెడితే లక్షల్లో ఉంటాయేమో) పద్యాలు, శ్లోకాలను చెబుతుంటే విన్నవారిది, చూసినవారిది భాగ్యం. అలాంటి కర్రా సార్ దగ్గర అయిదేళ్లపాటు సూత్రాలను పద్యాలు, శ్లోకాల్లో నేర్చుకునే సంప్రదాయ పద్ధతిలో పాఠాలు విన్న భాగ్యవంతుడిని నేను. ఆయన చెప్పింది సముద్రమంత. అందులో నా మట్టి బుర్రకు ఎక్కింది ఆవగింజంత.
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తీర్చిదిద్దిన కృష్ణదేవరాయలును, వేమనను తొలిసారి నాకు పరిచయం చేసింది; పుట్టపర్తి శివతాండవాన్ని నా నాలుకమీద తొలిసారి చెరిగిపోకుండా రాసింది; విద్వాన్ విశ్వం ఎడారి పెన్నను తడారిన నా గొంతులో తొలిసారి సంప్రోక్షించింది; కొడాలి వెంకటసుబ్బారావు హంపీ క్షేత్రాన్ని తొలిసారి నా కళ్ల ముందు ప్రతిష్ఠించింది కర్రా సారే.
ఆయన పుస్తకం తెరవరు. నేను పుస్తకం తెరవకూడదు. తప్పు దొర్లినా పరవాలేదు. నోటికి నేర్చుకో అని సాహిత్య సముద్రంలో మునకలు వేయించారు. భాషా శాస్త్రంతో పాటు భాషోత్పత్తి శాస్త్రం, అలంకారాలు, ఛందస్సు, వ్యాకరణం...ఇలా ఆయన చెప్పనిది లేదు.
అప్పుడు జరిగింది ఒక ప్రమాదం. నాలో కవిలాంటి ఒక జీవి నా ప్రమేయం లేకుండా నిద్రలేచి…జడలు విప్పి…తాండవం చేయడం మొదలు పెట్టాడు. ఒక నోట్ బుక్కులో ఒక్కో ఛందస్సు గణాలన్నీ పెన్సిల్ తో గీతలు గీచి కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు, వచన కవితలు రాశాను. దాదాపు 180 అయ్యాయి. రెండొందల పేజీల పుస్తకం పూర్తి అయ్యింది అన్న తృప్తితో, విజయగర్వంతో ఒక మిట్ట మధ్యాహ్నం బండలు పగిలే ఎండ వేళ సైకిల్ హ్యాండిల్ స్టాండ్ కు నోట్ బుక్ పెట్టుకుని కర్రా సార్ ఇంటికి వెళ్లా. ఇంటికి సున్నాలు కొడుతుండడంతో…సార్ బయట పెద్ద మామిడి చెట్టు కింద చెక్క కుర్చీ వేసుకుని ఒంటరిగా కూర్చుని ఉన్నారు. నాకన్నీ శుభ శకునాల్లాగే అనిపించి…“సార్! ఆరు నెలలుగా నేను తెలుగులో, సంస్కృతంలో కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు, కవితలు రాశాను. కొన్ని అనువాదాలు చేశాను. మీరొకసారి చదివి ఆశీర్వదిస్తే…” అన్నాను. సార్ విప్పారిన నేత్రాలతో నోట్ బుక్ తీసుకుని కళ్ళజోడు సవరించుకుని ఏకబిగిన చదివారు. “నాలాంటి శిష్యుడిని పొందడానికి నా గురువు ఎంత పెట్టి పుట్టి ఉండాలి?” అని విశ్వనాథ చెప్పుకున్నట్లు భవిష్యత్తులో నా గురువు అదృష్టాన్ని నేనే లోకానికి చెప్పుకోవాలేమో! అని పరిపరివిధాలుగా ఆలోచిస్తుండగా సార్ నా రాతలు చదవడం పూర్తి చేశారు.
“ఎవరు రాయమన్నారు నాయనా?”
అన్నది సార్ మొదటి ప్రశ్న.
“ఒకటి రాయగానే చూపకుండా ఇన్ని రాశాక చూపిస్తున్నావెందుకు?”
అన్నది రెండో ప్రశ్న.
“మీ నాయనకు చూపించినావా?”
మూడో ప్రశ్న.
ఒక్కసారిగా నా కాలికింద భూమి రెండుగా చీలిపోయింది. కులగిరులు కుంగిపోయాయి. ఆకాశం విరిగి నా నెత్తిన పడింది. అంతా శూన్యంగా తోచింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న సార్ వాళ్ల అమ్మాయిని పిలిచి…గ్లాసు మంచి నీళ్లు…ఆపై కాఫీ తెప్పించారు.
కొంచెం తేరుకుని…ఏమి సార్ ఇందులో యతి పోయిందా? ప్రాస కుదరలేదా? గణాలు దారి తప్పాయా? దుష్ట సమాసాలు పడ్డాయా? అర్థ, అన్వయ దోషం ఉందా? రస భావాలకు తగ్గ భాష కుదరలేదా? అని శరపరంపరగా ప్రశ్నలు సాధించాను. “అన్నీ కుదిరాయి నాయనా! ఎలాంటి దోషాల్లేవు. అర్థమొక్కటే కరువయ్యింది. మీ నాయనకు చూపించద్దు. చూపిస్తే ఇన్నేళ్లుగా నేను చెప్పింది ఇదే అనుకుంటాడు!” అని ప్రాధేయపడ్డారు!
హతవిధీ! అనుకుని గుండె రాయి చేసుకుని సార్ కు మాటిచ్చాను. ఇందులో తప్పులేమిటో చెప్పి నన్ను కన్వెన్స్ చేస్తేనే నేను భవిష్యత్తులో కవిత్వం రాయడం మానేస్తాను. లేకపోతే మీ మాట కూడా వినను అని చనువు కొద్దీ మారాం చేశాను. నాలాంటి నిరక్షర కుక్షులను ఎంతమందిని హ్యాండిల్ చేసి ఉంటారో! సరే అని నా రాతల సమీక్ష మొదలు పెట్టారు. కొన్ని నెలలపాటు సాగిన ఆ సమీక్షలో మొదటిది ఇది:-
పల్లవి:-
కైలాస శిఖరాన శివతాండవధ్వనులు
కైవల్యమందించు కమనీయతా వనులు
కనులు పూవులు పూయు
ఆ నాట్య భంగిమలు
లయనిలయ పురుషునికి ఇల నిలుపు భావములు
//కైలాస //
చరణం-1
అంగాంగమానంద గంగా తరంగమై
అడుగడుగు మృదు మధుర వీణా నినాదమై
వేదాలవేదికన అభినయము భాష్యమై
జననమును మరణమును జగతి రథ చక్రమును
తనకంట శాసించు శంకరుని చరణములు శరణములు
//కైలాస //
చరణం-2
హిమనగము వాలినది శివపదము సోకినది
నదులెల్ల మదిపొంగి నాట్యములు చేసినవి
ప్రతి పక్షి చిత్రముగా పంచమమే పాడినది
ప్రతి పువ్వు మువ్వగా ముసిముసిగా నవ్వినది
శంకరుని శార్వాణి జలదసుందరవేణి
తనలోనే తామురిసి హొయలెన్నో చిలికినది
తనువెల్ల పులకించి ప్రకృతిగా మారినది
//కైలాస //
“పుట్టపర్తి వారి శివతాండవానికి మక్కికి మక్కి ఇది. భావనలు, పదబంధాలు అన్నీ అవే. ఇందులో నువ్వు రాసిందేమిటి? నువ్వు సొంతంగా కాయిన్ చేసిన మాటేమిటి? చెప్పాలన్న ప్రయత్నం తప్ప ఇందులో మధుసూదన్ లేడు. మహా అయితే రెండు మూడు మాటలు నీ సొంతం. ఆ మాటల్లో ప్రతిపక్షి అంటే every bird అన్న అర్థంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవాడు అని కూడా అర్థం. అప్పుడది చిత్రంగా పంచమం ఎలా పాడుతుంది? అని ముసిముసిగా నవ్వుతూ…అర్థంలో అస్పష్టతకు, మరో అర్థానికి ఆస్కారమున్న పదాలను ఇంతటి ఉదాత్త సందర్భాల్లో ప్రయోగించకూడదు అని అందులో ఎక్కడెక్కడ ఎలా దారితప్పానో వివరిస్తూ బోధి చెట్టుకింద జ్ఞానబోధ చేశారు.
కత్తివేటుకు నెత్తురుచుక్కలేని నా దీన స్థితిని చూసి…ఓదార్చారు. మామూలు వచనంతో వ్యాసాలు రాయి. చాలు. మీ నాయన పేరు చెడగొట్టద్దు. మామూలు మాటల్లో ఉన్నదంతా కవిత్వమే. మాండలికంలో ఉన్నవన్నీ యతులే, ప్రాసలే. సామెతల్లో ఉన్నంత ఛందస్సు ఇంకెక్కడన్నా ఉంటుందా? తిక్కన, పోతన, శ్రీనాథుడు, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, వేమన, గురజాడ, శ్రీశ్రీలను చదువు. చాలు. కొడవటిగంటి, పాలగుమ్మి, మధురాంతకం వచన వాక్యాల ముందు ఏ కవిత్వమైనా ఆగగలదా? అని వచన రచనలో మెలకువలు నేర్పారు.
“పూత మెఱుంగులున్ పసరు పూప బెడంగులు జూపునట్టి వా
కైతలు?
జగ్గు నిగ్గు నెనగావలె కమ్మన కమ్మనన్వలెన్;
రాతిరియున్ పవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని
ద్దాతరితీపులో యనగ తారసిలన్వలె లో దలంచినన్;
బాతిగ గైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్;
సొగసు కోర్కులు రావలె ఆలకించినన్;
చేతికొలంది కౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె పట్టి జూచినన్;
డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవిగావలె పంటనూదినన్;
గాతలి తమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం
బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపు కన్నడగౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలెన్ అచ్చ తెల్గునన్ ఈ రీతిగ,
సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననసర్వసాహితీ
భౌతికనాటక ప్రకరభారతభారతి సమ్మతప్రభా
శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా
సాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం
గాతతతేహితత్తహితహాధిక ధంధణుధాణుధింధిమీ
వ్రాత నయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధివహహాది సుగంధవిలాసయుక్తమై
చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్”
అన్న పెద్దన కవితను మైమరచి ఎలా పాడుకోవాలో చెప్పారు.
“దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా
డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి క
న్మూసిన భంగి, కన్నె నగుమోము పయిన్ నునుసిగ్గుమొగ్గ కై
సేసినభంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్
కాసిన భంగి, జానపదకాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై
వ్రాసిన భంగి, పెండ్లి తలఁబ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళావిపంచికల్
మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్
భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్
భాసిల తెల్గుకైత నవభంగుల సంగతమై, యొకింతయున్
దోసములేని శబ్దములతో, నటనం బొనరించు పాద వి
న్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి
ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో, మృదుశయ్యతో, అనా
యాస సమాసయుక్తి కలశాంబుధి తీర పురోనిషణ్ణ దే
వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాసవిలాస విభ్రమకరాంచల చంచల హేమకుంభ సం
భాసి సుధాఝురీ మధురిమమ్ములు గ్రమ్ము కొనన్ వలెన్; శర
న్మాస శుచిప్రసన్న యమునాతట సైకత సాంద్రచంద్రికా
రాస కలా కలాప మధుర వ్రజ యౌవత మధ్య మాధవ
శ్రీసుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సారసంపదల్
రాసులు రాసులై పొరలి రావలె; పొంపిరి పోవలెన్ నవో
ల్లాస వసంత రాగ రస లాలిత బాలరసాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్!”
అన్న కరుణశ్రీ కవితను పులకింతతో చెబుతూ కవిత్వమంటే అలా ఉండాలి అంటూ కళ్లు మూసుకుని కవితాసమాధిలోకి వెళ్ళిపోయేవారు.
మరి నేను రాసిందేమిటి సార్? అని సూటిగా, గట్టిగా అడిగాను.
కవిత్వం
అకవిత్వం
సుకవిత్వం
కుకవిత్వం
కకావికత్వం
అని ఎన్నెన్నో ఉంటాయి…అంటూ సూటిగా చెప్పకుండా నా నోట్ బుక్ నాకు వెనక్కు ఇచ్చారు. తరువాత పది, పదిహేనేళ్లు ఆ బుక్ అప్పుడప్పుడూ నా కంటికి కనపడేది. ఒకసారి ఎప్పుడో ఇంటి ఇంటీరియర్ పనుల్లో ఆ పుస్తకం పోగొట్టుకున్నాను. అప్పటికి కర్రా సార్ భౌతికంగా లేరు. ఆయన ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది.
ఆ తరువాత నేను రాసే వ్యాసాల్లో సరళ వాక్యాల్లో ఎన్నెన్ని దోషాలున్నాయో మా నాన్న చెప్పేవారు. జీవితంలో తప్పులు లేకుండా రాయడం నావరకు అసాధ్యం అని మా నాన్న నిరూపించారు. ఆ సంగతులు ఇంకెప్పుడయినా చెబుతాను.
ఇంతకూ…నేను రాసింది “కకావికత్వం” అని కర్రా సార్ అనలేదు. కానీ…అది కకావికత్వమే అని నాకు క్లారిటీ ఉంది! పెద్దలు అన్నీ నోటితో చెప్పరు. మనకు అర్థమయ్యేలా మరోలా చెప్తారు. అది వారి సంస్కారం.
లోకం చూడని నా కవితలన్నీ జర్నలిజంలో నా రూమ్మేట్ ఎమ్మిగనూరు విజయ్ కుమార్ విన్నాడు. ఆ దెబ్బకు 1992 నుండి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పెన్నా నది మాడి మసై నామరూపాల్లేకుండా పోవడానికి పెన్న ఒళ్లో కూర్చుని నేను కవితలు రాసి పాడడమే కారణం అని అప్పుడు నాకు జర్నలిజంలో బాస్ అయిన యాధాటి కాశీపతికి కూడా బలమైన నమ్మకం. ఇలా ఎన్నెన్నో ప్రబలమైన ప్రత్యక్ష ఉదాహరణలు ఉండడంతో నేను రాసినవి “కకావికత్వం” అని బేషరతుగా ఒప్పుకోవాల్సివచ్చింది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018