రాజ్ కోట్ టెస్ట్ లో ఇండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 319 పరుగులకే ఆలౌట్ చేసి 126 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో నేడు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ మరోసారి రాణించి సెంచరీ (104) చేశాడు. అయితే వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.
తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగుల వద్ద నేటి ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ సరైన భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమైంది. నిన్న 133 పరుగులతో నాటౌట్ గా ఉన్న బెన్ డకెట్ 153 వద్ద కుల్దీప్ బౌలింగ్ లో గిల్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 41 పరుగులతో రాణించాడు. 319 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ సిరాజ్ 4; కుల్దీప్, జడేజా చెరో రెండు; బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.
రెండో ఇన్నింగ్స్ లో ఇండియా తొలి వికెట్ కు 30 (రోహిత్-19) పరుగులు చేసింది. రెండో వికెట్ కు జైస్వాల్- శుభ్ మన్ గిల్ లు 161 పరుగులు జోడించారు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ వ్యక్తిగత స్కోరు 104 వద్ద గాయంతో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రజిత్ పటీదార్ నిరాశపరిచి డకౌట్ అయ్యాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా మొత్తంగా 322 రన్స్ ఆధిక్యంలో ఉంది. శుభ్ మన్ గిల్-65; కుల్దీప్-3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
జో రూట్, టామ్ హార్ట్ లీ చెరో వికెట్ పడగొట్టారు.