Saturday, April 20, 2024
Homeతెలంగాణనీటిపారుదల రంగంపై ఆరోపణలు.. ప్రత్యారోపణలు

నీటిపారుదల రంగంపై ఆరోపణలు.. ప్రత్యారోపణలు

తెలంగాణ శాసనసభ ఎనిమిదో రోజు సమావేశాలు ఆరోపణలు… ప్రత్యారోపణలతో సాగింది. తెలంగాణ నీటిపారుదల రంగం మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అధికార, విపక్ష నేతల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు.

ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చింది చిన్న పగులు అని అంటున్నారని… అది పగులు కాదని, నిట్ట నిలువునా చీలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఊటంకిస్తూ… డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో ఎందుకు పని చేయించలేదని అడిగారు. ఎస్సారెస్పీ, దేవాదుల, రాజీవ్ సాగర్లను పూర్తిచేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. వీటిని వదిలేసి లక్ష 72 వేల కోట్లకు బడ్జెట్ పెంచి కాళేశ్వరం కట్టారని విమర్శించారు.

అంతకు ముందు మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బతిందన్నారు. మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని, అక్టోబర్ లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదన్నారు. అవినీతి, నిర్లక్ష్యంతో బ్యారేజ్ బాగా దెబ్బతింది.. గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్, డిజైనర్. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదని ఉత్తమ్ చెప్పారు.

యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ మాత్రమే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదని స్పష్టం చేశారు. అన్నారంకు కూడా క్రాక్స్ వచ్చాయి. అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది, అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఉత్తమ్ చెప్పారు. వెంటనే ఎన్డీఎస్ఏకీ సమాచారం అందించామ‌ని, నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది. ఉన్న నీటిని తొలగించమని చెప్పిందని ఉత్తమ్ వెల్లడించారు.

చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూరంగా ఉందని విమర్శించారు. సభలో ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. మిడ్ మానేరుకు  ఉమ్మడి రాష్ట్రంలో రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక రూ.775 కోట్లతో చేసి నీళ్ళు ఇచ్చామని హరీష్ గుర్తు చేశారు.

నీటిపారుదల రంగంపై మజ్లీస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు ATM గా మారాయని విమర్శించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం తమ అవసరాల కోసమే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని… రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రం మొత్తం వినియోగించే విద్యుత్ కేవలం నీటిపారుదల ప్రాజెక్టులకే సరిపోతుందని… భవిష్యత్తులో కరెంటు కష్టాలు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రచారం కోసం మూడు వేల కోట్లు నీళ్ళ పలు చేశారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని పనులకు సంబంధించి 24 గంటల్లోనే అంచనాలు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కోసం ఏటా 10,700 కోట్లు అవుతుందని మంత్రి ఉత్తమ వెల్లడించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవటం కోసమే అధికంగా సమయం తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించినట్టుగా కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగు పెరగటం… కేవలం సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాలకు సాగునీటి కొరత తీరిందనే వాదనలు ఉన్నాయి.

సాగునీటి రాకతో రాష్ట్రంలో పంటల వైవిధ్యం దెబ్బతిన్నది. చిరుధాన్యాల సాగు పూర్తిగా తగ్గిపోయి… వరి సాగు మోతాదు మించింది. తద్వారా బియ్యం వినియోగం పెరిగి షుగర్, డయాబెటీస్ తదితర జీవన శైలి వ్యాధులు, సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుతామనే సాకుతో ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సాధారణంగా  మారింది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఆహారకొరత తీర్చేందుకు ప్రాజెక్టులు నిర్మించగా… కాలక్రమంలో ప్రాజెక్టులు అధికార పార్టీలకు నిధులు సమకూర్చేవిగా మారాయి.

మూడో ప్రపంచ దేశాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ఓ కుట్ర అని మేధావులు ఎప్పటి నుంచో అంటున్నారు. వ్యవసాయ రంగం కోసం ఆర్థికంగా, సామాజికంగా చిన్న నీటిపారుదల పథకాలను అభివృద్ధి చేయాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.  స్థానిక ఆహార అలవాట్లను దెబ్బతీసి ఫార్మా కంపెనీల మేలు కోసం… రాజకీయ పార్టీలకు లబ్ది చేకూర్చే భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తూ.. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని నిపుణులు మొదటి నుంచి చెపుతున్నారు. లోపాలను ఎత్తి చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం… సరిదిద్దే పేరుతో మరో కొత్త ప్రాజెక్టు చేపడితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనటంలో సందేహం లేదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్