వాల్మీకి రామాయణంలో అగస్త్య ముని రాముడికి యుద్ధానికి ముందు సూర్యుడిని ప్రార్థించడానికి చెప్పిన స్తోత్రమే ఆదిత్య హృదయం. ఇందులో “ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం” అని ఒక మాటుంది. మనసులో ఎవరు సూర్యుడిని జపిస్తారో వారు రణరంగంలో విజయాన్ని సాదిస్తారన్నది దీని భావం. మాన్హట్టన్ ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలు, వారికి సహాయ సహకారాలందించిన ప్రభుత్వం వారు ఈ శ్లోకాన్ని మనసులో పెట్టుకున్నారేమో!
సూర్యుడు తనను తాను రగిలించుకునే ప్రక్రియను అర్థంచేసుకుని ఆ సిద్ధాంతాలతో అణ్వాయుధాలను తయారు చేశామని హ్యారీ ట్రూమన్- Harry Truman హిరోషిమా-నాగసాకి దాడుల తర్వాత రేడియోలో చెప్పారు. రెండేళ్లు రెండు బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి నాజీ పాలనను నేలమట్టం చెయ్యడానికి పూనుకున్న మహాయజ్ఞమే ఈ ప్రాజెక్ట్. 1900లో మొదలైన క్వాంటమ్ విప్లవం 1945లో అణుబాంబుల విధ్వసంతో ముగిసింది.
నాటి నుండి నేటివరకు మనం అణ్వాయుధాల నీడలోనే ఉన్నాము. అణుబాంబులను పేర్చుకునే క్రీడ భూగోళాన్ని బూడిద చేసే కీడుగా ఎప్పుడు మారుతుందో అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. సృష్టికి కారణమైన శక్తులను తెలుసుకోవాలనే కుతూహలం కుత్తుకలు తెంచే అతి భయంకరమైన సామూహిక మానవ హనన ఆయుధాల ఆవిష్కరణకు దారితీసింది. ఈ అణుచరిత్రలో ముఖ్య పాత్రధారి మాన్హట్టన్ ప్రాజెక్ట్ దళపతి ఒపెన్ హైమర్ – Julius Robert Oppenheimer. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా “ఒపెన్ హైమర్”.
అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ ఈ ఏడు ఒపెన్ హైమర్ సినిమాను ఆస్కార్లతో నెత్తిన పెట్టుకుంది. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, నటులు కిల్లియన్ ముర్ఫి, రాబర్ట్ డౌనీ జూనియర్ తో పాటు అనేక మంది సాంకేతిక నిపుణులకు ఆస్కార్స్ ఇచ్చారు.
25 ఏళ్ళ కఠోర శ్రమతో ఇద్దరు జర్నలిస్టులు (Martin sherwin and kai bird) ఒపెన్ హైమర్ జీవిత చరిత్రను రాశారు. 800 పేజీల ఈ పుస్తకం ఒపెన్ హైమర్ జీవితంలోని విజయాన్ని విషాదాన్ని పూసగుచ్చినట్టు చెప్తుంది. పుస్తకంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా దర్శకుడు నోలన్ సినిమాను తీశారు. ఒక మనిషి జీవితంలో ఎన్నో ఎత్తు-పల్లాలు ఉంటాయి. ఆ పరిస్థితులు అతని దగ్గరి వారి జీవితాల మీద కూడా ఒక ముద్ర వేస్తాయి. అదే ఒపెన్ హైమర్ లాంటి శాస్త్రవేత్తల జీవితంలోని విషయాలు ప్రపంచ రూపురేఖలే మార్చేశాయి. అందుకు డైరెక్టర్ నోలన్ జరిగిన విషయాలను నిష్పక్షపాతంగా జరిగినట్టు చూపించడానికి ప్రయత్నించి ఒపెన్ హైమర్ జీవితం నుండి గ్రహించాల్సిన సారాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.
ఏదైనా ఒక గొప్ప పని సాధించాలంటే ఒంటరి పోరాటం సరిపోదు. పనికి సరిపోయే వ్యక్తులు కలిసికట్టుగా పనిచేస్తేనే ఆస్కార్లయినా , అణుబాంబాబులైనా దొరుకుతాయి. తీవ్రమైన సృజనాత్మకతను కోరుకునే పనుల్లోని వ్యక్తులు ప్రతి విషయాన్నీ విమర్శిస్తూ, మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళతారు. ఎవరూ వెళ్లని దారిలో వెళ్లే వారికి ఇది తప్పదు. ఒక విధంగా సినిమాలు తియ్యడం కూడా ఇలాంటిదే. భిన్నమైన అభిప్రాయాలున్నవారు కూర్చుని జట్టుగా ఒక కథకు జీవం పోస్తారు. దీంట్లో డైరెక్టర్ కెప్టెన్ అఫ్ ది షిప్. ఒపెన్ హైమర్ సినిమాలో బాంబు తయారీ వెనక ఉన్న చర్చలు, శాస్త్రవేత్తల విభేదాలు సినిమా తీసే విధానానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకేనేమో మానవ చరిత్రలో అణు బాంబుల ఘట్టం దారుణమైనది అయినా…ఆ బాంబు తయారీ వెనక ఉన్న వేలమంది శాస్త్రవేత్తల కఠోర కృషి, కసి, వారి మానసిక సంఘర్షణ, అంతర్గత చర్చలు సినిమారూపంలో ఎంతో వైవిధ్యభరితంగా తెరమీదికెక్కాయి. ఆ కృషికి తగ్గట్లు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి.
అలాగే ఫోన్లు తయారు చెయ్యడం, బిల్డింగులు కట్టడం, కార్లు డిజైన్ చేయడం ఇలా చెప్పుకుంటూపోతే అన్నిటి మూలాధారం సృజనాత్మకతే. మన భూమి మీద విధ్వంసాన్నైనా, స్వర్గాలనైనా సృష్టించడానికి సమిష్టి కృషి, ఉత్సుకత, సృజనాత్మకతలే పునాది.
జీవన పరమార్థం ఏంటో ఎవరికీ తెలీదు. మన జీవితానికి సార్థకత మనం చేసే పనుల నుండే వస్తుంది. ఏదైనా కొత్తది సృష్టించాలనే తపనతో స్వప్నాలను నిజం చేసినా; నరకానికి దారి చూపినా అందులో సృజనాత్మకతను, పట్టుదలను మాత్రం మెచ్చుకోకతప్పదు. ఒపెన్ హైమర్ సినిమాకు ఆస్కార్ల పంటను ఆ కోణంలోనే చూడాలి.
-పమిడికాల్వ సుజయ్
[email protected]