“ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది;
ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది;
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది;
ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది;
తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు,
బ్రతుకునకు బడిపంతులు,
భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది”
ఇది సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న పద్యం. ఆయన విజయనగర తాతాచార్యుల వంశం వారు. ఒకప్పుడు కృష్ణదేవరాయల కిరీటాన్నే ఆశీర్వదించిన చేయి మాది. ఒకప్పుడు సరస్వతీదేవి చేతి కంకణంగా వెలిగిన ప్రతిభ మాది. ఒకప్పుడు రామానుజాచార్యుల కుశాగ్ర బుద్ధికి చదువు చెప్పిన వంశం మాది. ఒకప్పుడు సకల శోభలతో వెలిగిన విజయనగర ప్రభువుల రాజధాని పెనుగొండ మాది. తల్లిదండ్రులు నాకిచ్చిన విద్యా సంపద ఒక పెద్ద చదువుల్లో ఏది కావాలంటే అది దొరికే సూపర్ బజార్. పద్నాలుగు భాషల్లో పాండిత్యం ఉంది. కానీ బతుకు తెరువుకు బడిపంతులును నేను. భాగ్యాలకు చీడ పట్టిన రాయలసీమ మాది.
పుట్టపర్తి నారాయణాచార్యులు(1919-1990)ఒక అద్భుతం. అలాంటివారు కోటికొక్కరే పుడతారు. ఎన్ని భాషల్లో ప్రావీణ్యం? బతికిన బతుకంతా అనన్యసామాన్యమయిన అక్షర యాత్ర. రాసిన ప్రతి మాట ఒక్కో కావ్యంతో సమానం. అలాంటి మాటల కోటలు పేర్చి ఎన్నెన్ని కావ్యాలు రాశారో? ఆయన ఉండగా అచ్చయినవే వందకు పైగా ఉన్నాయి. ఆయన పోయిన తరువాత ఇంకా అచ్చవుతూనే ఉన్నాయి. రాసిన ప్రతులు సరిగ్గా భద్రపరుచుకోలేక పోయినవి ఎన్ని ఉన్నాయో అని ఆయనే బాధ పడ్డారు.
పెనుగొండ లక్ష్మి, శివతాండవం, సాక్షాత్కారం, మేఘదూతం, జనప్రియ రామాయణం, సిపాయి…ఒకటా? రెండా? నూటా పది పద్యకావ్యాలు కాకుండా విమర్శలు, సమీక్షలు ఇతర గద్య రచనలు వేనకువేలు. ఒక మనిషి జీవిత కాలంలో ఇన్ని భాషల్లో ఇన్ని చదివి, ఇన్నిన్ని రాయడం సాధ్యమేనా? అని ఆశ్చర్యపోవాల్సిన సాహితీ హిమవన్నగం పుట్టపర్తి.
అలాంటి పుట్టపర్తి పన్నెండో ఏట రాసిన చిన్న పద్య కావ్యం పెనుగొండ లక్ష్మి. విద్వాన్ కోర్సులో పుట్టపర్తికి తను రాసిన పెనుగొండ లక్ష్మి కావ్యమే విద్యార్థిగా తను చదవాల్సిన పాఠం. ఇలాంటి అరుదయిన సన్నివేశం ప్రపంచ సాహితీ చరిత్రలోనే ఇంకెవరికీ ఎదురయి ఉండదని దశాబ్దాల తరబడి తెలుగువారు గొప్పగా చెప్పుకుంటున్నారు. విద్వాన్ పరీక్షలో పెనుగొండ లక్ష్మి ప్రశ్నకే ఉన్న సమయమంతా రాసి మిగతా ప్రశ్నలకు సమయం చాలక పుట్టపర్తి ఇబ్బంది పడ్డారని కూడా అంటుంటారు.
అలాంటి పుట్టపర్తికి పద్మశ్రీ వచ్చినా.. ‘సరస్వతీపుత్ర’ బిరుదే సార్థకమయ్యింది. ఆయనకు జ్ఞానపీఠం రావాల్సింది. రాలేదు. ఆ చర్చ ఇక్కడ అనవసరం.
“రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు”
అన్నాడు గుర్రం జాషువా పిరదౌసి కావ్యంలో. పుట్టపర్తివారు స్వర్గస్థులయ్యాక 1991లో ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర ఆలయం సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2006 లో ఒకానొక చీకటి రాత్రి ఆయన విగ్రహాన్ని తీసేసి…పక్కన ఆలయంలో పడేశారు. ఆ స్థానంలో ఇందిరాగాంధి విగ్రహం పెట్టాలని అనుకున్నారు. ఉదయం ఊరు నిద్ర లేచేసరికి అక్కడ విగ్రహం లేకపోవడంతో ఊరి కోపం కట్టలు తెంచుకుంది. కమ్యూనిస్టులతో పాటు అన్ని పార్టీల వారు, ప్రజాసంఘాలు, సాహిత్యాభిమానులు నిరసన వ్యక్తం చేశారు. జనాగ్రహం అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దాకా వెళ్లింది. ఆయనకు పుట్టపర్తివారితో సాన్నిహిత్యం ఉంది. దాంతో అక్కడ పుట్టపర్తివారి విగ్రహమే ఉండాలని ఆదేశించారు. అంతకుముందు కంటే పెద్ద విగ్రహం చేయించి మళ్లీ ఒక శుభ ముహూర్తాన ఆవిష్కరించారు.
జాషువా పద్యానికి భిన్నంగా ఇక్కడ రాణి మరణించి విగ్రహం కాలేకపోయింది. కానీ సుకవి మాత్రం… మరణించి ప్రజల నాల్కల మీద ఉంటూ…విగ్రహంగా కూడా ఉన్నాడు.
ఒక పని మీద ప్రొద్దుటూరు వచ్చాను. పుట్టపర్తివారి విగ్రహానికి నమస్కారం పెట్టి…ఒక సెల్ఫీ తీసుకున్నాను. పక్కనే 1950లో ఆయన అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ “శివతాండవం” రాసిన చోట ప్రదక్షిణలు చేస్తూ శివతాండవం పద్యాలు పాడాను. ఆలయానికి కొద్దిదూరంలో ప్రొద్దుటూరు సాహితీ మిత్రులు పాతికమంది అప్పటికప్పుడు పోగై…శివతాండవం, పెన్నేటి పాట పద్యాలు పాడాలని నన్ను ప్రేమగా తీసుకెళ్లారు. తీరా అక్కడికెళ్ళాక శివతాండవం పద్యాలకే సమయం సరిపోయింది.
పుట్టపర్తివారి శివతాండవాన్ని ప్రస్తావిస్తూ idhatri.com గతంలో ప్రచురించిన వ్యాసమిది:-
ధాత్రి మహతి యూ ట్యూబ్ లింక్ ఇది:-
కొసమెరుపు:-
పుట్టపర్తివారి విగ్రహం ముందు సెల్ఫీ తీసుకోవడానికి నిచ్చెన ఎక్కి పైకి వెళ్లాను. ఆయన కాళ్ల కింద రోజూ ఎవరో నిరాశ్రయుడు పడుకుంటున్నట్లు ఉంది. ఒక దుప్పటి, దిండు, అవి గాలికి ఎగిరిపోకుండా రెండు ఇటుకలు పెట్టుకుని ఉన్నాడు. ఆ విగ్రహానికి అతడు కాపలా అయి ఉంటాడు. అతడిలా పుట్టపర్తి కాళ్ల చెంతకు చేరడానికి ఏ జన్మలో కవిత్వ వాసనలు కారణమో ఎదురుగా ఉన్న అగస్త్యేశ్వరుడే చెప్పాలి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు