రాయలసీమలో ప్రొద్దుటూరుకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. అవన్నీ రాస్తే పెద్ద గ్రంథమవుతుంది. తెలుగు, సంస్కృత భాషల్లో పేరుమోసిన పండితులు, అష్టావధానులు, రచయితలు, విమర్శకులు, వ్యాకరణవేత్తలు ఎందరిని కన్నదో ప్రొద్దుటూరు!
ఈమధ్య బండలు పగిలే ఎండల వేళ రెండ్రోజులు ప్రొద్దుటూరులో తిరిగి వచ్చాను. దుమ్ము దుమ్ముగా, గజిబిజిగా, నిత్యం ఏదో పని ఉండి ఎక్కడికో పరుగెడుతున్నట్లుగా ఉండే ప్రొద్దుటూరిని నలభై ఏళ్లుగా గమనిస్తున్నాను. నాకు దగ్గరి బంధువులు, మిత్రులు అక్కడున్నారు కాబట్టి ప్రొద్దుటూరికి నేను కూడా బంధువే.
కడప, అనంతపురం జిల్లాల్లో పెళ్లిళ్లకు బంగారం కొనాలంటే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది ప్రొద్దుటూరే. మేలిమి బంగారం దొరుకుతుందని, పది రూపాయలు ధర తక్కువ ఉంటుందని పేరు రావడంతో దశాబ్దాలుగా అనేక శుభ కార్యాలకు ప్రొద్దుటూరు బంగారం అమ్ముతోంది. పైసా పైసా పోపుల పెట్టెల్లో కూడబెట్టుకుని ఎంతో మురిపెంగా ప్రొద్దుటూరుకు బస్సెక్కి వచ్చే ఎందరో మహిళలకు ప్రొద్దుటూరు ఎన్నో ఏళ్లుగా బంగారు నగ ఇచ్చి పంపుతోంది.
బట్టలకు కూడా ప్రొద్దుటూరులో లెక్కలేనన్ని దుకాణాలు.
ఒకప్పుడు సినిమా నిర్మాతలకు ప్రొద్దుటూరు వడ్డీలకు డబ్బులిచ్చేది. తరువాత రియల్ ఎస్టేట్ వారికి వడ్డీలకు ఇచ్చేది. రెండిట్లోనూ అసలు కూడా పోగొట్టుకున్నవారే ఎక్కువ. ఆ సంగతి మనకెందుకు?
దోసెలకు ప్రొద్దుటూరు పెట్టింది పేరు. ఊరి నిండా దోసె క్యాంప్, దోసె సెంటర్, దోసె స్పెషల్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. వై ఎం ఆర్ కాలనిలో రోడ్డు మీద పెద్ద చెట్టును ఆనుకుని చిన్న దోసె సెంటర్ కు వెళ్లి రండి అని నేను దిగిన లాడ్జ్ లో మేనేజర్ ఉచిత ఆహార సలహా ఇచ్చాడు. “రాయుడు కారం దోసె” అని బోర్డు. జనం బుద్ధిగా ప్లేట్లు పట్టుకుని తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు. మేము కూడా కాసేపు ఆగాము. రెండు కారం దోసెలు తిన్నాము. దోసె లోపల ఎర్రగడ్డ కారం, పైన పప్పుల పొడి, ఎర్ర చట్నీ. కొంచెం కారమెక్కువ కానీ.. ఆ రుచే రుచి. అరవై ఏళ్లుగా నడుసున్న దోసె సెంటర్ అట అది. రాయుడు మొదలు పెట్టాడు. రాయుడి తరం అయిపోయి.. ఆయన కొడుకు చలపతి ప్రస్తుతం నడుపుతున్నాడు.
సుగంధపు(వట్టివేరు)పొడి సోడాలో కలిపి తాగే నన్నారి సోడా, నన్నారి మిల్క్ షేక్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, నేతి దోసె.. ఇంకా ప్రొద్దుటూరులో రుచి చూడాల్సినవి చాలా ఉండిపోయాయి. కడుపులో చోటు లేదు. తిరగడానికి సమయం లేదు.
వీటన్నిటికంటే ప్రొద్దుటూరులో చెవుల్లో గిలిగింతలు పెట్టేది, వెంటాడేది – మాండలికం అందం. అది లిపికి అందని ఒకానొక ప్రత్యేకమైన ఉచ్చారణ. వేస్తావా? అనడానికి బేత్సావా? అంటారు. వెయ్యాలా? అనడానికి బెయ్యాల్నా? అంటారు. ఇలా అనేక మాటలు ప్రొద్దుటూరు మాండలికంలో ప్రత్యేకంగా ఉంటాయి. వ- బ కావడాన్ని వ్యాకరణమే అంగీకరించి.. సూత్రీకరించింది. బెంగాలీలో కూడా వ- బ వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఆ చర్చలోకి వెళితే ఇది భాషోత్పత్తి, భాషా పరిణామ సిద్ధాంత పాఠమవుతుంది.
లిపి శబ్దానికి సంకేతమే తప్ప సర్వస్వం కాదు. సమగ్రం కానే కాదు. అందుకే “నాలో ఊహలకు; నాలో ఊసులకు అడుగులు నేర్పావు; నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు…” పాటలో ‘పా’ను పాలల్లో “పా” గా పాడడం వల్ల; అడిగా అడిగా పాటలో “గా”ను గాడిదలో ‘గా’గా పాడడం వల్ల మన చెవుల్లో కాచిన సీసం పోసిన అనుభూతి, బాధ, భరించలేని నొప్పి కలుగుతాయి. తెలుగు క్రియాపదాలు రేపావు, అడిగావు, రాశావు మాటల్లో పా, గా, శా పలకడంలో కొంత యా, కొంత ఏ కలిసిన ధ్వని ఉంటుంది. ఉండి తీరాలి. కానీ లిపిలో ఆ ఉచ్చారణను సూచించే ఒత్తో, గుర్తో, అక్షరమో లేదు.
అలా తెలుగు లిపికి అందని ప్రొద్దుటూరు మాండలికం మాధుర్యాన్ని చెవుల నిండా నింపుకుని… నంద్యాల జిల్లాలోకి ప్రవేశించాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు