Friday, November 22, 2024

నేరము- శిక్ష

విలేఖరి:-
ప్రజా పతినిధిగారూ! ఇంత అర్ధరాత్రి పూట …ఇంత అర్జంటుగా ప్రెస్ మీట్ పెట్టారెందుకు? మీరు రాత్రికి రాత్రి పార్టీ మారుతున్నారా? అదెలాగూ జరిగేదే కదా? రేపు ఉదయాన్నే తాపీగా ప్రెస్ మీట్ పెట్టకపోయారా?

ప్రజా ప్రతినిధి:-
పార్టీ మారే విషయం కార్యకర్తల నిర్ణయానికే వదిలేశాను. కార్యకర్తలెప్పుడూ అధికారపక్షంలోనే ఉండాలని కోరుకుంటారని మీకు తెలియనిది కాదు. అయినా ఇప్పుడు ప్రెస్ మీట్ సబ్జెక్ట్ అది కాదు. హైదరాబాద్ పోలీసుల దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి.

వి:-
ఏమిటవి? వరుసగా చెప్పగలరా?

ప్ర. ప్ర:-
ఈమధ్య ఒక శనివారం రాత్రి మా ముక్కు పచ్చలారని మూడో అబ్బాయి…వాడి బలాదూర్ బ్యాచ్ అమ్మాయిలు, అబ్బాయిలతో తప్ప తాగి…అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎవరినో గుద్ది చంపినట్లు, మా వాడిని తప్పించి నేనెవరినో కిరాయి డ్రైవర్ ను…మా వాడికి బదులుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయేలా చేసినట్లు నాపై నీలాపనిందలు వేస్తున్నారు. నేను ఆకాశంలో చవితి చంద్రుడిని చూడడంవల్ల ఇదంతా జరిగిందని తెలియజేసుకుంటున్నాను.

వి:-
సార్! మీరు వినాయక వ్రత కల్పం కథ చెబుతారా? అసలు విషయం చెబుతారా?

ప్ర. ప్ర:-
ముక్కు పచ్చలారిన మా పెద్దబ్బాయి మా ఊళ్లో అక్రమంగా మైనింగ్ బిజినెస్ లో వేల కోట్లు తవ్వుకుంటాన్నాడని ఇలాగే నాపై నీలాపనిందలు వేశారు. ముక్కు పచ్చలారీ ఆరని మా రెండో అబ్బాయి మా ఊరి పక్కన ఏట్లో తివిరి ఇసుమున వేల కోట్ల తైలంబు తీయవచ్చని నిరూపించినప్పుడు…తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు అని రుజువు చేసినప్పుడు ఇలాగే నీలాపనిందలు వేశారు. చివరికి చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అన్న నీతి శతకాన్ని నమ్ముకుని ఆధ్యాత్మిక మార్గంలో సన్యాసిలా బతుకుతున్న నన్ను కూడా అంతర్జాతీయ హవాలా రాకెట్లోకి లాగారు.

వి:-
సార్! ఎప్పటినుండో ఇవన్నీ అడగాలని మాకూ ఉంది. మీకు మీరే ప్రస్తావించారు కాబట్టి…ఈ విషయాలమీద ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ముందు చెబుతానన్న హైదరాబాద్ పోలీసుల సంగతేమిటో చెప్పండి.

ప్ర. ప్ర:-
మా మూడో అబ్బాయి ఇక్కడ పది మూడు సార్లు ఫెయిల్ కావడంతో భారతీయ విద్యావ్యవస్థ మీద వాడికి ఏవగింపు కలిగి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం దుబాయ్ లో చదివి, ప్రస్తుతం రెండో సంవత్సరం లండన్లో చదువుతున్నాడు. అదేమి చిత్రమో కానీ…అన్ని సబ్జెక్టులలో అక్కడ మా వాడికి గోల్డ్ మెడల్సే మెడల్స్. ప్రతి వారాంతంలో ఇక్కడ ఫ్రెండ్స్ తో గడపడానికి వచ్చి…వెళుతుంటాడు. అలా మొన్నటి శనివారం వచ్చినప్పుడు రాత్రి వాడు కూడా ఆకాశంలో చవితి చంద్రుడిని చూసి…ఇలా అయ్యాడు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వాడు అయిదో తరగతి నుండే బెంజులు, బెంట్లీలు, బి ఎం డబుల్యులు నడుపుతున్నాడు. అంత అనుభవం ఉన్నవాడు సెవెన్ ఫిఫ్టీ ఎం ఎల్ ద్రవానికే బి ఎం డబుల్యును ఇలా గుద్ది రోడ్డున పోయేవాడిని చంపాడంటే పోలీసులు ఎలా నమ్మారో నాకర్థం కావడం లేదు. అయినా ఆ రోజు ఇంటికొచ్చి ఇంకో సెవెన్ ఫిఫ్టీ ఎం ఎల్ తాగినా స్టడీగానే ఉన్నాడు. దానికి నేనే సాక్షి.

అదే కారులో అమ్మాయిలు స్పృహలేని స్థితిలో ఉన్నారన్నది కూడా శుద్ధ అబద్దం.

వి:-
అమ్మాయిలున్నట్లు సి సి టీ వీ ఫుటేజ్ కూడా ఉంది.

ప్ర. ప్ర:-
అమ్మాయిలున్నది నిజమే. వారు కూడా ఎంత తాగినా స్పృహలోనే ఉంటారు. గొడవ అయిన వెంటనే యాప్ లో క్యాబ్ లు బుక్ చేసుకుని వారిళ్లకు వారే వెళ్లారంటే పూర్తీ స్పృహలో ఉన్నట్లే కదా?

వి:-
ఇంతకూ మీరేమి చెప్పదలచుకుంటున్నారు?

ప్ర. ప్ర:-
ఒక మైనారిటీ తీరని పిల్లాడి మీద పోలీసులకెందుకింత పగ? ప్రతీకారం? వాడు అర్జెంట్ గా లండన్ వెళ్లి పరీక్షలు రాయాలి. వాడి చదువు పాడవుతుందని మా పెదపాలేరు కొడుకు డ్రైవర్ ను పంజాగుట్టలో సరెండర్ చేయించాను. పోయిన ప్రాణం ఎలాగూ రాదు. మావాడిని పరీక్షలు రాయనివ్వరా? చదువుకు ఈ దేశంలో వ్యాల్యూయే లేదు.

న్యాయవ్యవస్థ మీద నాకు పూర్తీ నమ్మకముంది. మా పెద్దబ్బాయి జూబ్లీ హిల్స్ లో బెంట్లీ కారుతో ఎవరినో చంపినప్పుడు, మా రెండో అబ్బాయి బంజారా హిల్స్ లో ఆడి కారుతో ఆటోలో ఉన్నవారినందరినీ చంపినప్పుడు ఇలాగే మా పాలేరు పిల్లలను సరెండర్ చేయించాను. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొస్తోందో తెలిసింది. నేను పార్టీ మారడమే దీనికి పరిష్కారం. కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను.

కొసమెరుపు:-
అన్నట్లుగానే ప్రజా ప్రతినిధి ఉదయాన్నే పార్టీ మారాడు. ప్రస్తుతం అధికారపక్షంవాడు కావడం వల్ల…పోలీసులకు అతడిలో చాగంటి, గరికపాటి, సామవేదం ముగ్గురూ ఒకేసారి కనిపించారు. దాంతో అతడు చెప్పిన ప్రవచనం విని…చెవుల్లో పూలు పెట్టుకుని… బూట్లు చేతులతో పట్టుకుని…బుల్లెట్లు అతడి చేతిలో పెట్టి…తుపాకులు వాళ్ళబ్బాయికి ఆటబొమ్మలుగా ఇచ్చి…వచ్చారు!

ఫలశ్రుతి:-
ఇతి…డ్రంకెన్ డ్రయివ్ అధ్యాయే…హిట్ అండ్ రన్ సర్గే…అధికార తీర్థ సమయే…నేరం మాయం కరిష్యామి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్