ఇది చాలా చిన్న వార్తగా అనిపించవచ్చు. నిజానికిది చాలా పెద్ద వార్త. దీనికి సరైన శీర్షిక పెట్టడం కూడా కష్టమే. ఏదో ఒక శీర్షిక పెట్టాలి కాబట్టి “యువతులను చూసిన యువకుడి హత్య” అని పెట్టి ఉంటారు.
యువతులను చూడగానే యువకుడిని హత్య చేయడమేంటి? అని అనిపించవచ్చు. ఆ లెక్కన యువతులను చూసిన యువకులు హతమయ్యేలా ఉంటే…భూమ్మీద యువకులే మిగలకూడదు. ఏమో ఈ వార్తలో ఉన్న యువతుల స్వభావమే రేప్పొద్దున రాజ్యమేలితే…నిజంగానే యువకులు హతమవుతూనే ఉంటారేమో!
ఇంతకూ ఏం జరిగిందంటే…
మహారాష్ట్ర నాగపూర్ నగరంలో ఇద్దరమ్మాయిలు రాత్రి ఒక వీధి మలుపులో పాన్ డబ్బా దగ్గర సిగరెట్లు కాలుస్తూ…రింగులు రింగులుగా ఆకాశంలోకి పొగ వదులుతూ…తాగుతున్న పొగను ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు 28 ఏళ్ళ రంజిత్ రాథోడ్ సిగరెట్లు కొనుక్కోవడానికి అక్కడికొచ్చాడు. బహుశా అంతకు ముందెప్పుడూ అక్కడ అమ్మాయిలు అలా సిగరెట్లు తాగడం చూడలేదో! ఏమో! గుడ్లప్పగించి వారిని వింతగా చూస్తున్నాడు. అమ్మాయిల ఆత్మాభిమానాలు, మనోభావాలు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి కూడా కాదు…రాత్రి ఎనిమిది గంటలప్పుడు తమ మానాన తాము సిగరెట్లు తాగుతుంటే రాథోడ్ అలా జూలో జంతువులను చూసినట్లు చూడడం వారికి నచ్చలేదు. దాంతో ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయి రాథోడ్ మొహం మీదికి ధిక్కారంగా పొగ వదిలింది. రాథోడ్ వెంటనే సెల్ ఫోన్లో వారు తన మొహం మీద పొగ వదలడాన్ని చిత్రీకరించాడు. దీనితో అమ్మాయిల అహం మరింతగా దెబ్బతింది. వీడెవడో మేము సిగరెట్లు తాగుతుంటే ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నాడు అని బాయ్ ఫ్రెండ్ కు ఫిర్యాదు చేసింది. ఉక్రెయిన్ మీద విరుచుకుపడే రష్యాను కట్టడి చేయడానికి ఆగమేఘాల మీద యూరోప్, అమెరికాలు సకల ఆయుధ సాయం చేసినట్లు…ఆ బాయ్ ఫ్రెండ్ బుల్లెట్ బండెక్కి వాయువేగంతో అక్కడికొచ్చాడు. రావడం రావడమే రాథోడ్ కు దేహశుద్ధి చేశాడు. మొహం మీద పిడిగుద్దులు గుద్దాడు. కత్తితో పొడిచాడు. తనతో పాటు తన వెంట వచ్చిన చిల్లర బ్యాచ్ చేత కూడా కొట్టించాడు. స్వతంత్ర దేశంలో ఇద్దరమ్మాయిలు నడి రోడ్డు మీద సిగరెట్లు తాగుతుంటే సెల్ ఫోన్లో షూట్ చేస్తావుబే? అని ఓపిక ఉన్నంతవరకు కొట్టాడు. స్పృహదప్పిన రాథోడ్ ఆసుపత్రికి తరలించేలోపు చచ్చిపోయాడు.
ఆ దారిలో ఉన్న సీ సీ టీవీ ఫుటేజ్ సాక్ష్యంతో ఆ ఇద్దరమ్మాయిలను, రాథోడ్ ను హత్య చేసిన అమ్మాయిల ఫ్రెండును, వాడి చెంచాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైల్లో ఆ అమ్మాయిలకు సిగరెట్లు దొరుకుతాయో! లేదో! మనకంతగా తెలియదు. ప్రాణం పోగొట్టుకున్న రాథోడ్ కథ నుండి ఆధునిక ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం చాలా ఉన్నాయి.
అమ్మాయిలు సిగరెట్లు తాగకూడదు; మందు తాగకూడదు అన్న పాత చితకాయపచ్చడి సిద్ధాంతాలను వదిలిపెట్టాలి. స్త్రీ పురుషులు అన్నింటా సమానమే. అమ్మాయి సిగరెట్ తాగేలా ఉంటే అబ్బాయి హుందాగా లైటర్ వెలిగించాలి. అమ్మాయి మందుకొట్టేలా ఉంటే అబ్బాయి బాటిల్ ఓపెన్ చేసి ఇవ్వాలి. లేదంటే తన మానాన తను తలవంచుకు వెళ్లిపోవాలి.
నాగరికతలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత; అర్థం చేసుకుని అందుకనుగుణంగా నడుచుకోవాల్సిన విధ్యుక్త ధర్మం అబ్బాయిలమీదే ఉంటుందని గ్రహించాలి. లేకపోతే…రాథోడ్ లా మాజీ ప్రాణులుగా ఫొటోల్లో మిగిలిపోతారు!
ఇది పొమ్మనలేక పొగబెట్టడం కాదు.
ఏకంగా పైకి పొమ్మని పెట్టిన పొగ!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు