అది ఏడు చుక్కల చూడ చక్కని పూటకూళ్ల ఇల్లు. అనగా ఇంగ్లీషులో సెవెన్ స్టార్ హోటల్. స్విమ్మింగ్ పూల్ సైడ్ ఓపెన్ లాన్ పచ్చి గడ్డి కూడా పిచ్చిగా పెరగకుండా సెవెన్ స్టార్ రేటింగ్ కు తగినట్లు పెరిగీ పెరగక…పెరిగితే కత్తిరిస్తారేమో అని భయపడి…సైజ్ జీరో కోసం తినడం మానేసిన పన్నులు కట్టే లేదా పన్నులు ఎగ్గొట్టే సంపన్నుల్లా ఉంది. వెనకాల పెద్ద ఎల్ ఈ డి స్క్రీన్. దాని ముందు మైక్ పోడియం. దాని పక్కన ఠీవిగా రాజులకాలం నాటి ఒక సింహాసనం. ముందు ప్రెస్సు వారికి ప్లాస్టిక్ కుర్చీలు. వినీ వినిపించకుండా లైట్ మ్యూజిక్. పెట్టీ పెట్టకుండా ఒక బిస్కట్, ఒక ఎండు ద్రాక్ష, సగం ఖర్జూరం ముక్క, పావు గ్లాసు పళ్ల రసం.
ఎవరైనా ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ ఆఫీసులోనో, ప్రజల మధ్యనో ఆవిష్కరిస్తారు. వీళ్లేమిటి ఇలా సెవెన్ స్టార్ హోటల్లో! ఈ హడావుడి ఏమిటో? వేర్ వుయ్ ఆర్ గోయింగ్? అని సీనియర్ జర్నలిస్ట్ ఉస్మానియా బిస్కట్ తినకుండానే విసుక్కున్నాడు. ఈలోపు విరబోసుకున్న జుట్టును కుడిచేత్తో సవరించుకుంటూ, ఎడమచేతిలో కార్డ్ లెస్ మైకు, పేపర్లను పట్టుకోలేక పట్టుకున్న యాంకరిణి పోడియం ముందుకు వచ్చింది.
హాయ్! ఐ యామ్ కల్పన. ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు వెల్కమ్ అవర్ హానరబుల్ పార్టీ ప్రెసిడెంట్. ఐ యామ్ నాట్ టిపికల్ యాంకర్. ఐ విల్ బి మోడరేటింగ్ దిస్ ప్రోగ్రాం. దో ఐ బార్న్ ఇన్ పెంటపాలెం ఐ స్టడీడ్ సౌత్ ఈస్ట్ ఏషియా డెవెలప్మెంట్ ఎట్ హార్వర్డ్. హ్యావ్ టు ఎక్స్యూజ్ మీ ఫర్ నాట్ స్పీకింగ్ ఇన్ గ్రేట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ టెల్గు. హానరబుల్ పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ కైండ్ ఇనఫ్ టు గివజ్ దిస్ మ్యానిఫెస్టో డిజైనింగ్ వర్క్. నౌ యూ ఆర్ అట్ లిబర్టీ టు అస్క్ క్వస్చెన్స్ అంటుండగా హానరబుల్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చి సింహాసనం మీద సుఖాసీనులయ్యారు.
విలేఖరి:-
మ్యానిఫెస్టో డిజైనింగ్ ఎలా చేశారు?
కల్పన:-
మొదట ఇంగ్లీషులో రాశాము. దాన్ని గూగుల్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి…తెలుగు అను ఫాంట్ లో టెక్స్ట్ టైప్ చేశాము. తరువాత యాపిల్ మ్యాక్ సిస్టంలో పి డి ఎఫ్ చేశాము. టు డి, త్రీడి, మాయా, ఫోటో షాప్ వాడాము.
(ఉస్మానియా బిస్కట్ నోట్లో పెట్టుకుని…బహుశా ఇరానీ చాయ్ తాగడానికో ఏమో! జేబులో చేతులు పెట్టుకుని…వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నాడు ప్రశ్న అడిగిన విలేఖరి)
మరో ఔత్సాహిక విలేఖరి:-
పోయినసారి మ్యానిఫెస్టోకు- దీనికి ప్రధానమైన తేడా ఏమిటి?
కల్పన:-
2019 అని ఉన్న అన్నిచోట్లా 2024 అని మార్చడం తప్ప మిగిలినదంతా సేమ్ టు సేమ్. కట్ అండ్ పేస్ట్ వర్క్ కోసం లాస్ ఏంజిలిస్ లో హాలీవుడ్ కు పనిచేసే ఏజెన్సీని ఎంగేజ్ చేశాం. వారి పనితనమేమిటో మరికాసేపట్లో మీరే చూస్తారు.
(కళ్లు తిరుగుతున్నట్లనిపించి గ్లాసులో పావు భాగం మాత్రమే ఉన్న పళ్లరసం తాగి ఎలాగో శరీరాన్ని నియంత్రించుకున్నాడు ప్రశ్న అడిగిన విలేఖరి)
ఇంకో జూనియర్ విలేఖరి:-
ఈ మ్యానిఫెస్టో డిజైనింగ్ వర్క్ కు మీరెంత ఛార్జ్ చేశారు?
కల్పన:-
మాములుగా అయితే ఈ విషయం చెప్పకూడదు. కానీ హానరబుల్ ప్రెసిడెంట్ గారబ్బాయి హానరబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ కైండ్ ఇనఫ్ టు బి ఓపెన్ ఎవెరీ థింగ్. హీ ఈజ్ సో డెమొక్రటిక్. పాతిక కోట్లు ఛార్జ్ చేశాము.
(వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా కల్పన టీమ్ లో చేరిపోవాలని కలలు కంటూ ప్రశ్న అడిగిన విలేఖరి మౌనంగా లెక్కలేవో వేసుకుంటున్నాడు)
మరో అంతర్జాతీయ విలేఖరి:-
మీ మ్యానిఫెస్టోలో అంతర్జాతీయ సంబంధాల గురించి ఉంటాయంటున్నారు. అది కేంద్రానికి సంబంధించినది కదా? ఒక రాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో అంతర్జాతీయ సంబంధాలు అంటే నలుగురు నవ్విపోరా?
కల్పన:-
“నలుగురు కూర్చుని నవ్వే వేళల..” అని గురజాడ అన్నమాట మా హానరబుల్ ప్రెసిడెంట్ గారికి చాలా ఇష్టం. అందువల్ల మీరన్నట్లు నలుగురు నవ్వుకోవడానికే ఉద్దేశపూర్వకంగా ఆ అంశానికి మా మ్యానిఫెస్టోలో పది పేజీలు కేటాయించాము.
(ఎన్నో సార్లు ఎర్రగడ్డ మీదుగా ప్రయాణం చేసిన అంతర్జాతీయ విలేఖరికి తొలిసారి ఎర్రగడ్డకు తనంతట తానే వెళ్లేంతగా దారి తెలిసినందుకు తనను తానే అభినందించుకున్నాడు)
ఒక సినిమా విలేఖరి:-
కల్పన గారూ! మీరు పుట్టి పెరిగిన ఈ సమయంలోనే నేను కూడా పుట్టి పెరిగినందుకు గర్వంగా ఉంది. మా సినిమా పేజీకి మీ మ్యానిఫెస్టోలో ఏమేమి ఉంటాయి?
కల్పన:-
ఎస్. ఫ్రాంక్లి స్పీకింగ్ అవర్ టోటల్ మ్యానిఫెస్టో ఈజ్ ఎ పెర్ఫెక్ట్ సినిమా స్క్రిప్ట్. యూ విల్ హ్యావ్ డ్రామా. యూ విల్ హ్యావ్ ఎమోషన్. యూ విల్ హ్యావ్ ఫైటింగ్. యూ విల్ హ్యావ్ గ్రాఫిక్స్. యూ విల్ హ్యావ్ ఇంటర్నేషనల్ యానిమేషన్ టూ.
(సినిమా విలేఖరికి కళ్ల ముందు సినిమా కనపడుతున్నట్లుంది. కనురెప్ప వేయకుండా అలాగే నిలుచుని ఉన్నాడు)
సీనియర్ చాదస్తపు విలేఖరి:-
ఏమమ్మా! ఈ సోది అంతా దేనికి? ఆ మ్యానిఫెస్టో కాపీ ఒకటి మా మొహాన పడేస్తే…మా చావేదో మేమే చస్తాం.
కల్పన:-
నో సర్. యూ షుడ్ నాట్ డై యువర్ సెల్ఫ్. వుయ్ విల్ మేక్ ష్యూర్ దట్ యువర్ విష్ విల్ కమ్ ట్రూ విత్ అవర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్సల్టింగ్ సర్వీసెస్.
(చాదస్తపు విలేఖరికి నిజంగానే బతికి ఉండగానే తన అంత్యక్రియలకు వేరెవరో అవుట్ సోర్సింగ్ వారు పనులు మొదలుపెట్టినట్లు అనిపించి…తూలి పడబోయాడు. పక్కన ఇద్దరు సీనియర్ విలేఖరులు కుడి ఎడమల రెక్కలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈరోజు మా ఇంట్లో మీరే నన్నెలాగైనా దిగబెట్టాలి అని ఆయన వారిని అడుక్కుంటున్నాడు)
కల్పన:-
నౌ ఇట్స్ టైమ్ టు రిలీజ్ మ్యానిఫెస్టో-టూ జీరో టూ ఫోర్(2024). ఐ రిక్వెస్ట్ హానరబుల్ పార్టీ ప్రెసిడెంట్ టు క్లిక్ ది బటన్ విత్ హిజ్ గోల్డెన్ హ్యాండ్.
(మిగిలిన విలేఖరులు జర్నలిజం వదిలి వేరే వృత్తిలో స్థిరపడే అవకాశం భగవంతుడు తమకు ఎందుకు కల్పించలేదో అని విచారిస్తూ…తమను తామే తిట్టుకుంటున్నారు)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు