మోదీ ప్రధాని అవుతాడంటే చాలా మంది భయపడ్డారు. గుజరాత్ రక్తపు మరకల చొక్కాతో పదవిలోకి వస్తున్నాడని. నేను భయపడలేదు.
సిక్కుల్ని ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఏలినప్పుడు లేని భయం ఇప్పుడెందుకని? మైనార్టీల మీద దాడులు మనకేం కొత్తకాదు కదా!
మోదీ అధికారంలోకి వచ్చాక ఆయన ఉపన్యాసాలు, హావభావాల్లో ఫాసిస్ట్ వాసన కొట్టింది. అది నా ముక్కు సమస్య అనుకుని విక్స్ రాసుకుని పడుకున్నాను.
దేశానికి కొత్త రక్షకుడు వచ్చాడని అనుకూల మీడియా భజన విని మామూలు జనం కూడా పూనకంతో ఊగారు.
ఒక రోజు సాయంత్రం ఆయన టీవీలో కనపడి 500, 1000 నోట్ల రద్దు అన్నాడు. ఇందిరాగాంధీ పెద్ద నోట్లు రద్దు చేసినపుడు నేను యువకున్ని. నా జీవిత కాలంలో రూ.10 వేల నోటుని చూడలేదు.
నేనే కాదు, మా నాన్న, తాత కూడా చూడలేదు. బ్లాక్ మనీ లేకుండా చేయడానికి ఇందిరమ్మ అస్త్రం అన్నారు. మన దగ్గర లేని నోటు గురించి దిగులెందుకు?
కానీ 500, 1000 నోటుని , మా ఇంటి దగ్గర కూరగాయలు అమ్మే ముసలమ్మ కూడా చూసింది, దగ్గర ఉంచుకుంది. ఎకనామిక్స్ నాకూ కొంచెం తెలుసు. కోట్లాది జనం దగ్గరున్న నోట్లను రద్దు చేస్తే బ్లాక్ మనీ ఎలా ఆగిపోతుందో అర్థం కాలేదు.
జనం క్యూల్లో నిలబడ్డారు. లక్షల మంది ఉపాధి దెబ్బతినింది. నానా చావు చచ్చి నోట్లు మార్చుకున్నారు. రోడ్డు మీద నిలబడింది అంతా పేదవాళ్లు. మధ్యతరగతి. షావుకార్లు క్యూల్లో లేరు.
వాళ్ల డబ్బంతా ఎలా మారిపోయిందో తెలియదు. ఫైనల్‌గా తేలింది ఏమంటే బ్లాక్‌కి వచ్చిన నష్టమేమీ లేదు. సామాన్య జనం క్యూల్లో చచ్చిపోయారు. కొంత కాలం ఉపాధి పోయి ఆకలిపాలయ్యారు.
ఇంత పెద్ద నిర్ణయం వెనుక మోదీ చేసిన మేధోమథనం ఏంటో ఎవరికీ తెలియదు. మంచే చేయాలనుకుని చేయలేక పోయాడని సర్దుకున్నాం. తర్వాత GST అన్నాడు. ఇకపై పన్నులు ఎగ్గొట్టే వాళ్లు ఉండరన్నాడు. వాళ్ల సంగతి తెలియదు కానీ, మాలాంటి వాళ్లు కొన్నా, తిన్నా GST కట్టాల్సి వచ్చింది. అన్ని ధరలు పెరిగాయి.
మోదీ సార్ ఉన్నాడు. అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తాడు. యోగా చేస్తాడు. ఏదో రకంగా రక్షిస్తాడని జనం అనుకున్నారు. ఇంతలో పౌరసత్వ బిల్లు వచ్చింది. నిరసన వ్యక్తం చేసిన యువకుల్ని, మహిళల్ని చావబాదారు.
మాట్లాడే హక్కు మాయమవుతోందని గ్రహించి చాలా మంది నోళ్లు మూసుకున్నారు. అరిచిన వాళ్ల గొంతు, ట్రంప్‌కి పలికిన స్వాగతం ధ్వనిలో వినపడలేదు.
మన దేశ ప్రజలు మంచివాళ్లు, భక్తులు -రాముడికి గుడి కడతామంటే బీజేపీని గెలిపించిన వాళ్లు. పట్టెడన్నం గురించి అడక్కుండా పటేల్ విగ్రహాన్ని చూసి చప్పట్లు కొడతారు. మ్యాజిక్ షో నడుస్తూ ఉన్నప్పుడు భ్రాంతికి లొంగని వాస్తవం సాక్ష్యాత్కరించింది.
చైనాలో వూహాన్‌లో విషపు గాలి పుట్టింది. దానికి రూపం లేదు. ప్రయాణానికి పాస్‌పోర్టు, వీసా అక్కర్లేదు. కణజాలం తప్ప భావజాలం లేదు.
సమస్య చైనాది కదా, మనది కాదనుకున్నాం. అక్కడ రాజ్యమేలుతున్న కమ్యూనిజమే వందేళ్ల నుంచి మనల్ని ఏం చేయలేక పోయింది. ఇక కరోనా ఏం చేస్తుందని అన్నీ బార్లా తెరిచాం. మెల్లిగా దేశంలోకి వచ్చేసింది.
ప్రమాదాన్ని గ్రహించాం. కానీ ఏం చేశాం? పాముని చంపడానికి ఇల్లు తగలబెట్టేశాం. ఇంట్లో మనుషులున్నారని మరిచి పోయాం. ఈ దేశంలో కోట్ల మంది కూలీలు ఎక్కడెక్కడో బతుకుతున్నారు. లాక్‌డౌన్‌తో రహదారుల మీద కన్నీళ్లు, రక్తం పారాయి.
మోదీకి గ్రామీణ నేపథ్యం తెలియదు. గ్రామాలు ఎలా జీవిస్తాయో అర్థం కాదు.
అయినా ఇదంతా మన కోసమేనని సర్దుకున్నాం. శబ్దాలు చేశాం, దీపాలు వెలిగించాం. కరోనా భయం కంటే మోదీపైన విశ్వాసం ఉన్న రోజులు. ప్రపంచమే విలవిలలాడుతుంటే మనకు మాత్రం తప్పుతుందా అనుకున్నాం.
ఎందరో బలైన తర్వాత కరోనా తగ్గుముఖం పట్టింది. మన దేశంలోని వైద్యం వెంటిలేటర్ మీద ఉందని ఫస్ట్ వేవ్‌తో అర్థమైంది. సెకెండ్ వేవ్ ఉందని ఆయా రంగ నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు.
కరోనా కరుణతో కొంచెం టైం ఇచ్చింది. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల నిర్మాణం, ఆక్సిజన్ ఉత్పత్తి, మందుల తయారీ , వ్యాక్సిన్ వేయడం చేయాలి. మనమేం చేశాం…మళ్లీ కరోనా రాదనుకుని ఎన్నికలు, కుంభమేళాలో మునిగాం. తయారైన వ్యాక్సిన్‌ని ఉదారంగా ఇతరులకి ఇచ్చాం.
సెకెండ్ వేవ్ వచ్చింది. పగతో వచ్చింది. సిఫార్సు లేనిది శ్మశానమందు దొరకదు రవ్వంత చోటు అన్నాడో కవి. అతిశయోక్తి అనుకున్నాం. కానీ నిజం. శవాల గుట్టలు. ఆస్పత్రుల బయట రోదనలు. ప్రైవేట్ దోపిడీ. మందుల బ్లాక్ మార్కెటింగ్.
భారత్ నిజంగానే వెలుగుతోంది … చితిమంటల్లో. ప్రపంచమే మనల్ని చూసి పారిపోతోంది.
బెంగాల్ దక్కితే చాలు, దేశం ఎటు పోయినా పర్లేదు అనుకున్నారు. ఇప్పుడు బెంగాల్ దక్కలేదు. దేశం ఎటు పోతుందో తెలియడం లేదు. భూటాన్ లాంటి పేద దేశం ముందు కూడా ఆక్సిజన్ అడుక్కోవాల్సిన దుస్థితి మనది.
విలువల కోసం పదవిని వదులుకున్న వాజ్‌పేయ్ , అద్వానీ కాలం నాటి బీజేపీ కాదని తెలుసు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాల్ని కూల్చే కొత్త నాయకుల బీజేపీ. బ్లాక్ మార్కెట్‌లో ఎమ్మెల్యేలని కొన్నప్పుడు చాణక్య నీతి అని కీర్తించిన ప్రజలంతా నల్లబజారులో ఆక్సిజన్, ఇంజక్షన్లను కొంటున్నారు.
ధరలు ఎలాగూ తగ్గించలేరు. శవాలనైనా తగ్గించండి.
ఇక గడ్డం పెంచడం, టీవీలో ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి అందరిని కలుపుకుని కరోనాతో యుద్ధం చేయండి. గెలిస్తే ప్రజలు బతుకుతారు.
చావు మాకు కొత్తకాదు. రోజూ చస్తూ బతుకుతున్న వాళ్లమే. ఇంతకు మునుపు చస్తే నలుగురు మోసి మట్టి చల్లేవాళ్లు. ఇప్పుడు ప్లాస్టిక్ సంచిలో విసిరేస్తారు.
మరణాన్ని గౌరవించాలని హిందూ ధర్మ శాస్త్రమే కాదు, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
మమ్మల్ని జీవించేలా చూడండి లేదంటే గౌరవంగా మరణించేలా చూడండి!
-జి ఆర్ మహర్షి