Sunday, October 6, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాడుకుంటే పాట మా దేవుడు

పాడుకుంటే పాట మా దేవుడు

పండితుల పట్టు గౌనుల్లో..
పామరుల పరమాన్నపు తీపుల్లో..
గ్రాంథిక ఆభరణాలు ధరించీ ,
గ్రామ్యాల జడ గంటలు తిప్పుతూ
తెలుగమ్మ వెలుగులు చిందిస్తుంటే..
నన్నయ తిక్కనలూ , మధురపు ఎర్రనలూ,
పోతన పద్యాలు , పెద్దన వర్ణనలూ, ధూర్జటి ఘుమఘుమలూ దాటుతూ,
తెనాలి హాస్యాన్ని చెంపలకు అద్దుతూ అన్నమయ్య గేయాన్ని బొట్టుగా దిద్దుతూ.. అలా అలా వెడుతుంటే..
ఏమీ తోచక కొన్నేళ్ళు అటూ ఇటూ నడుస్తుంటే ..

అక్కడెక్కడో విజయనగర వీధుల్లో గురజాడ పొలికేక పెట్టాడంట…
చుట్ట వెలిగించిన చాసో అక్షరాల రింగులు ఒదిలాడంట..
పెద్ద ఫ్రేము కళ్ళద్దాల రావిశాస్త్రి లౌక్యంగా నవ్వేడంట.. ఆరుద్రలూ ,ఆత్రేయలూ అరిసెలూ బూరెలూ పెట్టినా ,
శ్రీశ్రీ ఇంకేం కావాలని విప్లవాత్మకంగా అడిగినా..
ఆ పదహారణాల తెలుగు మోము మెరవక,
మనసు సంపూర్తిగా మురవక ఇంకేదో కావాలందంట..
కలలుకంటూ కాలం కదులుతున్న
అదే రోజుల్లో –

ఓ వెన్నెల సాయంత్రం అంతకు మునుపెన్నడూ లేని మోహంతో,
కన్నులలో కావ్య కాటుకతో, మేనంతా మెరిసిపోతున్న ఆ ముసిముసి నవ్వుల జాణను వేయి పడగల విశ్వనాధ వారు వేడుకేమని అడిగారంట…

అప్పుడు ఆమె నవరసాలూ ఒలికిస్తూ మెల్లగా-తనువంతా తుళ్ళగా,
ఓ మూడక్షరాల మాట పలికిందట…
ఆ మాటకు తెలుగు నేల తందాన పాడిందట
ఆ మూడక్షరాల మాట నలుదిక్కుల పాటై,
తెలుగు సినీ గీతానికి సరికొత్త బాటై,
అందమైన అక్షరాలతో ఆడుకున్న ఆటై..

దాని పేరు వేయి భావాల “వేటూరి” అయ్యిందట..

ఆపై ఈ తెలుగు నేల భూమికి అన్ని వైపులా ఉన్న ఈ అక్షరాలు తెలిసిన ప్రతి రస హృదయనేల,
వేళాపాలా లేక ఓ నలభైయేళ్ళు
భాషంటే ఇదే అందట..
భావమంటే ఇదే అందట.. అచ్చమైన భావుకతను కనులారా చూసిందట..

పాండిత్యం తెలిసిన ఓ మామూలు విలేఖరిని, నీవుండే చోటు అది కాదని రామారావు రా..రమ్మంటే –
ఆంద్రపత్రిక వదిలిన ఆ సరస్వతీ పుత్రుడు కళల లోకంలోకి అడుగేసాడంట..
కావ్య భావాలకు తెరతీసాడంట.

ఆపై తాదాత్మ్యంతో ఆ కలం..
అణువణువూ వేదం పాడిందట..
శంకరాభరణ రాగం తీసిందట..
నాట్య మయూరికి సప్తపది చూపిందట..
ఏవేవో అందాలకు అష్టపదులు అద్దిందట.

ఆహ్లాదంగా..
ఆమనిని ఏమని అడుగుతూ
మిన్నేటి సూర్యుడిని చూపుతూ
రాలుగాయి రాగం నేర్పుతూ
మాటను మంత్రాలుగా మార్చుతూ..
బాటను పూదోటగా దిద్దుతూ..
వినేవారికీ, చూసే వారికీ ఓ సరికొత్త సరదాలు నేర్పిందట..

గోదారి ఎర్ర మిరప బొట్టు దిద్దినా,
తుంగ పైయ్యెద పొంగి గర్వంగా ఎగసినా
కృష్ణవేణి వయ్యారపు వాల్జెడ అల్లినా
కిన్నెరసాని వెన్నెల పైట వేసినా
ఆ యమునే సాక్షాత్తూ వేణువై ఆడినా,
అవన్నీ
ఆ పాళీ చిందించిన రస గుళికలే
వెండి తెరపై మెరిసిన పద కవితలే..
పదహారేళ్ళ పడుచు కలలకూ
పదిలమైన గుండె వలపుకూ
ఆ వనంలో కొమ్మా కొమ్మా సన్నాయి పాడితే..

సరదాగా
ఇందు వదనాన్నీ, భూమిపై ఇంద్రజ గమనాన్ని, గగన జఘనాన్ని, కొండగాలి కొంటెదనాన్ని చూపిన ఆ రాత-

భావ గాంభీర్యంతో –
మంచుగా మారే బొమ్మనీ, కంచికి
పోయే పూర్ణమ్మనీ పరిచయం చేసిందట..

నేను రాయని మాట లేదు,
నేను రాయలేని పాట లేదు
నా భాషకు ఎదురులేదు
నా భావాలకు తిరుగులేదు అంటూ –

నేను జల్లిన అలివేణి ఆణిముత్యాలు ఆరిపోని వెలుగు సత్యాలంటు
శ్రీ వారి ప్రేమ రాగాలు సిరిమల్లెకు వలపు దీపాలంటు
ఓ పెరటి జామ పడుచు కలలు- పచ్చ చిలక ముక్కు రంగులంటూ,
ఎన్ని వెన్నెలలు ఆ పెన్ను వేణువై పాడిందో..
ఎన్ని పున్నములకు ఆ మనసు పందిరై నిలిచిందో..
పకృతి పేరు చెపితే ఆ కలం పురి విప్పిన నెమలైపోతూ,
ఋతువర్ణ రంగులలో ఆ మునివేళ్ళు మునకలు వేస్తూ

ఆకు చాటు పిందెలు
రాలిపోని పువ్వులు
సిగ్గు తొడిగిన మొగ్గలు
కొలువు తీసిన కొమ్మలతో
సరస రాగాలు పాడుతుంటే-
ఆ పాటల చెట్టుని ఏమని వర్ణించగలం ?
ఆ రాతల ఫలములు ఎన్నని భుజించగలం ?
ఆ తళతళ లతాభరణములను ఎన్నని ధరించగలం..?

అలా అలా అన్నీ అనేస్తూ
కలలన్నీ మన కనులతో కనేస్తూ
ఓ రోజు-
సందె వేళ దాటాక సూరీడు దిగినట్టు
గోధూళి సద్దుమన్నాక మెల్లగా పొద్దు గుంకినట్టు
అంతవరకూ రాగాలు తీసిన పూవు మెల్లగా వాడిపోయినట్టు
మది అలలన్నీ వ్యధ కథలయినట్టు

ఓ దుర్ముహూర్తాన –
ప్రేమ రాతల్ని,
తెలుగు పంక్తుల్ని వదిలేసి..
ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోబోతుంటే..
అక్షరం ఏడ్చిందట.
భావం బావురుమందట.
పదాలు పోవద్దంటుంటే
వాక్యాలు వ్యాకులం చెందుతుంటుంటే
పల్లవులు విషాద రాగాన్ని
చరణాలు వియోగ తాళాన్ని
పాడుతుంటే..

తెలుగు పాట
మల్లెపూలు వదిలి
బొట్టు తీసి కదిలి
గాజులన్ని పగిలి
తెల్ల చీర కట్టి
వెక్కి వెక్కి ఏడ్చిందట..
కన్నీటి చుక్క కార్చిందట.

ఆ సిరా భూమిపై అయిపోయిన రోజు- ఇక ఎలా అంటూ వేల గొంతుకలు అంటే,
దూరం నుండి దేవతలు ఆ అక్షరాల్ని ఆశీర్వదిస్తూ-
ఇంకెంత కాలం ఇక్కడ?
అక్కడ మాకూ ఈ అక్షర పరిమళాలు కావాలి కదా అంటూ..

భూమిపై ఇతడి అక్షర
వసంతము నిరంతరము
ఆ పదము పున్నాగ పూలవనము
ఆ భావం పసివాడని హృదయము
అంటూ అభయమిస్తే..

సరే
వెళ్ళు అక్కడ ఆ దేవ లోకానికి నీ కావ్య కస్తూరి అద్దు అంటూ-

మరో వెయ్యేళ్ళు మీ పాటలు వింటాం
తెలుగున్నంత వరకు ఈ తీపిని రుచి చూస్తూనే ఉంటాం…
అంటూ ఈ జాతి వీడ్కోలు పలికిందట..
ఆ జాజి వాససలు పీలుస్తునే ఉందట..
పీలుస్తూనే ఉంటుందట.

-కిలపర్తి త్రినాధ్
9440886844
(భారత వాయుసేన మాజీ ఉద్యోగి. ప్రస్తుతం విజయనగరంలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్