Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతొలి అచ్చ తెలుగు అవధానితో ఒక సాయంత్రం

తొలి అచ్చ తెలుగు అవధానితో ఒక సాయంత్రం

నిఘంటువులు, వ్యాకరణ సూత్రాలు చెప్పలేని విషయాలు చెప్పడానికి నేను కొంతమందిని వెతికి పెట్టుకున్నాను. ఇలాంటివారు లేకపోతే కొన్నిసార్లు అయోమయంనుండి ఎప్పటికీ బయటపడలేము. అలా తొలి అచ్చ తెలుగు అవధాని, పండితుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ నాకు భాషాపరమైన సమస్యలకు ప్రత్యేకించి పద్యానికి పెద్ద దిక్కు.

ఆయన అచ్చ తెలుగు పద్య విద్య గురించి లోకంలో జరగాల్సినంత ప్రచారం జరగలేదు. జరగాల్సినంత చర్చ జరగలేదనిపిస్తుంది. తెలుగు భాషకు ప్రత్యేకమైన అవధాన విద్య సంసృతం నుండీ వచ్చినదే. ఇప్పటిలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, వీడియో రికార్డింగులు, గూగుళ్ళు, యూ ట్యూబులు, చివరికి కాగితాలు, పుస్తకాలు కూడా లేని రోజుల్లో వేదాన్ని కాపాడడానికి, ఒకరినుండి మరకొరికి పొల్లుపోకుండా అందించడానికి పద, క్రమ, ఘన, జట పద్ధతులను కనుగొన్నారు. దీనితో ఒక్క అక్షరం కూడా జారిపోకుండా ఉచ్చారణ సంప్రదాయంతోపాటు వేల ఏళ్లు వేదం ఒక తరంనుండి మరో తరానికి అందింది. ఇందులో జ్ఞాపకశక్తి ప్రధానం. ఆ జ్ఞాకశక్తికి మనసు ఏకాగ్రత కీలకం.

సంస్కృతంలో సాహిత్యానికి సంబంధం లేకుండా వేదపరిరక్షణకోసం ఏర్పడ్డ అవధానం(గుర్తుపెట్టుకుని అప్పజెప్పడం) తెలుగులో ఒక గొప్ప సాహిత్య ప్రక్రియగా రూపొందడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. ఇప్పుడు మనం చూస్తున్న అవధాన ప్రక్రియ బహుశా 150 ఏళ్ల కిందట ఏర్పడి ఉండాలి. అంతకుముందు వంద పద్యాలు ఆశువుగా రాయడం, చెప్పడంలాంటివే అవధాన విద్యగా చెల్లుబాటు అయినట్లు ఉంది. కన్నడలో ఆశువుగా పద్యాలు చెప్పే సాహితీ విద్య ఉన్నా తెలుగు అవధానమంత సంపూర్ణత్వం సంతరించుకోలేదు. తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవులు తెలుగులో అవధాన విద్య రుచిని సామాన్యులకు కూడా పరిచయం చేశారు.

అవధానం చేయడమే కత్తిమీద సాము. పద్యంలో సంస్కృత పదాలు వేసుకుంటూపోతే అల్లిక చాలా సులభం. ఒక మాటకు సంస్కృతంలో వందల నానార్థ పదాలు ప్రత్యామ్నాయంగా దొరుకుతాయి. తెలుగులో చాలా కష్టం. అలాంటిది అచ్చ తెలుగులో అవధానం చేయడమంటే అదొక ఆశ్చర్యం.

తెలుగులో అచ్చ తెలుగు అవధానాలు చేస్తున్న ఏకైక పండితుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సంస్కృతాంధ్రాల్లో పండితుడు. రెండు భాషల్లో పి హెచ్ డి లు చేశారు. తెలుగు అధ్యాపకుడిగా, ప్రాచార్యుడిగా పనిచేసి మంగళగిరిలో స్థిరపడ్డారు. రెండు భాషల్లో అనేక కావ్యాలు రాశారు.

ప్రపంచం నలుమూలలా అచ్చ తెలుగు అవధానాలు చేశారు. చేస్తున్నారు. కుదురుగా ఆలోచించి ఎనిమిదిమందితో ఆడే ఆట కాబట్టి అష్టావధానాన్ని అచ్చతెలుగులో “ఎనుకుదురాట” అన్నారు. అవధానిని ‘ఎనుకుదురాటగండ’ అన్నారు. మన దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఇంగ్లిషులో చెప్పినట్లు ఒకప్పుడు సంస్కృతంలో చెబితే తప్ప తెలుగు అర్థమయ్యేది కాదు. పరభాష మోజులో అందమైన తెలుగు వాడకాన్ని పక్కనబెట్టి…తెలుగు నిండా సంస్కృతాన్ని నింపేశాము.

“నిండు నూరేళ్లు చల్లంగ ఉండు”
అన్నది పదహారణాల అచ్చ తెలుగు మాట.
“శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
అన్నది సంస్కృత వేదాశీర్వచనం.

నిజానికి అర్థంలో రెండూ ఒకటే. కానీ మనకు “చల్లంగ ఉండు” అంటే మొరటుగా, పట్టించుకోనట్లుగా, తేలికగా అనిపిస్తుంది. “శతమానం భవతి” అనగానే గంభీరంగా, మహా మంత్ర ఆశీర్వచనంగా, చాలా పవిత్రంగా, గొప్ప మర్యాదగా అనిపిస్తుంది.

సంస్కృతం మీద మన ప్రేమ కంటిని మించిన కాటుక వంటిది. కంటికి కాటుక అందం. కానీ కన్ను కనపడనంతగా కాటుక పులుముకుంటే కళ్లు పోతాయి. చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది. భాషా పరిణామక్రమంలో ఎంతో కొంత మూల రూపాలు, ఇతర భాషల పదాలు వస్తాయి. సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగును చిన్న చూపు చూసిన మన నిర్లక్ష్యం ఇప్పుడు మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు ఉంది.

తెలుగు కూడు, బువ్వ, ముద్ద, ఎంగిలిపడు మొరటు, అనాగరికం.
సంస్కృత భోజనం, ఆహారం, ఉపాహారం, అన్నం చాలా గొప్పవి. నాజూకయినవి.
మొక్కుకు దిక్కు లేదు. నమస్కారం సంస్కారవంతమైనది. చదువు పనికి రానిది. విద్య గొప్పది.
తుండు గుడ్డ పనికిరానిది. ఉత్తరీయం మహా గొప్పది. కాపు కాయకూడదు. ఫలసాయమే రావాలి. తిండి గింజలు తినకూడదు. ధాన్యమే ధ్యానంగా తినాలి. ఎండ పొద్దు వద్దు. మధ్యాహ్నం ముద్దు.

ఇలా తెలుగు భాషలో అందంగా, అద్భుతంగా, సహజంగా ఉన్న మాటలను వాడడం మానేసి సంస్కృతం మాటలను వాడడం శతాబ్దాల క్రితమే మొదలు పెట్టాం. తెలుగు అధికార భాష, తెలుగు మాతృ భాష అన్న మాటల్లో కూడా అధికార, మాతృ మాటలు తెలుగు కాదు. సంస్కృతం.

భాషకు సంబంధించి మనది ప్రతీకాత్మక లేదా సంకేత బాధ. నిజం బాధ కాదు. తెలుగు మీడియా ప్రామాణిక భాషలో పారిభాషిక పదాలన్నీ సంస్కృతమే.
ఐక్య రాజ్య సమితి,
అణ్వాయుధం,
శిఖరాగ్ర సమావేశం,
శీతలీకరణ కేంద్రం,
ప్రశ్నోత్తర సమయం,
సభాపతి,
అనంతర పరిణామం,
స్నాతకోత్సవం,
విద్యాభ్యాసం,
గృహ ప్రవేశం,
ప్రత్యక్ష ప్రసారం,
ఇవే మాటలకు తమిళంలో ఏయే మాటలు వాడుతున్నారో తెలుసుకుంటే తెలుగులో తెలుగు ఎంతో తెలిసిపోతుంది.

మనం రోజూ వాడే మాటల్లో ఏది తెలుగో? ఏది సంస్కృతమో? తెలుసుకుంటే మన సంస్కృతం మోజు ఎంత బలమయినదో పాలు తాగే పసిపిల్లలకు కూడా అర్థమైపోతుంది. గడచిన యాభై ఏళ్ళల్లో తెలుగులో సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది.

ఈ పరిణామ క్రమంలో చూసినప్పుడు తెలుగు తనకు తానుగా ఎందుకు వెనక్కు వెళ్ళిపోతోందో? ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.

భాషకు సంబంధించి మన మనసులో ఉన్న అభిప్రాయాలను బట్టి వీటి విలువలు ఆధారపడి ఉంటాయి. ఇంతకంటే ఈ చర్చలోకి వెళితే సంప్రదాయవాదుల మనసు గాయపడుతుంది. వదిలేద్దాం.

ఈనేపథ్యంలో అచ్చతెలుగు అందాన్ని “ఎనుకుదురాట” ద్వారా ప్రపంచానికి రుచి చూపిస్తున్న పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (94403 46287)ను పరిచయం చేయడానికి ఈ నాలుగు మాటలు. ఆయన నాకు గురువు. శ్రేయోభిలాషి. మిత్రుడు. ఆయన మాట్లాడే ప్రతిమాటలో ఒక తెలుగు శబ్ద చమత్కారం ఉంటుంది. ఈమధ్య మంగళగిరిలో ఆయనముందు ఒక సాయంత్రం కూర్చుంటే సాహిత్యంలో మునకలు వేయించారు. ఆకాశమంత అవధాన విద్యను పట్టి నా కళ్ల ముందు నిలుచోబెట్టారు. విశ్వనాథవారి హృద్యమైన పద్యవిద్య ప్రత్యేకతను విడమరిచి చెప్పారు. ఆయన ఎనుకుదురాట అచ్చతెలుగు అందచందాలమీద ఆయా పద్యాల ఉదాహరణలతో విడిగా మరో వ్యాసం రాస్తాను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్