Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆ పాట పంచామృతం

ఆ పాట పంచామృతం

పాట ఒక ప్రవాహం.
అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసినవాడు సిరివెన్నెల.

పాట ఒక రచనా శిల్పం.
యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను అందమయిన శిల్పంగా తీర్చిదిద్దిన గేయ శిల్పి సిరివెన్నెల.

పాట ఒక సందేశం.
మాటల మధ్య మాటలు మోయలేనంత భావాన్ని దట్టించి, ఒక్కొక్క మాటలో ఒక్కో గ్రంథమంత సందేశాన్ని నింపినవాడు సిరివెన్నెల.

పాట ఒక సంగీతం.
వెంట వస్తుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వీనుల విందు అవుతుంది. ఆ సంగీత స్వరాక్షరాల్లోకి ఒదిగేలా అక్షరాలను కూర్చడం ఒక కళ. అది చివరి ప్రాస అక్షరాన్ని ముందు రాసి…తరువాత అక్షరాలను పేర్చుకుంటూ పొతే వచ్చే నీచ ప్రాసల ప్రహసన విద్య కాదు. ఒకే మాటకు అనేకానేక పదాలు వెంటపడి మమ్మల్ని వాడుకో అని రచయితను మొహమాటపెట్టే పద సంపద సముద్రాన్ని ఔపోసన పట్టిన సిద్ధ విద్య. సాధ్య విద్య. ఇలాంటి సిద్ధ, సాధ్య విద్యలతో పాటలు రాసినవాడు సిరివెన్నెల.

పాట ఒక ధర్మం.
ఒక దేశానికి తనదయిన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వారసత్వం, విలువలు, ఆదర్శాలు ఉంటాయి. కాలపరీక్షలో అవి నిలిచి ఉంటాయి. అవి ఒక ధర్మంగా రూపుదిద్దుకుంటాయి. సమాజం పాటించి తీరాల్సిన ధర్మంగా వాటిని పాటల్లో ప్రతిఫలింపచేయడం ఒక తపస్సు. ఇలా తపస్సుగా పాటలు రాసినవాడు సిరివెన్నెల.

పాట ఒక భాష.
మాట్లాడేదంతా భాషే. రాసేదంతా భాషే. శ్లోకంలో, పద్యంలో, పాటలో, జానపదంలో, కవితలో, వచనంలో, చివరికి మాటగా బయటికి పలకకకుండా లోలోపల అనుకున్నా…అంతా భాషే. ప్రతి భాషకు దాని సొంత వ్యక్తీకరణ పద్ధతి, ఉచ్చారణ, నుడికారాలు ఉంటాయి. మాట్లాడుతున్నంత సహజంగా పాట రాయడం కుదరదు. ఆ రాస్తున్న పాటలో అలవోకగా నుడికారపు అందచందాలను పట్టి అలంకరించడం ఇంకా కష్టం. ఇలా మాటను పాటగా చేసి, ఆ పాటలో పదహారణాల తెలుగుకు పట్టం కట్టినవాడు సిరివెన్నెల.

పాట ఒక ఓదార్పు.
తెగిన రెక్కలకు పాట తన చరణాలతో కొత్త రెక్కలు తొడుగుతుంది. కొడిగట్టిన దీపం ప్రమిదలో చమురుపోసి మళ్లీ దీపాన్ని వెలిగించి కొత్త వెలుగులు పంచుతుంది. అలుముకున్న చీకట్లలో చిరువెలుగులు తెస్తుంది. కాళ్లు తెగిపడుతున్నా నడిచే సత్తువను కూడగడుతుంది. భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. వెన్ను తట్టి నిలబెడుతుంది. కర్తవ్యం బోధిస్తుంది. కొత్తదారులు చూపూతుంది. ఇలా పాటకొక పరమ ప్రయోజనం ఉందని తెలిసి పరమ ప్రమాణాలతో పాట రాసినవాడు సిరివెన్నెల.

పాట భాషకు ఒక సోపానం.
సిరివెన్నెలలు లేని వేళల్లో వచ్చే తెలుగు పాటలో తెలుగు వెతుక్కోవడం ఎలా అని కొందరికి నిర్వేదం.

పాట ఒక చర్చ.
పాటల్లో ప్రయోగించిన మాటల మీద గంటలు గంటలు మాట్లాడుతూ, అర్థాన్వయాలను విడమరచి చెప్పినవాడు సిరివెన్నెల.

పాట ఒక సందర్భం.
సిరివెన్నెలలు లేని గేయసీమలో…
వృక్షాల్లేని చోట…ఆముద వృక్షమే మహా వృక్షంగా అంగీకరించాల్సి వస్తుందని కొందరు తెలుగు భాషాభిమానుల నిర్వేదం.

అలాంటి ‘చెంబోలు’ సీతారామశాస్త్రి ఇంటిపేరు ‘సిరివెన్నెల’ కావడానికి ముందు; అయ్యాక ఆ ప్రయాణం తెలుసుకోదగ్గది. ఆ పాటలు పుట్టడానికి సినిమాల్లో సందర్భాలు కేవలం కాకతాళీయం. ఆ సినిమా సందర్భాలు దాటి…సిరివెన్నెల మన ఇళ్లల్లోకి వచ్చి కూర్చుంటాడు. మనల్ను ప్రశ్నిస్తాడు. ఓదారుస్తాడు. ధైర్యం చెబుతాడు. భుజం తట్టి…మన వెంట నడుస్తాడు. మన బాధను మరచిపోయి పాడుకునే పాటవుతాడు. మనం ఎగిరి గంతులేసే తుళ్లింత అవుతాడు. అన్నీ ఉన్నా అన్నిటినీ వదిలి…విరాగి కమ్మంటాడు. గుండెలు మెలిపెట్టే కష్టంలో కారు చీకట్లలో ఉంటే…రేపటి వెలుగులు పట్టుకొచ్చే ఆశాకిరణం అవుతాడు. కన్నీళ్లను దరిజేరనివ్వకుండా…ఓటమికి తలవంచని ఓరిమిని దట్టించి…తెగిన రెక్కలకు కొత్త రెక్కలు తొడుగుతాడు. మనం అడక్కుండానే వచ్చి మన దిగులు తీర్చే ఆత్మీయుడవుతాడు.

మనకింత దగ్గరైన సిరివెన్నెలలో ఏదో గమ్మత్తు ఉంది. ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను పట్టి చూపడానికి రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర పెద్ద పరిశోధనే చేశారు. ఆ పరిశోధనను “పాట షికారుకొచ్చింది” పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఇది ఆ పుస్తక సమీక్ష కాదు. కేవలం పరిచయం.

ఈ పుస్తకం ఎందుకు చదవాలో ఆసక్తి కలిగించేలా రచయిత చివరి అట్టమీద అందంగా అచ్చేసిన మాటలివి:-

  • ఆయన ప్రతిపాటా గొప్పయుద్ధం తరువాతి విజయం
  • ఆ పాటలోని పల్లవి-ప్రేమైక జీవులకు పూలకారు పల్లకి చరణం – శిశిరానికి చోటివ్వని వలపు బాణం.
  • పద పదాన స్థైర్యాన్ని, దట్టించే ఫిరంగి ధ్వానం- ఆగళం. పిరికితనాన్ని పాతాళానికి తొక్కేసిన స్ఫూర్తి శిఖరం ఆ కలం.
  • ఆయన – మనకోసం తనలో తను రగిలిన కవి -పాటకోసం తనలోతను పగిలిన కవి.
  • ఆయన – దీర్ఘ నిశిత రాత్రుల మెలకువల్లో గేయమై ఉదయించినవాడు -ధ్వనికి వెన్నెల సిరులద్ది…మనిషికి ప్రాణప్రతిష్ఠ చేసినవాడు.
  • ఇంతా చేసి ఎంతో రాసి – చివరకు మీ అందరి హృదయాలనే పాటగా కట్టానంటూ – ఏదీ పట్టనట్టు అన్నీ వదులుకొన్నట్లు…దేన్నీ ఖాతరు చేయనట్టు…దేనికీ లొంగనట్టు… జగమంత కుటుంబంతో ఏకాకి జీవితాన పాటకోసం మాత్రమే ఇలా నేలమీదికి షికారుకొచ్చినట్టు వచ్చి…వెళ్లినవాడు.

సిరివెన్నెల భావాలకు బీజాలెలా పడ్డాయో తెలుసుకోవాలనుకునేవారు;
హిందీ, సంస్కృతం, తెలుగు భాషల్లో సిరివెన్నెల లోతెంతో తెలుసుకోవాలనుకునేవారు;
ప్రతి పాటను పంచామృతం చేయడానికి ఆయన ఎంతగా మేధోమథనం చేసేవారో తెలుసుకోవాలనుకునేవారు ఈ పుస్తకం చదవాలి.

ఎంపిక చేసిన కొన్ని పాటలకు అర్థ వివరణకోసం రచయిత అనేకమందిని సంప్రతించినట్లు ముందుమాటలో చెప్పుకున్నారు. సిరివెన్నెలతో వ్యక్తిగతంగా పరిచయం, చనువు ఉన్న రాఘవేంద్రకు ఒకరకంగా సిరివెన్నెల మార్గదర్శి కూడా. ఆయనమీద ఉన్న అపారమైన ప్రేమాభిమానాలకు గుర్తుగా కూతురికి ‘సిరివెన్నెల’ పేరే పెట్టారు రాఘవేంద్ర.

పాట పట్ల భయమూ, భక్తి ఉన్న సిరివెన్నెల రచనలకు పునాది ఏమిటో వివరిస్తుంది ఈ పుస్తకం.

పాట షికారుకొచ్చింది
(సిరివెన్నెల జీవిత చరిత్ర, పాటల చరిత్ర)
పేజీలు- 274
వెల- 250/-
ప్రతులకు- ఆకెళ్ల రాఘవేంద్ర
8897826108, 9849311109
[email protected]

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్