Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంగీత మహా మహోపాధ్యాయ కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం

సంగీత మహా మహోపాధ్యాయ కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం

కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం(1929-2016) గారి అనన్యసామాన్యమైన సంగీత ప్రతిభ, శ్రీవిద్యా ఉపాసన గురించి రాసేంత శాస్త్రజ్ఞానం నాకు లేదు. అయితే ఆయన ప్రేమాభిమానాలను అనంతంగా పొందగలిగాను కాబట్టి ఆయనగురించి ఇప్పటి తరానికి చెప్పాల్సిన బాధ్యత నామీద ఉంది. 1995లో నేనొక పత్రికలో పనిచేసేప్పుడు ఆ పత్రికకు ఆయన వారఫలాలు రాసేవారు. ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లో ఆయన ఇల్లు. అక్కడొక కోచింగ్ సెంటర్లో ఏ పి పి ఎస్ సి పరీక్షల కోచింగ్ క్లాసులకు వెళ్లేవాడిని. పక్కనే కదా వారి ఇల్లు…వెళ్లి ఆ వారం వారఫలాల కాగితాలు తీసుకుని ఆఫీస్ కు వెళ్లచ్చు కదా! అనుకుని వెళ్లాను. అపార్ట్ మెంట్ లో మూల ఇల్లు. ఇంటి ముందు చాలా చెప్పుల జతలు. లోపలికెళ్లేసరికి సంగీతం క్లాసు జరుగుతోంది. ఆయన చెక్క కుర్చీలో కూర్చుని పాఠం చెబుతున్నారు. కింద చాపల మీద పిల్లలు సంగీత సాధన చేస్తున్నారు. కూర్చోమని సైగ చేశారు. పిల్లలతోపాటు కాసేపు క్లాసు విన్నాను.

నన్ను నేను పరిచయం చేసుకుని…వచ్చినపని చెప్పాను. అయ్యో! మీరు రావడం దేనికి? నేను ఎప్పటిలా పంపేవాడిని కదా! అన్నారు. నా వయసు పాతికేళ్లు. ఆయన డెబ్బయ్ ల దగ్గర్లో ఉండి ఉంటారు. ఇంత పెద్దాయన ఇంత చిన్నవాడిని మీరు అంటారేమిటి? అనుకున్నా. ఈలోపు వంటింట్లోకి వెళ్లి కాఫీ గ్లాసుతో వచ్చి చేతికిచ్చారు. సార్ మీరు పెద్దవారు. ఇలా నాలాంటివారికి… అనబోతే… “అభ్యాగతః స్వయం విష్ణుః…పైగా మీ పేరే మధుసూదన్…అభ్యాగతః స్వయం మధుసూదనః” అన్నారు. ఓర్నాయనోయ్ నిజంగానే ఈయన రుషి… అనుకుని కాళ్లమీద పడ్డాను. ఆ క్షణం నుండి ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించాను.

త్యాగరాజ కీర్తనల సాహిత్యం, భక్తి తత్త్వం మీద మా నాన్న పి హెచ్ డి చేయడం వల్ల; తాళ్ళపాక అన్నమయ్య సాహిత్యం మీద మా తాత అనేక వ్యాసాలు రాయడం వల్ల చిన్నప్పుడే కొంత నాకు ఆ సంగీత, సాహిత్యాలతో పరిచయం ఉందనుకుని మాట్లాడేవాడిని. అది కొల్లేగళ్ గారితో చనువు ఏర్పడ్డానికి కారణమయ్యింది. తరువాత సంగీత, సాహిత్యాల్లో నాకు ఓనమాలు కూడా తెలియవని స్పష్టంగా తెలిసింది. అది వేరే విషయం.

తమిళ మూలాలతో కర్ణాటక మీదుగా 1953లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డవారు. తమిళం, కన్నడ, తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భారతీయ భాషలు మాట్లాడగలిగినవారు. దేశమంతా సంగీత కచేరీలు చేసినవారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చినవారు. అనేక సంగీత గ్రంథాలకు పాఠాలు రాసినవారు. తన ఇంటికి దగ్గర్లోని విద్యానగర్ శ్రీ సీతా రామాలయంలో త్యాగయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహామహులను పిలిచి…విగ్రహావిష్కరణ చేయించినవారు. చిన్న తిరువయ్యూర్ పేరిట ఆ ఆలయంలో కొన్ని దశాబ్దాలపాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించినవారు.

ఆయనను వరించిన బిరుదులు:-
1. సంగీత మహా మహోపాధ్యాయ
2. బహు భాషాలంకృత వాగ్గేయ సౌందర్య శారదా తిలక
3. శ్రీ విద్యోపాసక శ్రేష్ఠ

ఇవన్నీ తెలిశాక ఆయనతో మాట్లాడ్డానికి సిగ్గుపడేవాడిని. త్యాగయ్య మీద ఆయన రాసిన పుస్తకం ఇచ్చి చదవమన్నారు. పోతనను ఆవాహన చేసుకున్న త్యాగయ్య ఆ పద్యాలనే కీర్తనలుగా ఎలా మలిచారో చాలా లోతుగా వివరించారు. పలికించెడి విభుడు పోతనకైనా…త్యాగయ్యకైనా రామభద్రుడే. త్యాగయ్య నాదోపాసనతో రాముడిని ఎలా పట్టుకున్నాడో సుబ్రహ్మణ్యం గారు వివరిస్తుండగా గంటలు గంటలు విన్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని. కుచ్చిళ్లు పోసి…కట్టిన పంచ, ఉత్తరీయం, తెల్ల గడ్డం, నుదుట బొట్టుతో మన ఎదురుగా కూర్చున్న ఒక వాల్మీకో, వ్యాసుడిలా ఉంటారు. చిన్న పిల్లలను కూడా మీరు అనే సంబోధిస్తారు. పరమ సాత్వికుడు. పరమ నిరాడంబరమైన జీవనం. బహుశా పోతన, త్యాగయ్య అంటే ఇష్టం కాస్తా…జీవన విధానంగా మార్చుకున్నట్లున్నారు. వినయం పోతపోసినట్లు, ఉత్తమ సంస్కారానికి పంచ కట్టినట్లు ఉంటారు.

దాదాపు ఆరు భాషల్లో ఆయన రాసిన సంగీత పాఠాలు, ప్రత్యేకించి త్యాగయ్య నాదోపాసన రహస్యాలు అచ్చయ్యాయి. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కీర్తనల్లో పెద్దగా ప్రచారం లేనివాటిని ఎంపికచేసుకుని విస్తృత ప్రచారం కలిగించారు. స్వయంగా కొన్ని కృతులు రచించి…గానం చేశారు.

పోతన పద్యాలంటే ఆయనకు ప్రాణం. ఆయనముందు చేతులు కట్టుకుని గజేంద్రమోక్షణంలో పద్యాలు పాడేవాడిని.

“పాద ద్వంద్వము నేల మోపి, పవనున్‌ బంధించి పంచేంద్రియో
న్మాదంబున్‌ బరిమార్చి, బుద్ధి లతకున్‌ మాఱాకు హత్తించి, ని
ష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం గ్రీడించు యోగేంద్రు మ
ర్యాదన్‌ నక్రము విక్రమించె గరి పాదాక్రాంత నిర్వక్రమై”

“ఊహ గలంగి జీవనపు టోలమునన్‌ బడి పోరుచున్‌ మహా
మోహలతా నిబద్ధ పదమున్‌ విడిపించు కొనంగలేక సం
దేహము బొందు దేహిక్రియ దీన దశన్‌ గజముండె భీషణ
గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై”

ఈ పద్యాలు వింటూ కళ్లు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. కాసేపటికి…కళ్లు తెరిచి…తేరుకుని మీరొస్తే మా ఇంటికి పోతన వచ్చినట్లే…అని అనేవారు. అప్పుడు అమాయకత్వం వల్ల పొంగిపోయినందుకు… ఇప్పుడు సిగ్గుపడుతున్నాను.

“దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ?”
లాంటి అన్నమయ్య కీర్తనలను పద్యాల్లా పాడేవాడిని. త్యాగయ్య మోజులో పడి జీవితమంతా ఆ కృతులకే సరిపోయింది… అన్నమయ్యను చదవాల్సినంత చదవలేదేమో! అని తనలో తానే అనుకుంటూ…పైకి అనేసేవారు.

ఆయన గొప్ప జ్యోతిషుడు. శ్రీ విద్యా ఉపాసకుడు. నగుమోము కనలేని; రారా మా ఇంటి దాకా; ఎందరో మహానుభావులు లాంటి కీర్తనలకు సంగీత, సాహిత్య, మంత్రార్థాలను ఆయన ఆవిష్కరించే విధానం మెరుపులా ఉంటుంది. అప్పటికి కొన్ని వందల, వేల సార్లు ఆ కీర్తనలను మనం విని ఉంటాం. మనకు రాముడెందుకు? రాముడి మనసు గెలిచిన ఎందరో మహానుభావులున్నారు- ముందు వారి కాళ్లు పట్టుకుందాం- వారే మనకు రాముడి కాళ్లు పట్టిస్తారు అంటాడు త్యాగయ్య అంటూ…ప్రపంచ కీర్తనా సాహిత్యంలో “ఎందరో మహానుభావులు”తో పోల్చదగ్గ కీర్తన మరొకటి ఉండకపోవచ్చు అని…ఆ కీర్తనను ఆయన పదే పదే ప్రస్తావించేవారు.

ఈకాలంలో ఆశ్రమాల్లో రుషులను చూడనివారు కొల్లేగళ్ గారిని చూసి ఉన్నా…ఆయన గురించి తెలుసుకున్నా చాలు. ఆయన నడకలో పోతనను, పలుకులో త్యాగయ్యను చూశాను నేను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్