ద్వాపర యుగం. కృష్ణుడిని తన ఆస్తిగా అనుకుంటూ ఉంటుంది సత్యభామ. అలా ఎవరనుకుంటే వారికి గుణపాఠం చెబుతూ ఉంటాడు కృష్ణుడు. ఆయనకదో లీల. మధ్యలో నారదుడు ఊరికే ఉండడు కదా? రుక్మిణి- సత్యభామ మధ్య పోటీ పెట్టదలుచుకుంటాడు. తులాభారం వేసి టోకుగా కృష్ణుడిని కొనేస్తాను అంటుంది సత్యభామ. సరే అంటాడు నారదుడు. ఏడు వారాల నగలు, అంతః పురంలో దాచి ఉంచిన వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ కెంపులన్నీ వేసింది. త్రాసులో ముల్లు ఇసుమంత కదల్లేదు. కృష్ణుడు పైకి లేవలేదు.
అమ్మా! నువ్వు కొనలేక పోయావు. నేను బయట మార్కెట్లో నా ఇష్టమొచ్చిన రేటుకు కృష్ణుడిని వేలం వేసుకుంటాను. వెళ్లొస్తాం. లే కృష్ణా! అని భుజం పట్టుకుని లేపబోతాడు. అప్పుడు సత్యభామకు సత్యం బోధపడుతుంది. రుక్మిణి దగ్గరికి పరుగెత్తుతుంది. రుక్మిణి భక్తితో ఒక తులసీ దళం తీసుకుని తులాభారం దగ్గరికి వస్తుంది. కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అటువైపు త్రాసులో తులసీదళం పెట్టి నమస్కరించి నిలుచుంటుంది. ఒక్కసారిగా కృష్ణుడు కూర్చున్న తక్కెడ పైకి లేస్తుంది. హమ్మయ్య! లేక పొతే ద్వారక నడిబజారు వేలంలో కృష్ణుడిని ఎవరు కొనుక్కునేవారో అని సత్యభామ ఊపిరి పీల్చుకుంటుంది.
ద్వాపర యుగానికంటే ఇంకా ముందు:-
“జవదాటి యెఱుగ దీయువతీ లలామంబు పతి మాట రతనాల పైడిమూట
అడుగుదప్పి యెఱుగ దత్తమామలయాజ్ఞ కసమానభక్తి దివ్యానురక్తి
అణుమాత్రమైనబొంకను మాట యెఱుగదీ కలుషవిహీన నవ్వులనైన
కోపంబెరుగదీ గుణవితాన వితాంత యొరులెంతని దూఱుచున్నసుంత
ఈ లతాంగి సమస్తభూపాలమకుట
భవ్యమణికాంతిశబలితపాదుడైన
సార్వభౌముని శ్రీహరిశ్చంద్రుభార్య
దాసిగానీపె గొనరయ్యధన్యులార”
దేవేంద్రుడి అమరావతిలో సాయంత్రం పూట లోకాభిరామాయణం చర్చ జరుగుతోంది. సత్యం మీద నిలబడే మహానుభావులెవరున్నారన్న విషయం మీదికి చర్చ మళ్లింది. పద్నాలుగు లోకాల్లో భూలోకంలో ఇక్ష్వాకు వంశ ప్రభువు సత్యహరిశ్చంద్రుడి తరువాతే ఎవరయినా అని వసిష్ఠుడు అన్నాడు. అయితే నేను పరీక్షిస్తాను అని విశ్వామిత్రుడు అంటే దేవతలు సరే అన్నారు. అలా చతుస్సాగర పర్యంత సమస్త భూమండలాన్ని సర్వం సహా చక్రవర్తిగా పరిపాలించే సత్యహరిశ్చంద్రుడి సత్యసంధత పరీక్షకు నిలబడాల్సి వస్తుంది. రాజ్యం గీజ్యం అన్నీ పోయినా హారిశ్చంద్రుడు మాట తప్పుడు. కాశీ నడి వీధిలో భార్యను వేలంలో అమ్మి విశ్వామిత్రుడికి నాలుగు రూకలు అప్పు చెల్లు వేస్తాడు. ఆ సందర్భంలో వేలం పాటలో ఎవరయినా కొనండి నాయనా! అని అంతటి హరిశ్చంద్రుడు దీనంగా అడిగే ఈ పద్యం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన సత్యహరిశ్చంద్ర పద్య నాటకంలోనిది. ముప్పయ్, నలభై ఏళ్ల కిందటి వరకు తెలుగునేల నలుచెరగులా నాటకాల్లో మారుమోగిన పద్యమిది. బలిజేపల్లి నాటకం వల్లే సత్యహరిశ్చంద్రుడు తెలుగురాజు అయిపోయి మనకు బాగా దగ్గరయ్యాడు.
సత్యహరిశ్చంద్రుడు కాశీలో పాడింది రికార్డ్ అయిన మొదటి వేలం పాట!
కృష్ణ తులాభారంలో నారదుడు వేయదలుచుకున్నదే రికార్డ్ అయిన రెండో వేలం పాట!
అప్పటినుండి వేలం పాటలు పాడుతూనే ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం. ఆమధ్య వేలం పాటల్లో శాస్త్రీయ విధానాలు, వినూత్న విధానాలు కనిపెట్టిన ఇద్దరు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని కూడా ప్రకటించారు.
ఇంగ్లీషులో ఆక్షన్ వేస్తారు. తెలుగులో వేలాన్ని పాడాలి. ఒకటోసారి…
రెండోసారి…
మూడోసారి…
అని ఆరోహణ అవరోహణలో కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఇదివరకు వేలాన్ని పాడేవారేమో!
తీసుకున్న లక్ష అప్పు తీర్చలేక ఎక్కడ బ్యాంకు వారు పదిలక్షల ఇంటిని వేలం వేస్తారో అన్న భయంతో రైతు పొలంలో చెట్టు కొమ్మకు తన ప్రాణాన్ని వేలాడేస్తాడు. పది రూపాయలు స్థిరాస్తి లేని వారికి పదివేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి బ్యాంకులు బాంబే అరేబియా తీరంలో తమను తాము వేలం వేసుకుంటాయి. ఉద్యోగులు తమ జీవితాలను వేలం వేసుకుని యాజమాన్యాలకు బహుమతిగా ఇస్తాయి. ఎన్నికల కమిషన్ కంటపడకుండా ఓట్లను కూడా కొందరు వేలంలో కొంటారు. ఇదివరకు సారా వేలం పాటలతో పల్లెలు కళకళలాడేవి.
వేలం అన్నమాటలో వెల ఉండడం కాకతాళీయమో, లేక శబ్ద పరిణామమో భాషోత్పత్తి శాస్త్రవేత్తలు తేల్చాల్సిన విషయం.
మనమంతా ఎవరో పాడుకున్న వేలంలో పల్లవులం. మనల్ను మనం సరిగ్గా వేలం వేసుకోలేని చరణాలం!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు