Wednesday, January 22, 2025
HomeTrending Newsభార్య కోసమే సిఎం పదవి చేపడుతున్న హేమంత్ సోరెన్ !

భార్య కోసమే సిఎం పదవి చేపడుతున్న హేమంత్ సోరెన్ !

ఝార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా హేమంత్‌ సొరేన్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్‌ సోరెన్‌కు గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందింది. సోరెన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి జేఎంఎం ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి (7న) హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని జార్ఖండ్‌ ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య వెల్లడించారు.

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన హేమంత్‌ సొరేన్‌ జూన్‌ 28న బెయిల్‌పై బయటకు వచ్చారు. బుధవారం జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్‌ సొరేన్‌… గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు. ఇందుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సొరేన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

మనీలాండరింగ్ వ్యవహారంలో అరెస్టు ఖాయం కావడంతో జనవరి 31న హేమంత్‌ సొరేన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2న జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్‌ నేత చంపయీ సొరేన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. హేమంత్‌ మరోసారి ముఖ్యమంత్రి కాబోతుండటంతో బుధవారం చంపయీ సొరేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్టు చంపై సోరెన్ ప్రకటించారు.

హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఆరు నెలలోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. సోరెన్ రాజీనామా చేసిన గాండే శాసనసభ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ దఫా సోరెన్ మళ్ళీ జైలుకు వెళ్ళాల్సి వస్తే కల్పనా సోరెన్ సిఎంగా బాధ్యతలు చేపడతారని రాంచీ మీడియా వర్గాల కథనం. కల్పనా సోరెన్ కోసమే హేమంత్ సోరెన్ ప్రస్తుతం సిఎం పదవి స్వీకరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళాక కల్పనా సోరెన్ JMM తరపున ఇండియా కూటమి సమావేశాల్లో విరివిగా పాల్గొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రమంతా కలియ తిరిగి పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ వాణి వినిపించారు. రాజకీయంగా తడబాటు లేకుండా బహిరంగసభల్లో ప్రసంగించటం ఆమెకు కలిసివచ్చింది.

మరోవైపు హేమంత్‌ సొరేన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు త్వరలోనే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే సుప్రీంకోర్టు తీర్పుపై జార్ఖండ్‌ రాజకీయాలు ఆధారపడే అవకాశం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్