Sunday, November 24, 2024
HomeTrending Newsకర్ణాటకలో ఓ వైపు ఉచితాలు... మరోవైపు ప్రజలపై భారం

కర్ణాటకలో ఓ వైపు ఉచితాలు… మరోవైపు ప్రజలపై భారం

కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాలు ప్రకటించిన కాంగ్రెస్… ఇప్పుడు వాటి అమలు కోసం సామాన్య ప్రజలపై భారం మోపేందుకు సిద్దమైంది. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలపై పన్నుల మోత మోగించేందుకు సిద్దం అవుతోంది.

ఇప్పటికే గైడెన్స్‌ వ్యాల్యూ ట్యాక్స్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్‌, ఈవీలపై లైఫ్‌ టైమ్‌ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3, లీటర్‌ డీజిల్‌ ధర రూ.3.02 మేర పెరిగింది. పాల ధరలను కూడా లీటర్‌, అర లీటర్‌ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) పెంచింది.

ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బస్సు చార్జీలను 15 నుంచి 20 రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ‘రెండు రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో బస్సు చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు పంపాం. నిర్ణయం సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

కేఎస్‌ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని… 2019 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు లేదన్నారు. కేఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ కూడా 2020 నుంచి జరుగలేదని.. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంచడం అవసరమని చెప్పుకొచ్చారు. గత మూడు నెలల కాలంలో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.

ఎన్నికల సమయంలో పేరు గొప్ప హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పావులు కడుపుతున్నాయని పౌర హక్కుల వేదికలు ఆరోపిస్తున్నాయి. ఉచితాలు ఇస్తున్న ప్రభుత్వం ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేయక పోవటంతో నష్టాల పాలవుతున్నాయని మేధావులు విమర్శిస్తున్నారు.

కర్ణాటక వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్