చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు వచ్చిందని ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. 71 ఏళ్ళ చైనా అధ్యక్షుడికి గుండెపోటు వచ్చిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించ లేదు. స్ట్రోక్ వచ్చినట్టు జెన్నిఫర్ అనే రిపోర్టర్ వెల్లడించారు. 2021లో కూడా జిన్‌పింగ్ సెరిబ్రల్ ఎన్యూరిజంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే ప్రకటించారు. దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ వెల్లడించారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. కొవిడ్ నేపథ్యంలో అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఓ సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందు కరోనా పరీక్ష చేయడంతో పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు జీన్ పియర్ మీడియాకు వివరించారు. పాక్స్‌లోవిడ్ యాంటీ వైరస్ డ్రగ్ తీసుకుంటున్న బైడెన్… ఇప్పటికే ఎన్నికల బరిలో ప్రత్యర్థి ట్రంప్ కంటే వెనుకబడిపోయారు. ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో ప్రజలకు మరింత దూరం కానున్నారని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ వెల్లడించింది. ఈ మేరకు నిఘా సమాచారం అమెరికాకు కొన్ని వారాల క్రితమే వచ్చిందని పేర్కొన్నది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ట్రంప్‌నకు ముప్పున్నదని సీక్రెట్ సర్వీస్ వెల్లడించిందని ఓ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. దీనిపై స్పందించేందుకు వైట్‌హౌస్ నిరాకరించింది.
గత వారం ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్వదేశీ, విదేశీ సహచరులు లేరని పేర్కొన్నది. ట్రంప్ హత్యకు కుట్ర పన్నినట్టు వస్తున్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ట్రంప్‌పై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ ప్రతినిధి నస్సీర్ కనాని తెలిపారు. జనరల్ సులేమాని హత్యలో పాత్రకు సంబంధించి ట్రంప్ పై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని తేల్చి చెప్పారు.
ప్రపంచ రాజకీయాలను శాసించే రెండు దేశాల అధ్యక్షులు అనారోగ్యం బారిన పడటం… అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ పై హత్యాయత్నం, ఇరాన్ కుట్ర వార్తలపై అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
-దేశవేని భాస్కర్