Sunday, November 24, 2024
HomeTrending Newsపశ్చిమ భారతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్

పశ్చిమ భారతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్

రాజస్థాన్‌ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో ‘భిల్‌ ప్రదేశ్‌’ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాజస్థాన్‌లోని పాత 33 జిల్లాల్లో 12 జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలని కోరుతూ ఆదివాసి పరివార్‌ సహా 35 సంస్థల ఆధ్వర్యంలో పది రోజుల క్రితం భారీ ర్యాలీ నిర్వహించారు.

గిరిజన మహిళలు, బాలికలు విద్యపై దృష్టి సారించండని ఆదివాసీ పరివార్‌ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు మనేక దమోర్‌ గిరిజన మహిళలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని భారత్‌ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్‌కుమార్‌ రోట్‌ తెలిపారు. ఆదివాసి హక్కుల కోసం 2023 సెప్టెంబరు 10న ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్ ఈ పార్టీని స్థాపించాడు. భారత్ ఆదివాసీ పార్టీ 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో మూడు స్థానాలు, 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక స్థానాన్ని గెలుచుకుంది. భారతీయ ట్రైబల్ పార్టీ తరపున గుజరాత్ లో కూడా ఆప్ నుంచి భిల్ నేతలు ఎమ్మెల్యేగా గెలిచారు.

భిల్లుల ఆదాయ వనరు వ్యవసాయం, పశుపోషణ, పౌల్ట్రీ. కార్మికులు కూడా ఈ సమాజానికి ఆదాయ వనరు. భిల్లులకు చేనేత ఉత్పత్తుల తయారీపై అవగాహన ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక,దుర్గ దేవి విగ్రహాల తయారీ, మట్టి, చెక్క బొమ్మలు చేసే వారు భిల్ వర్గం వారే కావటం గమనార్హం.  చాలా సంవత్సరాల క్రితం, భిల్ రాజులు (రాజులు) మైదాన ప్రాంతాల నుండి వలస వచ్చిన వారిని కొండ ప్రాంతాలలోకి అనుమతించటంతో కాలక్రమంలో వీరి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. భిల్ బాష మాట్లాడే వీరు దేశంలోనే పెద్ద ఆదివాసి తెగగా గుర్తింపు పొందారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1.7 కోట్ల జనాభా ఉంది.

భిల్లులు మధ్యప్రదేశ్‌లోని ధార్, ఝబువా, ఖర్గోన్, రత్లాం జిల్లాలలో మెజారిటీగా ఉన్నారు. భిలాయ్ (భిల్= తెగ, ఆయి= వచ్చింది, అంటే భిల్లులు వచ్చారు), ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒక నగరానికి దీని పేరు పెట్టారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణ సమయంలో భిల్లులు లక్షల సంఖ్యలో నిర్వాసితులు కాగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వారి పునరావాస చర్యలకు పూనుకోలేదు. భిల్లుల న్యాయ పరమైన హక్కుల కోసం మొదలైనదే నర్మదా బచావో ఆందోళన్.

భిల్ ప్రజల ఆరాధ్య దైవం కాలదేవ్, “నల్ల దేవుడు”. భిల్లులు నేడు అనేక సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరి ప్రాంతాల్లో అభివృద్ధి జాడలేదు. విద్యా సౌకర్యాలు అంతంతమాత్రమే. ఈ సమాజంలో పేదరికం అధికం. దుంగార్పుర్, ఉదయపూర్, భనస్వాడ ప్రాంతంలో ఉన్నవారిని రాజస్థాన్, గుజరాత్, ఎంపి రాష్ట్రాల్లోకి స్వాతంత్రం తర్వాత చేర్చారు. భిల్లు వర్గంలో సరైన నాయకత్వం లేకపోవటంతో ఎవరు అడ్డుకోలేకపోయారు.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోని 49 జిల్లాలను కలిపి ప్రత్యేక భిల్‌ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలని గిరిజనులు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. 2017 నుంచి ఈ డిమాండ్ తీవ్రం అయింది. గిరిజన ప్రాంతంలో ఐదో షెడ్యూల్‌ అమలు చేయాలని భిల్ నేతలు కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంతోనే భిల్ ప్రజలు అభివృద్ధి పథంలో సాగుతారని ఆదివాసి పరివార్ నేతలు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్