బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోదా పొందటానికి కావాల్సిన కనీస ఐదు అర్హతలు ఆ రాష్ట్రానికి లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దీనిపై ఇంటర్ మినీస్టీరియల్ గ్రూప్ (IMG) కూడా నివేదిక ఇచ్చిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. బీహార్ కి ప్రత్యేక హోదా గురించి లోక్ సభలో ఆ రాష్ట్రానికి చెందిన జేడీయూ ఎంపి రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. 2012లో అంతర్గత మంత్రిత్వశాఖ బృందం నివేదిక మేరకు ప్రత్యేక హోదాకు బిహార్ అర్హత పొందలేదన్నారు.
*పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
*తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
*పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం.
*ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం…
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారుని.. బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్రమంత్రి సమాధానంతో ఆంధ్ర ప్రదేశ్ కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లే.