Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆర్థికశాస్త్ర "తిలకాష్ఠ మహిష బంధనం"!

ఆర్థికశాస్త్ర “తిలకాష్ఠ మహిష బంధనం”!

గుగ్గిళ్లు నిజానికి ఆరోగ్యానికి మంచివి. గుర్రాలకు ఉలవ గుగ్గిళ్లు బలం. ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు. పేరంటాల్లో తాంబూలంలో సెనగ గుగ్గిళ్లు పెట్టడం సంప్రదాయం. ఈ గుగ్గిళ్లు మనుషులకు బలం. పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలతో వేయించిన సెనగ గుగ్గిళ్లు స్నాక్ ఐటెంగా ఇదివరకు తినేవారు. ఇప్పుడు తింటున్నారో లేదో తెలియదు. భాషలో జీర్ణం కానివి ఇనుప గుగ్గిళ్లు. కొంచెం ప్రయత్నిస్తే ఇనుప గుగ్గిళ్లయినా అరుగుతాయేమో కానీ, ఆర్థిక పరిభాషలో ఇనుప గుగ్గిళ్లు మాత్రం ఎప్పటికీ, ఎవరికీ అరగవు. అర్థం కావు. ఆ సంక్లిష్టతే దాని బలం. అదే దాని బలహీనత. రెండువేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పినది “అర్థశాస్త్రం”. అయితే అది ఫైనాన్స్ కు సంబంధించిన అర్థశాస్త్రం అనుకుని…భయపడి దేశం రెండు వేల ఏళ్లుగా ఆ శాస్త్రం వైపు కన్నెత్తి చూడలేదు. మన బతుకు అర్థవంతంగా ఉండడం అనే అర్థంలోనే అది “అర్థ శాస్త్రం” తప్ప డబ్బుకు సంబంధించింది కాదు.

అర అంటే సొరుగు, డ్రా. అర అంటే సగం, హాఫ్. అర్ధ అన్నా హాఫ్. అర్థం అంటే మీనింగ్. అర్థ మాటకు వ్యాకరణం ప్రకారం ఆది వృద్ధి వస్తే ఆర్థిక అవుతుంది. అర్థ అంటే అర్థించేది, కోరేది అని అమరకోశం వ్యుత్పత్తి అర్థం చెప్పింది. అంటే అర్థం అనే మాట పుట్టుకలోనే అక్షరాలా అడుక్కోవడం ఉంది. విత్తం, ధనం, ద్రవ్యం, డబ్బు, లెక్క, రూపాయలు, సొమ్ము ఇలా ఇంకా లెక్కకు లెక్కలేనన్ని పేర్లున్నాయి. అర్థం ఒకటే అయినా వాటి వ్యుత్పత్తి వేరు. ఆర్థిక శాస్త్రం అందరికీ అర్థం కాదు. కానీ అందరూ తమదయిన ఆర్థిక పరిభాషలోనే మాట్లాడుతుంటారు. సామాన్యుల ఆర్థిక భాషకు- ఆర్థిక శాస్త్ర నిపుణుల భాషకు చాలా తేడా ఉంటుంది.

రోజులు బాగలేవు. పూట గడవడం లేదు. జీతాలు సరిపోవడం లేదు. తలకు మించిన అప్పులు. వడ్డీ భారం. అప్పు పుట్టడం లేదు. గిట్టు బాటు . జరుగుబాటు. చేబదులు. బంగారం కుదువ. భూమి తాకట్టు. పరపతి. పూచీకత్తు. ఆదాయం, వ్యయం, మిగులు , లోటు…ఇదంతా సామాన్యుల ఆర్థిక భాష.

ఆర్థికవేత్తల, ఆర్థిక శాస్త్ర భాష, పరిభాషలో ఇవే విషయాలు అర్థమయినా అర్థంకాని ఇనుప గుగ్గిళ్లుగా ఎలా ఉంటాయో చూద్దాం. రిజర్వు బ్యాంకు ఈరోజు అత్యవసరంగా సమావేశమై రివర్స్ రెపో రేటును రేపటినుండి 0.32 శాతం తగ్గించాలని బరువెక్కిన గుండెతో నిర్ణయించి…ప్రెస్ మీట్ లో నిట్టూర్పుతో ప్రకటించింది. దీనితో స్థూల జాతీయ ఉత్పత్తిలో పరపతి పరస్పరం సంఘర్షించుకునే ప్రమాదం తప్పిందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి, న్యూయార్క్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సీ ఈ ఓ గా ఉన్న మన కొండకింద దిగువపల్లె పిల్లోడు లోతుగా విశ్లేషించాడు. జాతీయ తలసరి ఆదాయాలు పాతాళం లోతులు చూస్తున్నా…జాతీయ సగటు వ్యయ నిష్పత్తి సూచీ హిమాలయం పైకి ఎగబాకడంతో ప్రపంచ బ్యాంకుకు తల తిరిగింది. జి డి పి ని దేశంలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 70 కోట్ల మంది డి పి లుగా పెట్టుకోవడం అద్భుతం. అసాధారణం. స్ఫూర్తిదాయకం.

విదేశీ సంస్థాగత మదుపుదారులు- స్వదేశీ వ్యక్తిగత మదుపుదారులు కుమ్మక్కు కావడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు హారతి కర్పూరమై, నిల్వలు కాగితాల్లో అంకెలుగా మాత్రమే కనపడుతున్నాయి. అయితే ప్రతి పదేళ్లకొకసారి ఈ కరెక్షన్ సహజమని, దీనివల్ల బ్యాంకులు మునిగిపోయి, సామాన్యులు మట్టికొట్టుకుపోతారు కానీ- పెద్ద పెట్టుబడిదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదని గతానుభవాల దృష్టిలో పెట్టుకుని నిపుణులు చెబుతున్నారు.

ఆదాయ పన్ను పరిమితిలో రెండో ఇంటి అద్దెను మినహాయించడం వల్ల- రెండో భార్యను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు కొందరు ఐ టీ అధికారులను అభినందించడంతో కేంద్ర ప్రభుత్వం తల గోక్కుని…కొత్త గణాంకాల సేకరణలో పడింది.

పది వేల కోట్ల రూపాయల పైబడి రుణం తీసుకుని ఎగ్గొట్టినవారు దేశం వదిలి వెళ్లడం వల్ల, దేశంలో ఉన్నా చెప్పకూడని, చెప్పుకోలేని కారణాలవల్ల వారిని అడిగే పరిస్థితి లేకపోవడం వల్ల అలా పోగుపడ్డ ముష్టి పది లక్షల కోట్ల ఎగవేత రుణాలను ఆదాయపుపన్ను కట్టే భారతీయులకు సమానంగా పంచడమయినది.

కరువు కాటకాల నేపథ్యంలో గృహ రుణాల మీద ప్రభుత్వం 0.00001 శాతం వడ్డీని ఉదారంగా ఆరు నెలలపాటు తగ్గించింది. దీనితో లక్ష అప్పు తీసుకున్నవారు రెండు లక్షల యాభై వేలు ఎలాగూ కట్టాల్సిందే. కాకపొతే ప్రతి నెల కట్టే ఈ ఎం ఐ పదకొండు వందల రూపాయలకు బదులు ఇక మీదట వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు కడితే సరిపోతుంది. ఈ మినహాయింపుల మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రకటనల మీద ఖర్చు చేయాలని నిర్ణయించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెట్టెలు పెద్దవి కావడం వల్ల- స్వదేశీ పెట్టెల్లో పట్టకపోవడంతో ఆర్ బి ఐ పెట్టెలు రిపేర్ చేసేవారిని వేల సంఖ్యలో తాత్కాలికంగా నియమించుకోనుంది.

ద్రవ్య వినిమయం ఒక్క ద్రవ రంగం మీదే కేంద్రీకృతం కావడంతో కేంద్రం కూడా దీని మీదే దృష్టి కేంద్రీకరించినట్లు ధ్రువీకరించని వార్త.

లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం మంజూరు అయ్యింది. కానీ అదే లబ్ధిదారులకు అదే బ్యాంకులో గతంలో రుణానుబంధం ఉండడం వల్ల- కొత్తగా మంజూరయిన వడ్డీలేని రుణం మొత్తం పాత రుణం వడ్డీకి కూడా చాలలేదని బ్యాంకులు నిట్టూర్చాయి. దాంతో బ్యాంకులు ధర్మంగా పశు పత్నీ సుతులను కూడా హెచ్చరించి రుణానుబంధ రూపేణా పశు పత్నీ సుత…అని వదిలేశాయి.

ప్రయివేటు బ్యాంకులు అత్యవసరంగా సమావేశమై అనుత్పాదక రంగాలకు అత్యధిక ప్రాధాన్యంతో వేల, లక్షల కోట్ల రుణాలు వేగంగా ఇవ్వాలని నిర్ణయించాయి.

తలసరి, దళసరి, సరి సరి ఆదాయాలను కొసరి కొసరి అంచనావేయడానికి, ఎలాంటి ఆర్థిక ఆధారం లేనివారందరికీ ఆధారం కల్పించడానికి రంగు రంగుల ఆధార్ కార్డులను ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తాజా నిర్ణయం.

సామాన్యులకు అర్థం కానిది ప్రభుత్వ ఆర్థిక శాస్త్రం!
అది అర్థమయినట్లు అనిపిస్తూ అర్థంకాని పారమార్థిక శాస్త్రం!
ఆర్థిక పరిభాషలో చిక్కుకుని అర్థాలు మార్చుకున్నది ఈ ఆర్థిక శాస్త్రం!

(పాత కథనమే. బడ్జెట్ ఎప్పుడూ కొత్త సీసాలో పాత సారా కథే. కాకపోతే ఎక్కడా వాతలు కనపడకుండా దెబ్బలు కొట్టడమే ఇందులో శాస్త్ర వైదుష్యం!

ఇంకా లోతుగా విశ్లేషణ అవసరమనుకునేవారు తెనాలి రామలింగడి “తిలకాష్ఠ మహిష బంధనము”ను సంప్రతించగలరు!)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్