రాజకీయాల్లో ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న విజయమ్మ ఇంటికి వెళ్లిన జేసీ ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
2014-19 మధ్య కాలంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ సంస్థపై విమర్శలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభాకర్ రెడ్డి అనంతపురం సాక్షి కార్యాలయం ఎదుట దీక్ష చేసి జగన్ పై విమర్శలు చేశారు. అప్పట్లో ఆయన వాడిన పదజాలం అభ్యంతరకరంగా కూడా ఉంది.
గత జగన్ ప్రభుత్వంలో జేసీ కుటుంబానికి చెందిన ట్రావెల్స్ పై సీఐడి, రవాణాశాఖ అధికారులు దాడులు చేసి అక్రమాలు ఉన్నట్లు గుర్తించి జేసితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి పలుమార్లు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావడం, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో…. గత ప్రభుత్వంలో తనపై పెట్టిన కేసులు అక్రమమని, దానికి కారణమైన సజ్జల, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
అన్నా చెల్లెళ్ళు జగన్-షర్మిల రాజకీయ, కుటుంబ వైరంలో వైఎస్ విజయమ్మ కూతురుకే అండగా నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.