Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచిన్నారి చేతుల్లో సురాపాన తయారీ

చిన్నారి చేతుల్లో సురాపాన తయారీ

“ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్!
సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్!”
అని తటవర్తి రాజగోపబాలం రాసిన గజల్ లో ఎత్తుగడ. పెద్దయ్యాక కరిగిపోయిన అందమైన ఆ బాల్యమే మళ్లీ కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ మన కళ్లముందే ఆ బాల్యం బూడిద అవుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉంటాం.

చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదని తెలుసు. అయినా అనేక పని ప్రదేశాల్లో చూస్తూనే ఉంటాం. అమ్మగార్ల వెనకాలే పసిపిల్లలను మోస్తూనో, బ్యాగులు పట్టుకునో కనిపిస్తూనే ఉంటారు. మెకానిక్ షాపుల్లో, రోడ్ సైడ్ షాప్స్, హోటల్స్ లో ఎక్కువశాతం బాల కార్మికులే. అదేమని ఒక్కరూ నోరు తెరచి అడగలేరు. ఇక్కడ ప్రజాస్వామ్యం కాగితాల్లోనే ఘనం. పిల్లల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఏవీ చుట్టాలకు వర్తించవు. కొంతమంది విజిల్ బ్లోయర్స్, నిజాయతీ పరులైన అధికారుల కారణంగా అప్పుడప్పుడు కొంతమందిని రక్షిస్తారు.

ఐక్య రాజ్యసమితికి చేసిన వాగ్దానం ప్రకారం భారతదేశం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థని అంతం చేయాలి. అధికారిక లెక్కల ప్రకారం వారి సంఖ్య 2023 నాటికి 78 లక్షలు. లెక్కకు రాని వారెంతమందో ! ఆధార్ కార్డులు , ఓటు హక్కు లేని ఎందరో ఉన్నారు. ముఖ్యంగా బాల కార్మికుల విషయంలో చట్టం అసహాయత తరచు దర్శనమిస్తుంది. అసలు చట్టంలోనే ఎన్నో సందిగ్ధతలు… బాలకార్మికుల చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు వారు బాల కార్మికులు. వారిని పనిలో పెట్టుకున్నవారు నేరస్థులు. కానీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు వారు కూడా బాల కార్మికులే. పైగా ఇదేమంత నేరం కాదు. ఈ ఒక్క పాయింట్ చాలదూ పిల్లలని వెట్టి చాకిరిలోకి దించడానికి.

మానవత్వం ఎంతగా మృగ్యమై పోతోందంటే ఆఖరికి మద్యం తయారీలోనూ పసివారిని బలిపశువులుగా వాడుతున్నారు. దారుణమైన ఈ సంఘటనకు వేదిక మధ్యప్రదేశ్. అక్కడి సోమ్ డిస్టిలరీలో పిల్లలే మద్యం తయారీ, సీసాల్లో నింపడం చేస్తారు. ఫలితంగా వారి చేతులు బొబ్బలెక్కి ఉన్నాయని చైల్డ్ రెస్క్యూ టీం ద్వారా వెల్లడైంది.

అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ లో రైసెన్ దగ్గర సెహత్ గంజ్ అనే గ్రామం. అక్కడే ఉంది సోమ్ డిస్టిలరీ యూనిట్. సుమారు వందమంది పిల్లలు, 12 నుంచి 17 ఏళ్ళ వయసున్న వారు పనిచేస్తున్నారు. వీరికి యూనిఫారం వేసి స్కూల్ బస్సుల్లో కంపెనీకి తీసుకువస్తారు. కంపెనీ ఆవరణలో ఉన్న స్కూల్ విద్యార్థులని చెప్తారు. రోజుకు 12 గంటలపాటు ఆ పసివాళ్లు మద్యం తయారీ, సీసాల్లో నింపడం, ప్యాక్ చేయడం వంటి పనులు చేసి మూడు వందలనుంచి అయిదువందలు సంపాదిస్తారు. కొందరు ఇంట్లో పరిస్థితుల కారణంగా, మరికొందరు ఇంట్లో చెప్పకుండా పనిచేస్తారు. కొందరు అమ్మాయిలు పెద్దగా కనిపించడానికి మేకప్ వేసుకుని వస్తారు. పిల్లల చేత మద్యం తయారు చేయిస్తున్నారని చాలామంది గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారు గ్రామంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పారు కూడా. మార్చ్ నెలలో ఈ కమిటీ పరిశీలనకు వెళ్తే ఇద్దరు బాల కార్మికులు కనిపించారు. కానీ కంపెనీ అదంతా అబద్ధమని, వారు పెద్దవారికి భోజనం తెచ్చారని బుకాయించింది. పైగా తాము కంపెనీ ఆవరణలో స్కూలు నడుపుతున్నామనీ గొప్పలు చెప్పింది. కానీ అప్పటికే ఈ కంపెనీపై అనుమానంతో కైలాష్ సత్యార్థికి చెందిన బాల్ బచావో అందోళన్ (బీబీ ఏ)సంస్థ ఒక బృందం ద్వారా విచారణ జరిపి బాలకార్మికులు ఉన్నారని నిర్ధారించుకుంది. వారు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారికి ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి వచ్చిన బృందం, బీబీఏ వారు కలసి జూన్ 15 న రైడ్ చేసి 39 మంది అబ్బాయిలని, 20 మంది అమ్మాయిలని రక్షించారు. మరికొంతమంది పారిపోయారు. ఆ ప్రాంతంలో దారుణమైన వాసనకి పది నిముషాలు కూడా ఉండలేరని, అలాంటి చోట పది పన్నెండు గంటలు పిల్లలు పనిచేయడం దారుణమని బాల్ బచావో అందోళన్ డైరెక్టర్ మనీష్ శర్మ పేర్కొన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. నిరంతరం రసాయనాలు తగలడం వల్ల ఆ పిల్లల చేతులు కాలి, బొబ్బలెక్కాయి. అరచేతుల చర్మం పొరలు పొరలుగా ఊడిపోతోంది. స్థానిక కలెక్టర్, ఎక్సయిజ్ అధికారులు బాధ్యులంటూ వారిని సస్పెండ్ చేశారు. కంపెనీ కూడా కొన్నాళ్ళు మూతపడి మళ్ళీ ప్రారంభమయ్యింది.

మరి ఆ పిల్లలు ? వారికి పరిహారం ఇవ్వాలి. వారి ఇంట్లో పెద్దవారికి ఉపాధి కల్పించాలి. వెట్టిచాకిరి చట్టం కింద మూడు లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లేని కారణంగా చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. నిజమే, ఇళ్లలో పరిస్థితులే బాలలను పని చేసేలా చేస్తాయి. కానీ అది సరయిన పని కానప్పుడు వారు ఏ మార్గంలో వెళ్తారో ఊహించడం కష్టం. ఇక్కడ ప్రభుత్వం స్పందించి వారికి సహాయం చెయ్యాలి. తగిన సౌకర్యాలు కల్పించాలి. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మానసిక నిపుణుల సాయం అందించాలి. బాలల ప్రాథమిక హక్కులను కాపాడాలి. కేవలం స్వచ్చంద సంస్థలే కాదు…రేపటి తరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని గుర్తించాలి.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్