“అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే” అన్నారో సినీ కవి. నిజమే. ఎక్కడో లోతుల్లో ముత్యపు చిప్పలో దాగున్న ముత్యాన్ని వెలికితీసి అందరికీ అందుబాటులోకి తేవడంలో ఎందరి శ్రమో దాగి ఉంటుంది. కానీ ఆ ముత్యాలు అందమైన కంఠాలను అలంకరించినపుడే కదా! వాటి విలువ తెలిసేది. అలాగే ఇంటినిండా పుస్తకాలుంటే ఏం లాభం? వాటిని పదిమందికీ ఉపయోగపడేలా వినియోగిస్తేనే కదా పరమార్థం.
పుస్తకాలంటే గుర్తొచ్చింది. కొందరు పుస్తకాలు ఇతరులకు అస్సలు ఇవ్వరు. ఇవ్వాలంటే ప్రాణం పోయినట్టుగా బాధపడతారు. ఖర్మ కాలి ఇచ్చినా అవతలివారు తిరిగి ఇవ్వకపోతే యుద్ధానికి సిద్ధపడతారు. పుస్తకం జ్ఞానాన్నివ్వాలి . ఆ జ్ఞానం పదిమందికీ చేరాలి. అంతే గానీ దుమ్ము పేరుకుపోయి చివరకు చెదలపాలవకూడదు. చదువుకున్న వారికి ఇది అర్థమవుతుందో లేదో గానీ కొందరు చెత్త ఏరుకునే వాళ్లకు బాగా అర్థమైంది. వారి వితరణ నేడు ఎందరికో విజ్ఞాన కాంతులు పంచుతోంది.
టర్కీ దేశంలో అంకారా అనే ప్రదేశం. అక్కడ పారిశుధ్య కార్మికులు చెత్తలో చాలామంది పుస్తకాలు పారేయడం గమనించారు. వాటిలో బాగున్నవి తీసి పక్కన పెట్టడం ప్రారంభించారు. కొన్నాళ్ళకు వాటిని తెలిసినవాళ్లకు, అడిగిన వాళ్ళకి ఇవ్వడం మొదలెట్టారు. దాంతో చాలామంది వారివద్ద ఉన్న పుస్తకాలు
ఆ కార్మికులకు ఇవ్వడం ప్రారంభించారు. అలా కొన్నాళ్ళకు పుస్తకాలు ఎక్కువ కావడంతో లైబ్రరీ మొదలు పెట్టారు. స్థానిక మేయర్ సహకారంతో ఖాళీగా ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ లో లైబ్రరీ ప్రారంభించారు. ప్రస్తుతం ఆరువేలకు పైగా పుస్తకాలున్నాయక్కడ. సాహిత్యం నుంచి సైన్స్, టెక్నాలజీ రంగాల పుస్తకాలూ ఉన్నాయి. పిల్లలకు ప్రత్యేక సెక్షన్ ఉంది.
రెండుభాషల్లో చదివేవారికోసం ఫ్రెంచ్, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి.
ఒకపక్క పుస్తకాలు పారేసేవారు ఉన్నట్టే కావాలనేవారూ ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల నుంచి పుస్తకాలకోసం అభ్యర్ధన రావడంతో ప్రస్తుతం కొన్ని పుస్తకాలు విద్యాసంస్థలకు పంపిస్తుం. ప్రభుత్వం లైబ్రరీ నిర్వహణ కోసం ఉద్యోగిని నియమించింది. అక్కడే కొద్దిగా స్థలంలో చదరంగం ఆడుకునే ఏర్పాటూ ఉంది. ఎక్కువగా లైబ్రరీకి చుట్టుపక్కల పిల్లలు, విద్యార్థులు వస్తారు. అటుగా వెళ్లే సైక్లిస్టులు ఆగి కాసేపు పుస్తకం చదివి టీ తాగి రిలాక్స్ కావచ్చు. అలా ఇప్పుడీ లైబ్రరీ అంకారాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఒక మొబైల్ లైబ్రరీ కూడా నిర్వహిస్తున్నారు. ఆనందంగా చదువుకోడానికి, అక్షరజ్ఞానం పెంచడానికి ఈ లైబ్రరీ కేంద్రమైంది. మరి ఇంత గొప్ప పనికి నాంది పలికిన పారిశుధ్య కార్మికులేమంటున్నారు? ‘గతంలో మా ఇంట్లో లైబ్రరీ ఉంటే బాగుంటుందని అనిపించేది. అలాంటిది మా ఊరికే ఒక లైబ్రరీ రావడం చాలా సంతోషం’ అన్నాడో కార్మికుడు. ఈ జ్ఞానం అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో!
-కె.శోభ