Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీకృష్ణ కర్ణామృతం-2

శ్రీకృష్ణ కర్ణామృతం-2

సంస్కృత కృష్ణ భక్తి సాహిత్యంలో జయదేవుడి గీతగోవిందం, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం రెండూ రెండు కళ్లలాంటివి. దేని అందం దానిదే. దేని లోతు, విస్తృతి దానిదే. గీతగోవిందం పాడుకోవడానికి, అభినయించడానికి అనువైన సంగీత నృత్యరూపక సాహిత్యం. అర్థం కాకపోయినా ఆ శబ్దంలోనే ఏదో గమ్మత్తు ఉంటుంది. ఆ మాటలు వినగానే రాధాకృష్ణులు యమునాతటిలో నాట్యం చేస్తున్న దృశ్యం ఆవిష్కారం కావాల్సిందే. నాట్యం చేసే మాటలు నాట్యం చేసే రాధాకృష్ణులదగ్గరికి తీసుకెళ్లేలా జయదేవుడు రచనా చమత్కారం చేశాడు. జయదేవుడు 12వ శతాబ్దంవాడు. లీలాశుకుడు 14 వ శతాబ్దంవాడు. (జయదేవుడి కంటే లీలాశుకుడు ముందువాడు అని కొందరంటారు కానీ…దానికి సరైన ఆధారాలు దొరకలేదు. ఆ చర్చ ఇక్కడ అనవసరం).

జయదేవుడి ప్రభావం లీలాశుకుడిమీద పడ్డట్టు ఉంది. వినగానే చెవులకు అమృతమై, అది మనసుకు చేరేలా, చవులూరేలా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండాలనే, ఉందనే నమ్మకంతోనే లీలాశుకుడు తన కృష్ణ భక్తి కావ్యానికి ‘కర్ణామృతం’ అని పేరు పెట్టాడు.

సాధారణంగా అమృతం తాగాలి. ఈ అమృతం వింటే చాలు. అమృతం తాగిన ఫలితాన్నే ఇస్తుంది. “వినరో భాగ్యము విష్ణుకథ” అన్న అన్నమయ్య మాటలో కూడా ఈకోణంలోనే చాలా లోతైన అర్థమే ఉంది. ఈ కర్ణామృతాన్ని చదివేవారు చదువుకోవచ్చు. పాడేవారు పాడుకోవచ్చు. ఆడేవారు ఆడుకోవచ్చు. పారాయణ చేసేవారు చేసుకోవచ్చు. మంత్రంగా జపించేవారు జపించవచ్చు. కదిలే దృశ్యంగా, కదలని చిత్రంగా ఊహించి…భావనా ప్రపంచంలో విహరించవచ్చు.

కృష్ణ కర్ణామృతం వింటూ…కృష్ణుడి వెంట నడవవచ్చు. కృష్ణుడిచేయి పట్టుకుని నడిపించవచ్చు. కృష్ణుడితోపాటు యమునాతీరానికి ఆవులను తోలుకుని వెళ్లవచ్చు. కృష్ణుడితోపాటు చేయిచాచి యశోద చేతవెన్నముద్దలు తినవచ్చు. కృష్ణుడితోపాటు మనం కూడా రేపల్లెలో వెన్నకుండలు దోచుకోవడానికి బయలుదేరవచ్చు. పట్టుబడితే దబాయించి…తప్పించడానికి అంతటి కృష్ణుడు కర్ణామృతం సాక్షిగా మనపక్కనే ఉంటాడు.

ఇంతలా కృష్ణుడిని మనకు పట్టి ఇచ్చిన లీలాశుకుడి గురించి; అంతే అందంగా ఆ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించిన వెలగపూడి వెంగనామాత్యుడి గురించి చారిత్రక ఆధారాలు ఏవీ స్పష్టంగా లేవు.

పద్నాలుగో శతాబ్దికి చెందిన లీలాశుకుడు కేరళవాడని దక్షిణాదిలో కొందరు పండితులు అనుకున్నారు. బెంగాల్ వాడని బెంగాలీలు అనుకున్నారు. ఒరిస్సాలో పుట్టాడని ఇంకొందరన్నారు. ఆంధ్రదేశంలో శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టి కాశీలో చదువుకున్నాడని, చైతన్యమహాప్రభు ఈవిషయాన్ని లోకానికి ఆవిష్కరించారని మరికొందరంటారు. ఏ శతాబ్దంలో పుట్టాడో, ఎక్కడ పుట్టాడో అన్న విషయంమీద పండితులమధ్య ఎడతెగని చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి.

దీనికి మించి “లీలాశుకుడు” అన్నది అసలు పేరు కాకపోవచ్చని, సన్యాసిలా మారినతరువాత లోకం పెట్టిన పేరు అని ఒక వాదన. ప్రఖ్యాత చింతామణి నాటకంలో బిల్వమంగళుడే మొదట వేశ్యాలోలుడై…తరువాత విరక్తితో భక్తిమార్గంలోకి వచ్చి లీలాశుకుడయ్యాడని ఒక వాదన. భార్యావ్యామోహంలో ఉన్న బిల్వమంగళుడిని భార్యే భక్తివైపు మళ్లించిందని మరొక వాదన. ఇందులో ఏది నిజమో! చెప్పడానికి ఎవరిదగ్గరా సరైన ఆధారాలు లేవు. కల్పితగాథలు మాత్రం అనేకం ప్రచారంలో ఉన్నాయి.

భోగలాలసలో మునిగితేలి…భక్తిదారి పట్టుకుని కృష్ణుడిని చూసిన తరువాత ఇక లోకాన్ని చూడకూడదని తన కళ్లను తానే పెరికేసుకుని…బతికినన్నాళ్ళు కృష్ణగానంలో ఎదలో కృష్ణుడిని చూసుకుంటూ లీలాశుకుడు గడుపుతుంటే ఆయన ముందు కృష్ణుడే శ్రోతగా కూర్చుని వినేవాడని ఒక కథ తరతరాలుగా ప్రాచుర్యంలో ఉంది.

ఎవరికి వారు లీలాశుకుడు మావాడే అని చెప్పుకోవడంలో మాత్రం గొప్ప ఆరాధన ఉంది. గర్వం ఉంది. తన్మయత్వం ఉంది. అది సంతోషించదగ్గ విషయం. కొన్ని సందర్భాల్లో వ్యాసుడిని, మరికొన్ని సందర్భాల్లో జయదేవుడిని మించి కృష్ణుడిని లీలాశుకుడు దర్శించి, మనక్కూడా ఆ దర్శనం చేయించాడు కాబట్టి లీలాశుకుడు భారతీయులందరి బంధువు. ప్రత్యేకించి కృష్ణభక్తిపరాయణులకు ఆత్మబంధువు.

బిల్వమంగళుడే లీలాశుకుడు అయ్యాడా? భోగి యోగి అయ్యాడా? ఏ ఊళ్లో పుట్టి ఏ ఊళ్లో పెరిగాడు? ఆయన మాతృభాష ఏమిటి? అన్న చర్చలకంటే శ్రీకర్ణామృతంలో ఆయన ఏమి చెప్పాడు? ఎలా చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అన్న చర్చలోకి వెళితే భాగవతంలో శుకమహర్షే ఈ లీలాశుకుడిగా పుట్టాడన్నంత పులకింతగా ఉంటుంది.

సంస్కృతంలో ఎంత పెద్ద సమాసాన్నయినా శబ్దసౌందర్యం చెడకుండా సాధించవచ్చు. తెలుగులో ఎక్కువ పదాలతో సమాసం కుదరదు. కుదిరినా చెవులకు ఇంపుగా ఉండదు. అలాంటిది తెలుగులో ఆ అందాన్ని సాధించాడు మన వెలగపూడి వెంగనామాత్యుడు. శ్రీకృష్ణ కర్ణామృతాన్ని తెలుగులోకి కనీసం పదిమంది అనువదించి ఉంటారు. కానీ వెంగనామాత్యుడి అనువాదం ముందు అవన్నీ సూర్యుడి ముందు దివిటీలే.

వెంగనామాత్యుడు దాదాపు 250 లేదా 300 ఏళ్ల కింద అమరావతి(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని వెలగపూడి) ప్రాంతవాసి అని పండితుల ఊహ. అమాత్యుడు అన్న చివరి మాటను బట్టి ఏదైనా రాజాస్థానంలో ఆయన కానీ…ఆయన వంశీయులు కానీ మంత్రులు అయి ఉండాలి. తెలుగు కవుల చరిత్రలో ఎక్కడా వెంగనామాత్యుడి వివరాలు లేవు. ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఇతర కావ్యాలేమైనా రాశాడేమో తెలియదు.

“అమృతం నోటిముందు ఉంటే…తాగకుండా దాని పుట్టుపూర్వోత్తరాల మీద చర్చ ఎందుకు? దండగ!”  అనుకుని లీలాశుకుడి శ్లోకంలోకి, వెంగనామాత్యుడి పద్యంలోకి వెళదాం. ఆ అమృతాన్ని జుర్రుకుందాం.

రేపు:-
“అంతా కృష్ణమయం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్