Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీకృష్ణ కర్ణామృతం-3

శ్రీకృష్ణ కర్ణామృతం-3

శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడి శబ్ద సౌందర్యం, శబ్ద లాలిత్యం, రచనా విన్యాసం, యతులు, ప్రాసలు, అల్లికలో చమత్కారం, కళ్ల ముందు కృష్ణుడు ఒక్కో శ్లోకపాదంలో ఒక్కోలా కనిపించేలా ప్రత్యక్ష ప్రసార అక్షరాకృతులు సాహిత్యవేత్తలకు అమృతం. లీలాశుకుడు పట్టుకున్న వివిధ రూపాల, వివిధ సందర్భాల కృష్ణుడు సామాన్యభక్తులకు అమృతం. ఆయన శ్లోకాల్లో కృష్ణ కథలు కొత్త పుంతలు తొక్కుతాయి. యుగాలు తడబడి విష్ణుడి అవతారాలు అటు ఇటు అవుతాయి. ఆయన సృష్టించిన పద చిత్రాలు, సన్నివేశాలు గొప్పవో! ఆయన వాడిన భాష గొప్పదో! తేల్చుకోలేక మనం ఉక్కిబిక్కిరి అయిపోతాం. మచ్చుకు ఆ వెన్న ముద్దలు కొన్ని-

వెన్న దొంగ

లీలాశుకుడి శ్లోకం:-
“క స్త్వం బాలబలానుజ కిమిహ తేమన్మందిరాశంకయా
యుక్తంతన్నవనీత పాత్రవివరేహ స్తంకినర్థంస్య సే:
మాతః కంచనవత్సకం మృగయితుంమాగానిషాదం క్షణా
దిత్యేవంవరవల్లవీ ప్రతివచః కృష్ణస్యపుష్ణాతుః”

వెలగపూడి వెంగనామాత్యుడి అనువాద పద్యం:-
“చిన్ని కుమార యెవ్వడవు సీరికి దమ్ముడనేల నిందురా
మన్ని లయ బటంచునిది మంచిదెకేలటు సాచెదేటికిన్
వెన్న పనంటిలోన జననీయొకదూడనుజూడ వచ్చితిన్
విన్నదంబుమానుమని వ్రేతకు బల్కు మురారిగొల్చెదన్”

గోపిక:-
ఎవరు నాయనా నువ్వు?

బాల కృష్ణుడు:-
బలరాముడి తమ్ముడిని(దెబ్బలు పడితే తోడు ఉండాలని ఆయన్ను కూడా లాగాడు. అదో లీల!)

ఇక్కడేమి పని? పైగా నా గుమ్మం మీద వెన్న కుండలో చెయ్యి పెట్టి ఉన్నావు?

ఊరుకోమ్మా! నోరు పెద్దది చేసుకుని అరవకు. మా చిన్ని తెల్ల దూడ గుంపులో నుండి తప్పి పొతే…తెల్లగా కనిపిస్తే…కుండలో చెయి పెట్టి వెతుకుతున్నా… నువ్వరిస్తే దూడ బెదిరి పారిపోతుంది.

ఓర్నాయనోయ్! ఏమి బరితెగింపు పిల్లాడమ్మా! ఎన్నడూ కానమమ్మ ఇటువంటి శిశువు…అని గోపిక కళ్లప్పగించి కృష్ణుడినే చూస్తూ ఉంటే...ఆ కొంటె కృష్ణుడు వెన్న ముద్ద నోట్లో పెట్టుకుని…వెళుతూ వెళుతూ ఆ గోపిక మొహానికి కూడా వెన్న పూశాడు. అటువంటి వేళ కృష్ణుడికి నా నమస్కారం.

యశోద ముంగిటి ముత్యము…

యశోద:-
నాయనా! నీ అల్లరి భరించలేకుండా ఉన్నాను. రాత్రిళ్లు బూచాళ్లు వస్తారు. పట్టుకుపొమ్మంటాను.

బాల కృష్ణుడు:-
భుజాల దాకా ఉన్న చిక్కటి నల్లటి వెంట్రుకలను మొహం మీద వేసుకుంటూ…అమ్మా! చీకటిగా ఉంది. బూచాడు పట్టుకుపోతాడా ఇప్పుడు నన్ను?

పిచ్చి పిల్లాడు…ఇంత అమాయకంగా ఉన్నాడు. రేప్పొద్దున ఈ పాడులోకంలో ఎలా నెగ్గుకు వస్తాడో ఏమో! అని తల్లి యశోద దిగులుపడుతున్న వేళ వెంట్రుకల చాటున నవ్వే కళ్లతో ఉన్న కృష్ణుడికి నా నమస్కారం.

కృష్ణుడిలో రాముడు

శ్లోకం:-
“రామోనామబభూవహుంతదలబలాసీతేతిహుం తాంపిత
ర్వాచాపంచవటీవనేవిహరత స్తస్వాహరద్రావణః
నిద్రార్థంజననీకధామితిహరేర్హుం కారతశ్శృణ్వత
స్సౌమిత్రైక ధనుర్ధనురితివ్య గ్రాగిరః పాతునః”

పద్యం:-
“ఇలలో రాఘవుడొప్పువాని సతియయ్యెన్ సీతవారిన్వనం
బులకుంబంచె గురుండటంచు నిదురంబొందించునయ్యంబ
పల్కులు దానూకొని రావణుండు మహిజన్ గొంపోయెనానుల్కి వి
ల్విలు దేలక్ష్మణయంచుబల్కు హరి యుద్వేలోక్తి నన్ బ్రోవుతన్”

బాలకృష్ణుడు:-
అమ్మా! నువ్ కథ చెప్తూ జోకొడితేనే పడుకుంటాను.

యశోద:-
సరే అలాగే. కళ్లు మూసుకో. త్వరగా పడుకో. ఇప్పటికే బాగా పొద్దు పోయింది. అనగనగా అయోధ్య. రాజు దశరథుడు. ఆయన కొడుకు పితృవాక్య పరిపాలనలో భాగంగా సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. అడవిలో పంచవటి దగ్గర రావణుడు సీతమ్మను అపహరించి…తీసుకెళ్లాడు.

అంతే….
కృష్ణుడు….ఉలిక్కి పడి లేచి…లక్ష్మణా! ధనుస్సు, ధనుస్సు అందుకో… అని గట్టిగా అరిచాడు.

నిద్రలో మావాడికేదో పీడకల వచ్చినట్లుంది…అని దిష్టి తీసి…థూ థూ అని ఉమ్మి…చేతులు కాళ్లు కడుక్కుని వచ్చి…మళ్లీ జోకొట్టి నిద్రపుచ్చింది. త్రేతా- ద్వాపర రెండు యుగాల్లో, రెండు అవతారాల్లో ఒకడే అయిన అవతార పురుషుడికి నా నమస్కారం.

అందరూ కృష్ణులే

బృందావనంలో సాయం సంధ్య. చుట్టూ జనం కేరింతలు. కోలాటాలు. చప్పట్లు. ఈలలు. హర్షధ్వానాలు. మొదట కృష్ణుడు ఒకడే వచ్చాడు. వేనవేల గోపికలు. నెమ్మదిగా కృష్ణుడి నాట్య వేగం పెరిగింది. అంతే చూసే వారి కన్నుల పంట అయ్యింది. గోపికకు గోపికకు మధ్య కృష్ణుడు. కృష్ణుడికి కృష్ణుడికి మధ్య గోపికలు. చివరకు గుండ్రంగా వేగంగా తిరుగుతుంటే అందరూ కృష్ణులే. అంతా కృష్ణమయం. అలాంటివేళ బృందావన నాట్య కృష్ణుడికి నా నమస్కారం.

గోవుల్లో కృష్ణుడు

బృందావనంలో పక్షులు గూళ్లకు వెళ్లే వేళయ్యింది. యమున ఒడ్డుకు మేతకు వెళ్లిన ఆవులన్నీ ఇళ్లకు వస్తున్నాయి. ఒకే క్షణంలో ప్రతి ఇంటి పెరట్లో ప్రతి ఆవును కృష్ణుడే తాళ్లతో కడుతున్నాడు. ఒళ్లంతా గోధూళి. చేతిలో చెర్నాకోల. బొడ్లో దోపుకున్న వేణువు. బట్టలంతా బురదమయం. అలాంటివేళ కృష్ణుడికి నా నమస్కారం.

ఇలా కావ్యంలో ఎక్కడ పట్టుకున్నా అమృతపు చినుకులే. వినగానే బృందావన విహారాలే.

రేపు:-
అందానికి అందం కృష్ణుడు

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్