Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీకృష్ణ కర్ణామృతం-5 (చివరి భాగం)

శ్రీకృష్ణ కర్ణామృతం-5 (చివరి భాగం)

అన్నమయ్య కృష్ణుడు

పల్లవి:-
పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటి దైవమని బ్రహ్మాదులు

చరణం-1
రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబర భాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చరణం-2
నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేని వేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చరణం-3
ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-
బద్దులబాలుని వద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు

అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, పోలికలతో పురాణ కథల మర్మాలను చెప్పడంలో అన్నమయ్యది అసామాన్యమయిన శైలి. వేటూరి వారన్నట్లు- “అన్నమయ్య జానపదం జ్ఞానపథం; వెలుగు పథానికి తెలుగు పదం”.

దొంగను ఎవరయినా పట్టుకుంటారు. పట్టుకుని దోషిగా విచారణ చేస్తారు. నేరం రుజువయ్యాక శిక్షిస్తారు. దొంగను దొంగగానే చూస్తారు. సామాజికంగా దొంగకు దూరంగా ఉంటారు. దొంగ అంటేనే భయపడతారు. అలాంటిది పాలు, పెరుగు, వెన్న, మీగడలు కుండలకు కుండలు దొంగిలించిన ఒక పాలదొంగ దగ్గరికి వచ్చి…మాపాలిటి నువ్వే దైవమని బ్రహ్మ మొదలు దేవతలందరూ కాళ్లా వేళ్లా పడుతున్నారట.

పొద్దున్నే యశోద వెన్న చిలుకుతూ ఉంటే…అమ్మా ఆకలి…వెంటనే వెన్న పెట్టు…అది పెట్టు…ఇది పెట్టు…అని ఒకటే విసిగిస్తున్నాడు. అలిగి…ఇంట్లో వస్తువులన్నీ చిందర వందర చేస్తున్నాడు. బయటికి పంపితే ఊళ్లో వాళ్లతో గొడవలు…ఇంట్లో ఉంటే ఏ పనీ చేసుకోనివ్వడు. దాంతో ఏమి చేయాలో పాలుపోక చివరికి ఉట్టికి కట్టే నాలుగయిదు తాళ్లను కలిపి ముడి వేసి ఒక కొసను పిల్లాడి నడుముకు మరొక కొసను రోటికి కట్టి…పనిలో మునిగిపోయింది. ఆ పిల్లాడేమో రోటిని లాక్కుంటూ వెళుతుంటే…పైన ఆకాశంలో నారదాదులు నిలుచుని…వాళ్ల వాళ్ల సమస్యలు ఆ పిల్లాడికి చెప్పుకుంటున్నారు.

రెండు చేతులతో వెన్న కుండల్లో చేతులు పెట్టి విసుగు విరామం లేకుండా తింటూనే ఉన్న పిల్లాడి మూతి చుట్టూ వెన్న. పొట్ట మీద వెన్న చారలు. ఒళ్లంతా జిడ్డు. అలాగే వీధిలోకి వెళ్లి దుమ్ము ధూళిలో ఆడుకుంటున్నాడు. జిడ్డుకు దుమ్ము అంటుకుంది. నోట్లో జొల్లు కారుతోంది. అలాంటి పిల్లాడి ముందు నిలుచుని ఆదిశేషుడు మొదలయిన వాళ్లు వేదాలను క్రమ ఘన ఝట పద్ధతుల్లో స్వరయుక్తంగా పాడుతున్నారు.

వీధిలో అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లాడిని చూడడానికి ఊరు ఊరంతా మూలల్లో దాక్కుని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తోంది. “హమ్మయ్య! ఇక్కడున్నాడు వెంకన్న రూపంలో” అని సనక సనందాదులు ఆ పిల్లాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తమ కష్టసుఖాలను చెప్పుకుంటున్నారు.

“బాల కృష్ణుడు” అన్న మాటే చెప్పకుండా చివరికి…ఆ బాలకృష్ణుడిని వెంకన్నగా మార్చిన అన్నమయ్య విన్యాసం ఇంకెన్ని యుగాలకయినా ఇంకొకరికి అసాధ్యం.

పోతన కృష్ణుడు

భాగవత పద్యం:-
“కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె”

అర్థం:-
ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ మురళిని తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. ఆవులను అదిలించేందుకు చిన్న బెత్తం, కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడమ చంకలో ఇరికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమి ఉన్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. ఇంకాస్త కావాలి…ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయలవి. అది వేళ్ల సందుల్లో ఇరికించాడు. హాయిగా స్నేహితుల మధ్య కూర్చుని…ఊసులాడుకుంటూ…నవ్వుతూ …తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు కృష్ణుడు.

పద్యం:-
“ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని
న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?”

అర్థం:-
వేదాలు నీగురించి చెబుతాయే గానీ…నిన్ను దర్శించ లేవు కదా! అటువంటి నిన్ను ఈ భూలోకంలో…ఈ అడవిలో…ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు. ఈ గోపకులు “కృష్ణా! కృష్ణా!” అని నిన్ను పిలుస్తూ అన్ని భావాలు నీలోనే లీనం చేస్తున్నారు. ఈ పిల్లల్లో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన పెట్టుకుంటే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు?

యమున ఒడ్డున ఆవులను మేపుకుంటూ ఎండ పొద్దున చెట్టుకింద కృష్ణుడి చుట్టూ చేరి పిల్లలు వారి ఎంగిలి ఆయనకు పెడుతూ, ఆయన ఎంగిలి వారు తింటున్నవేళ చెట్టు చాటునుండి చూస్తున్న బ్రహ్మ అన్న మాట ఇది. యజ్ఞపురుషుడైన శ్రీకృష్ణుడికి యజ్ఞం ద్వారా హవిస్సు అగ్నికి ఇస్తే ఆయన తీసుకెళ్లి ఇవ్వాలి. ఇక్కడ యాగభోక్త అయిన కృష్ణుడు నేరుగా చేయి చాచి తింటున్నాడు. ఈ పిల్లలది ఎంత పుణ్యమో! వీరి పాదధూళిలో ఒక కణాన్ని నెత్తిన మోసినా చాలు…ఎందుకు నాకీ పేరు గొప్ప బ్రహ్మ పదవి?

అరచేతిలో మీగడ పెరుగన్నం, వేళ్ళమధ్య ఆవకాయ ముక్కలతో పోతన కృష్ణుడికి తెలుగు తోడుబెట్టిన రుచులు, పెరుగన్నం ముద్దలు, చల్ది మూటలు విప్పి కొసరి కొసరి తినిపించాడు…సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మే అసూయపడేంతగా.

త్యాగయ్య కృష్ణుడు

పల్లవి:-
సామజ వర గమన ! సాధు హృ
త్సార సాబ్జపాల ! కాలాతీత ! విఖ్యాత !

అనుపల్లవి:-
సామనిగమజ సుధామయ గానవి
చక్షణ ! గుణశీల ! దయాలవాల ! మాంపాలయ;

చరణం:-
వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప ! స్వీకృత
యాదవకుల మురళీ వాదన వి –
నోద ! మోహన కర ! త్యాగరాజ వందనీయ !

కీర్తన అర్థం:-
ఏనుగు నడకలాంటి గంభీరమైన నడకతో, మునుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ! నువ్వు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అతీతమైనవాడివి. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే. గుణానికి, దయకు నిలువెత్తు రూపం నీవు. నన్ను కూడా నీవే నడిపించాలి.

వేదాలకు తలమానికమైన భాగంనుండి సప్తస్వరాలు పుట్టాయి. అవి నాదరూపంలో కొండంత వెలుగుగా కృష్ణుడి మురళిలో ప్రతిఫలిస్తున్నాయి.

ఇంత పవిత్రమైన, సంగీతం పుట్టుకను నిర్వచించిన, మురళీగానం లోతును తెలిపిన…సకల సంప్రదాయ సంగీతాలకు పరమార్థం తెలిపిన కీర్తన “సామజవరగమనా!” అర్థం తెలియక వాడకూడని చోట్లల్లా వాడుతూ పాపం మూటగట్టుకుంటున్నాం.

సి నా రె కృష్ణుడు

“వంశీకృష్ణా! యదు వంశీకృష్ణా!
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా!

ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది
ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నీవేలే
అన్నీ నీ లీలలే”

చిత్రం : వంశవృక్షం(1980)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, శైలజ

వేటూరి కృష్ణుడు

“వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆ నందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి? మొహనమురళీ!

కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ!

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ!

వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురళి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ!

మధురానగరిలో యమునాలహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ!”

చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం : పి. సుశీల

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్