Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెళ్లిళ్లు - యుద్ధాలు

పెళ్లిళ్లు – యుద్ధాలు

యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం, అలజడి, ఆందోళన, సిగపట్లు , బాహాబాహీ , యుద్దాలతోనే మొదలవ్వాలి. ఇరుపక్షాలు అలసి యుద్ధం ఆగలేకానీ…యుద్ధం దానికదిగా ఆగదు. అయోధ్యలో సయోధ్యల గురించి మనం రామాయణంలో చదువుతాం. ప్రతి ఊళ్ళో రాముడి ఆలయం కట్టి పూజలు చేస్తాం. కానీ రాముడి ఆదర్శాలను మాత్రం ఆచరించలేం.

నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఒక పెళ్లి. ముహూర్తానికి పెళ్లి జరిగింది. భోజనాల దగ్గర అంతా సందడి సందడిగా ఉంది. పెళ్లి కొడుకు మిత్రుల బృందం వచ్చి విందు బంతిలో కూర్చుంది. వడ్డనలు మొదలయ్యాయి. ఇతరులతో పోలిస్తే తమకు మటన్ ముక్కలు తగ్గినట్లు పెళ్లికొడుకు మిత్రులు గమనించారు. ఆవురావురుమని తిందామనుకున్న వారి మటన్ మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. మటన్ ముక్కల వడ్డింపులో అన్యాయాన్ని, అసమతౌల్యాన్ని తీవ్రధ్వనితో ప్రశ్నించారు. ఇది తమకే కాక అప్పుడే తాళి కట్టిన పెళ్లి కొడుక్కు కూడా జరిగిన ఘోరమైన అవమానంగా భావించారు. మాటామాటా పెరిగింది. పచ్చని పందిట్లో పెళ్ళికొడుకు తరుపువారు- పెళ్లికూతురి తరుపువారు రెండుగా చీలిపోయారు. అక్కడే అందుబాటులో ఉన్న గరిటెలు, కత్తులు, రోకళ్లు, గిన్నెలు ఎవరి చేతికి దొరికినవి వారు అందిపుచ్చుకుని సుహృద్భావ వాతావరణంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. కొందరికి చేతులు విరిగాయి. కొందరికి కాళ్లు విరిగాయి. ఒకరిద్దరికి నడుములు విరిగాయి. దూకుడుగా ఉన్న యువకులకు తలలు మాత్రమే పగిలాయి. పోలీసులు రంగప్రవేశం చేసేదాకా పందిట్లో ఈ రక్తదాహం తీరలేదు. పెళ్ళికొడుకు- పెళ్లికూతురు రెండు వైపులా కలిపి 19 మందిమీద కేసు రిజిస్టర్ చేశారు.

పగిలిన తలలు పందిట్లో తినని మటన్ ముక్కలు ఎప్పుడు తింటాయో మరి!

కొంచెం వెనక్కు వెళితే… వెలుగులు వెలిగే సూర్యుడి పేరుతో సూర్యాపేట తెలంగాణాలో ఒక జిల్లా. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఒక ఊళ్ళో ఒక పెళ్లి జరిగింది. అంతా సవ్యంగా జరిగితే ఈ ప్రస్తావనే అనవసరం. మాంగళ్య ధారణ కాగానే బరాత్ ఊరేగింపు డి జె దగ్గర వచ్చింది యుద్ధం.

చెవులు చిల్లులు పడేలా పాటలు వినిపిస్తుంటే ఎగిరేవారు ఎగురుతుంటారు; ఎగరలేనివారిమీద ఎగిరేవారు ఎలాగూ అదుపుతప్పి పడతారు. గుండెలు అదిరి ఆగిపోయేంతగా శబ్దతరంగాలు తగులుతుంటాయి. మొదట పబ్బుల్లో తప్పతాగిన వారు ఎగిరి గంతులేయడానికి ఉద్దేశించిన డి జె ఇప్పుడు పెళ్ళికి పేరంటానికి విస్తరించింది. ఏ శబ్దం వింటే మన చెవులకు ఇంకేమీ వినపడదో, ఏ శబ్దం వింటే అది ఏ భాషో అర్థం కాదో, ఏ శబ్దం వింటే మనలో మనిషి చచ్చి మృగం మేల్కొంటుందో దాన్ని ఆధునికులు డి జె అంటారు.  అబ్బాయి తరుపువారు హడావుడిలో ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ముందుగా అనుకున్నట్లు డి జె కూడా పెడితే తెలివి తెల్లవారుతుంది. చీకటిపడకుండా బయలుదేరాలి కాబట్టి డి జె కు మంగళం పాడదామన్నారు అబ్బాయి తరుపు బంధువులు. అమంగళమయినా డి జె పాడాల్సిందే, ఊరేగింపు ఊరంతా తిరగాల్సిందే అన్నారు అమ్మాయి తరుపు అబ్బాయిలు. అమ్మాయి తరుపు అబ్బాయిలు – అబ్బాయి తరుపు అబ్బాయిలు పాటలపంతాలకు పోయారు. మాటా మాటా పెరిగింది. డి జె శబ్దవిధ్వంసం లేకుండానే డి జె పెట్టనందుకు విధ్వంసానికి దిగారు. సూర్యుడినే లెక్కపెట్టం – సూర్యాపేట పౌరుషం చూస్తారా! అని అమ్మాయి బంధువులు – ఒంగోలు ఎద్దుకొమ్ముల వాడి చూస్తారా అని అబ్బాయి బంధువులు కొట్టుకున్నారు ; తిట్టుకున్నారు ; కుర్చీలు విసురుకున్నారు. పిల్లల గొడవ పిల్లలకే వదిలేస్తే బాగోదని పెద్దలు కూడా కలియబడ్డారు. పెళ్లికి వీడియో తీయాల్సినవారు ఈ యుద్ధాన్ని వీడియోలు తీసి అన్ని మాధ్యమాలకు వెంటనే పంపారు.

ఇందులో లోతుగా చూడాల్సిన కొన్ని అంశాలున్నాయి. సంగీతానికి ఎవరయినా చెవులే కోసుకోవాలి. అంటే సంగీతానికి హింసకు భాషలో నుడికారమే అనుబంధం, అంగీకారం చెప్పింది. చెవులు కోసుకునేప్పుడు నాలుక, ముక్కు, తలకోసుకోవడం కూడా సంగీతాభిమానంలో భాగమే అవుతుంది తప్ప శిక్షాస్మృతి చెప్పే నేరం కాబోదు . వాక్కు అర్థానికి కాళిదాసు దైవత్వం ఆపాదించాడు – వాగర్థావివ అని. శబ్దానికి హింసత్వాన్ని ఆపాదించారు సూర్యాపేటలో. దక్షిణాదిలో మద్రాసువారిలా మనకు సంగీతాన్ని ఆస్వాదించే టేస్ట్ లేదని పండితులు అనవసరంగా ఆడిపోసుకుంటారు. డి జె సంగీతానికి ప్రాణమిస్తాం ; కావాలంటే ప్రాణం తీస్తాం అని సూర్యాపేట వివాహ డి జె విధ్వంస విభావరి రుజువు చేస్తోంది.

ఇంకా కొంచెం వెనక్కు వెళితే…
అనంతపురం జిల్లాలో నేను రిపోర్టర్ గా పనిచేస్తున్న రోజులు. హిందూపురంలో నా క్లాస్ మేట్ వాళ్ళ అన్న పెళ్లి కుదిరింది. ఆ రోజుల్లో పెద్ద ఊళ్ళల్లో ముగ్గురు నలుగురే రిపోర్టుర్లు ఉండేవారు. గుత్తిలో అమ్మాయి వారింటి దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి. అప్పట్లో రిపోర్టర్ కు సంఘంలో ఒక మర్యాద. పెళ్లికి బస్సు వేశాం , తప్పకరావాలి అని మొహమాటపెట్టారు. ఆ రోజు రానే వచ్చింది. బస్సుకు కొబ్బరాకులు కట్టారు. మంగళహారతి ఇచ్చి దిష్టి తీశారు. బస్సు బయలుదేరింది. మధ్యాహ్నానికి గుత్తి చేరాం. విడిది గదుల్లో దిగిన మాకందరికి బాదం ఆకుల్లో చౌ చౌ బాత్ పెట్టారు. కొద్దిగా ఉప్మా , కొద్దిగా స్వీట్ కేసరి – ఇది కర్ణాటక పద్దతి. టీ లు , కాఫీలు వచ్చాయి. రాత్రికి పెళ్లి. ఖాళీగా కూర్చోవడం ఎందుకు ? గుత్తి కోట చూసి వద్దామని నేను , నా మిత్రుడు ఒక ఉపాధ్యాయుడు బయటికి వచ్చేశాం. అంతెత్తు కోట, చిన్న గుడి , కాసేపు తిరిగి నెమ్మదిగా ఊరంతా తిరుగుతూ సాయంత్రం చీకటి పడుతుండగా ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరాము. బయటే మా ఫ్రెండు ఒకడు మా ఇద్దరి బ్యాగులు పట్టుకుని నిలుచుని ఉన్నాడు. మా ఇద్దరి చేతులు పట్టుకుని పక్కసందులోకి తీసుకెళ్లాడు. ఒక రిక్షా ఎక్కి గుత్తి బస్టాండుకు వచ్చాము. అనంతపురం బస్సెక్కి వచ్చేశాం , అక్కడ మళ్ళీ హిందూపురం బస్సెక్కి అర్ధరాత్రికి ఊరు చేరాం.

తరువాత రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చినవార్త.

పెళ్లి కొడుకు తరఫువారు అడిగినవి వండి పెట్టలేదని గుత్తి పెళ్ళిలో విధ్వంసం. పెళ్ళికొడుకు తలను గాడ్రెజ్ కుర్చితో కొట్టిన పెళ్లికూతురి మేనమామ. ఇరు పక్షాల బాహాబాహీ. మొత్తం 14 మందికి తీవ్రగాయాలు. కేసులు. పోలీసుల రంగప్రవేశం. ఆగిన పెళ్లి – అని.

ఇప్పటికీ హిందూపూర్ వెళితే నా క్లాస్ మేట్ అడుగుతుంటాడు- ఆరోజు మీరు ముగ్గురు ఏమయిపోయారు ? అని . అంటే 14 ప్లస్ 3 – కలిపి 17 తలలు కాలేదని వాడి బాధో ఏంపాడో ?

పెళ్లిలో సరదాగా పంతాలు పట్టింపులు ఒకస్థాయి వరకు పర్లేదు. డి జె పాటలకు , చికెన్ ముక్కలకు తలలు పగులకొట్టుకునేంత పంతాలు, పట్టింపులు అయితే – ప్రతి పెళ్లి పోలీసు సెక్యూరిటీ మధ్య జరగాల్సి ఉంటుంది. పెళ్లి రెండు కుటుంబాల కలయిక; రెండు మనసుల కలయిక. వెతికేవారికి శ్రీరామచంద్రుడిలో కూడా తప్పులే కనపడతాయి. కలిసిమెలసి ఉండాలనుకునేవారికి మనసు ఒక్కటే మాట్లాడుతుంది. డి జె లు గాలికి కలిసిపోతాయి. చికెన్ ముక్కలు జీర్ణమయిపోతాయి. కానీ అనుకున్న మాటలు ఈటెలై గుచ్చుకుంటూనే ఉంటాయి. కలవాలనుకునే వారు భరిస్తారు; విడిపోవాలనుకునేవారు కారణాలు వెతుక్కుంటారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్