Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఈ కుక్క ఆస్తి అక్షరాలా రూ. 3,300కోట్లు

ఈ కుక్క ఆస్తి అక్షరాలా రూ. 3,300కోట్లు

“మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు;
వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం;
మమ్మల్ను ఎవరూ చూసుకోరు”– అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం.

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.

వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.

అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండుకుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు కుక్కప్రేమలో మునిగి తేలుతూ కుక్కలాగే వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు సాటి మనుషులతో అత్యంత కటువుగా ఉంటూ…పెంపుడు కుక్కలతో మాత్రం అత్యంత కరుణతో ఉంటారు.

“కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!”
బంగారపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా…కుక్క కుక్కే అని సుమతీ శతకకారుడు తేల్చి పారేశాడు.

“చెప్పు తీపెరుగు కుక్క చెరకు తీపెరుగునా”
అన్న సామెత మీద అఖిలభారత శునక సమాఖ్య అనాదిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా…సామెత మనుగడలోనే ఉంది.

కుక్క తనను తాను ప్రేమించుకుంటుందో లేదో కానీ తన యజమానిని మాత్రం అమితంగా ప్రేమిస్తూ ఉంటుందని కుక్కల సారీ… వెటర్నరీ డాక్టర్లు చెబుతూ ఉంటారు.

“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు”
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న.

ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి బతుకే కుక్క కంటే హీనంగా ఉంది. కావాలంటే తాజాగా ఈ మహా సంపన్న శునక వైభోగ సాక్ష్యం చూడండి!

జర్మనీలో కర్లోటా లీబెన్ స్టీన్ సంపన్నురాలు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. అంతకుముందే భర్త చనిపోయాడు. ముసలి వయసులో తోడుకోసం ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంది. గుంథెర్-6 అని పేరు పెట్టుకుంది. పోయేముందు తన యావదాస్తిని ఆ కుక్క పేరిట పత్రాలు రాసి…తన ఇటలీ మిత్రుడు మౌరిజియో మియాన్ కు శునక సంరక్షణ బాధ్యతలను అప్పగించి…హాయిగా కన్నుమూసింది. ఆ మిత్రుడు అంతే బాధ్యతగా ఆ సంపదను ఇబ్బడి ముబ్బడి చేసి…తన స్నేహితురాలి కోరికను శునకార్థం చేసి… చరితార్థం చేశాడు.

ఇప్పుడు గుంథెర్-6 గారి పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల విలువ అక్షరాలా 3,300 కోట్లు. ఆకాశంలో ఎగరడానికి ఒక ప్రయివేటు విమానం, సముద్రంలో విహరించడానికి ఒక ప్రయివేటు నౌక, రోడ్డు మీద తిరగడానికి బీ ఎం డబుల్యు వాహనశ్రేణి ఉన్నాయి. శునకరాజమును చూసుకొనుటకు 27 మందితో కూడిన సేవకుల బృందము కూడా సదా సిద్ధముగానుండును. ప్రధాన చెఫ్ అనగా వండిపెట్టే పెద్ద తల ఏ పూటకాపూట శునకముగారికి వైవిధ్యభరిత రుచులతో వండి పెట్టుదురు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన శునకంగా గుంథెర్-6 గారికి పేరు ప్రతిష్ఠలు వచ్చిన నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ వారు ఈ శునక మహా వైభోగం మీద ఒక డాక్యుమెంటరీని నిర్మించారు. దానితో ఈ కుక్క వైభోగంమీద సాటి కుక్కలతోపాటు లోకం కూడా కుళ్లుకోవడం మొదలయ్యింది.!

“కుక్క తోకను ఆడిస్తే పరవాలేదు!
తోకే కుక్కను ఆడించకూడదు!!”
అని సామెత.
గుంథెర్ కుక్క తోకను జాడించకుండానే లోకాన్ని ఆడిస్తోంది!

ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది!
గుంథెర్ కుక్కకు ప్రతి రోజూ కాళ్లదగ్గరికే వస్తోంది!!

కొస మెరుపు:-                                           హాలీవుడ్ ప్రఖ్యాత నటి మర్లిన్ మడోనాకు చెందిన మియామీ బీచ్ ఇంటిని ఈ కుక్క కొనడంవల్ల కొన్నేళ్లపాటు మడోనా పడుకున్న పరుపుమీద పడుకోవడానికి జర్మనీనుండి సొంత విమానంలో వెళ్లి వచ్చేది. ఈమధ్యే మంచి రేటు వచ్చిందని మడోనా ఇంటిని కుక్క అమ్ముకుంది- సారీ కుక్క సంరక్షకుడు అమ్మి పెట్టారు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్