Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంత్రిమూర్తులే నినుగని తలొంచరా!

త్రిమూర్తులే నినుగని తలొంచరా!

“దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా!దయుంచయ్యా దేవా!
నీ అండాదండా ఉండాలయ్యా!
చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా!
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా!

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా?లంబోదరా!
పాపం కొండంత నీ పెనుభారం!
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం

అంబారిగా ఉండగల ఇంతటి వరం.. అయ్యోర అయ్య
అంబాసుతా ఎందరికి లభించురా?
అయ్యోర అయ్య!
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా!

శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా! తగిన ఫలం దక్కిందిగా!
ఏమైపోయింది గర్వం?

త్రిమూర్తులే నిను గని తలొంచరా!
అయ్యోర అయ్య
నిరంతరం మహిమను కీర్తించరా!
అయ్యోర అయ్యా
నువ్వెంత అనే అహం నువ్వే దండించరా”

రచన- సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం- ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
సంగీతం – ఇళయరాజా
సినిమా – కూలీ నంబర్ వన్ (1991)

రొటీన్ సినిమాలో రొటీన్ కథ. డబ్బున్న హీరో యిన్. డబ్బు లేని కూలీ నంబర్ వన్ హీరో. ఆ హీరో యిన్ ను ఆట పట్టించే సందర్భంలో ఒక రొటీన్ ఫార్ములా పాట ఉండాలి. కానీ సిరివెన్నెల దాన్ని రొటీన్ కాకుండా అసాధారణ సన్నివేశం చేశారు. సినిమా సందర్భం దాటి గణపతి ముందు తెలుగు జనం ఎగిరి గంతులు వేయడానికి వీలుగా పదాలను అల్లారు.

హీరో యిన్ ను వేళాకోళం చేసే హీరో చేత వినాయకుడి తత్వాన్ని విడమరిచి చెప్పారు. చిన్నారి చిట్టెలుక అంతటి గణపతి భారాన్ని ఎలా మోస్తోందోనని మనం ఆశ్చర్యపోయి…ఆపై ఆలోచించేలా చేశారు. అలా మోయడం జన్మ ధన్యం అన్నారు. అంబారిగా ఉండగల అంతటి వరం ఎందరికి లభిస్తుందని ప్రశ్నిస్తూ ఎలుకనెక్కిన ఏనుగు కథా చిత్రాలను వర్ణించారు.

శివుడి తలపై చేరిన చంద్రుడికి వచ్చిన అహంకారం;
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు భక్తిగా గణపతికి మొక్కడం…లాంటి పురాణ కథలను బంధించారు. “నా అంతటి వాడు లేడు” “నువ్వెంత?” అని మేము అహంకరిస్తే నువ్వే దండించు స్వామీ! అని వేడుకున్నారు.

ఇంకో పాటలో బుజ్జి గణపతి పదహారణాల తెలుగులో పార్వతిని ఓదారుస్తున్నాడు. ఇది పురాణాల్లో లేని సందర్భం. కల్పిత సినిమా కథలో సందర్భం. కానీ…గణపతి అమ్మవైపు నిలుచుని వాదిస్తే ఎలా ఉంటుందో తెలిపే సందర్భం.

పల్లవి:-
జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా..
రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత?
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుట చేత

చరణం 1 :
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా

చరణం 2 :
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి..
సంతసాన మునిగింది సంతు లేని పార్వతి
సుతుడన్న మతి మరచి.. శూలాన మెడ విరిచి
పెద్దరికము చూపే చిచ్చుకంటి పెనిమిటి

ప్రాణపతినంటుందా?.. బిడ్డ గతి కంటుందా?
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న..  ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది..

చరణం 3:
ఆటు పోటు ఘటనలివి.. ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు.. అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కథలన్నీ ….

చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన :  సిరివెన్నెల
గానం :  చిత్ర, వాణీజయరాం

సినిమాల్లోకి రాకముందే గంగావతారణంతో రచయితగా తన కవిత్వాన్ని పవిత్రీకరించుకున్నవాడు సిరివెన్నెల. శివతత్వం అంటే ఆయనకు ఒళ్లు తెలియని పరవశం.

“జాలిగా జాబిలమ్మ…” పాటగురించి ఆయనతో ఏకబిగిన నాలుగుగంటలపాటు మాట్లాడే అదృష్టం ఈ వ్యాస రచయితకు దక్కింది. అదంతా రాస్తే పెద్ద గ్రంథమవుతుంది. “సార్! కాటుక కంటినీరు పెదవులనంటనీకు…” అనగానే పోతన “కాటుక కంటినీరు…” కళ్లముందు మెదులుతోంది అన్నాను. “అంతా అమ్మే! ఇదంతా ఆ బొమ్మే! సరస్వతినే ఓదార్చిన పోతన ఉండగా ఇంకో పోలిక ఎందుకు?” అంటూ కాళిదాసు, శంకరాచార్యులు, పోతన, శ్రీనాథుడు, అన్నమయ్య, రామదాసులు శక్తిని, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని ఎలా దర్శించారో వివరిస్తూ శక్తి విశ్వరూపాన్ని నాకు అక్షరాలా అక్షరాల్లో సాక్షాత్కారం చేయించారు. వాటన్నిటి సారం ఈ పాట.

చంద్రుడి పదహారు కళలు; కృష్ణపక్షం; చిరునవ్వు దీపకళిక; ఎప్పుడూ పొద్దుగుంకని కుంకుమ; సున్నిపిండి చిన్నారి; మెడ విరిచిన చిచ్చుకంటి పెనిమిటి; గొంతు నులిమే కాలకూటం; ఆటుపోటు ఘటనలేవీ అంటని ఆదిశక్తి...అన్నీ ఒక్కో ప్రతీక. ఒక్కో కథ. కలుపుకుంటే పెద్ద కథ. చివరికి ఏ కథ అయినా కంచికెళ్లాల్సిందే!

ఇలాంటివి రాయడానికి మళ్లీ సిరివెన్నెలే పుట్టాలి. ఇంకా ఇందులో లోతయిన గణపతి ఆరాధన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చాలు.

అలా మనం కూడా వినాయక చవితి పూట ఉండ్రాళ్లయ్యకు దండాలు పెడుతూ మనకు ఎక్కిన మదం దించి…కరుణించమని వేడుకుందాం.

వినాయకచవితి శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్