Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅంతరిక్ష సాహసి పుట్టినరోజు నేడు

అంతరిక్ష సాహసి పుట్టినరోజు నేడు

ఎప్పుడన్నా చుట్టాలింటికి వెళ్తే బాగానే ఉంటుంది. అక్కడ ఎంత బాగున్నా పని అయిపోగానే ఇంటికి వచ్చేయాలని ఉంటుంది. కరోనా టైం లో చాలామంది బంధువుల ఇళ్ళకి వెళ్లి చిక్కుకు పోయారని విన్నాం. వారిని నెలల తరబడి మేపలేక దివాలా తీసినవారూ ఉన్నారు. ఇలా బంధువులు తిష్ట వేయడం ఇదివరకు సాధారణమేమో కానీ ఈ బిజీ యుగంలో కాదు. ఇక్కడ ప్రతి నిముషం విలువైనదే. మరి అంతరిక్షంలో? ఆ సంగతి సునీతా విలియమ్స్ ని అడగాలి.

అంతా బాగుంటే ఈపాటికి తనవాళ్లతో పుట్టినరోజు వేడుకల్లో ఉండేది. అనుకోని అతిథిగా అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది మరి. సునీతా విలియమ్స్ కి అంతరిక్ష యాత్రల్లో అనుభవం బాగా ఉంది. దాంతో బోయింగ్ కంపెనీ తన మానవ సహిత అంతరిక్ష నౌక స్టార్ లైనర్ లో ఆమెను వారంరోజుల పర్యటనకు జూన్ 5 న పంపింది. వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉన్నా, స్పేస్ స్టేషన్ లో దిగాక స్టార్ లైనర్ లో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో సునీత భూమికి తిరిగి రావడం ఇబ్బందిగా మారింది. పైకి ఎంత నిబ్బరంగా ఉన్నా తన వారికి, భూమికి దూరంగా ఉండటం అనేక శారీరక మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది. సునీత కాబట్టి వాటిని తట్టుకుంటోంది.

ఈమె తండ్రిది గుజరాత్ లోని జులాకియా గ్రామం. సునీత కూడా ఆ ఊరిని సందర్శించింది. అక్కడివారు గర్వంగా మా అమ్మాయి అని సునీత గురించి చెప్పుకుంటారు. ప్రస్తుతం ఆ ఊరివారు సునీత క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అఖండ దీపం వెలిగించారు. ఈ రోజు సునీత 59 వ పుట్టినరోజు. ఆ సందర్భంగా యావత్ ప్రపంచం ఆమెకు శుభాకాంక్షలు చెప్తోంది. అన్నీ అనుకూలించి ఫిబ్రవరి లో స్పేస్ ఎక్స్ మిషన్ ద్వారా క్షేమంగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. భారమైన భారరహిత స్థితిని అలవోకగా దాటి స్ఫూర్తి దాతగా నేలపై అడుగెట్టాలని అభిమానుల కోరిక. ఈ సారికి ఆకాశంలో పుట్టినరోజు చేసుకున్నా మరిన్ని భూమిపై జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ బర్త్ డే సునీతా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్